నా రాజకీయ గురువు చంద్రబాబే.. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా.. : Actor Suman

ABN , First Publish Date - 2021-12-21T13:39:36+05:30 IST

నా రాజకీయ గురువు చంద్రబాబే.. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా.. : Actor Suman

నా రాజకీయ గురువు చంద్రబాబే.. ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తా.. : Actor Suman

విజయవాడ : రాజకీయ రంగంలోకి ప్రవేశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని సినీ నటుడు తల్వార్‌ సుమన్‌ చెప్పారు. అలాగని నామినేడెట్‌ పోస్టుల కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగే తత్వం కూడా కాదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తన అవసరం ఉందనిపిస్తే ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. విజయవాడ రూరల్‌ మండలం పి.నైనవరానికి చెందిన ఆలిండియా సుమన్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ధూళిపాళ్ల దేవేంద్రరావు నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన రాజకీయ గురువని తెలిపారు. రాజకీయ పాఠాలను ఆయన వద్దే నేర్చుకున్నట్టు తెలిపారు. టీడీపీకి మద్దతుగా ఉన్నానని, ఆయన బీజేపీతో జత కట్టినపుడు కూడా ఆయన వెంటే నడిచినట్టు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో మాత్రం టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. ఎవరు అభివృద్ధి పనులు చేస్తారో వారిని ఆదరించాలేగానీ, ఒక్క పార్టీపైనే ఆధారపడకూడదని సూచించారు. క్రిస్ట్‌మస్‌కు సినీ రంగంలోకి ప్రవేశించి 44 ఏళ్లు పూర్తవుతుందన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, ఒరియా సహా 600 సినిమాల్లో నటించినట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ తర్వాత రాముడు, వెంకటేశ్వరస్వామి పాత్రలు పోషించిన తనకు ప్రేక్షకుల నుంచి ఎంతో గుర్తింపు లభించిందన్నారు.  

Updated Date - 2021-12-21T13:39:36+05:30 IST