Muttiah Muralitharan: 11 ఏళ్ల క్రితం ఇదే రోజున..

ABN , First Publish Date - 2021-07-23T02:42:19+05:30 IST

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ

Muttiah Muralitharan: 11 ఏళ్ల క్రితం ఇదే రోజున..

కొలంబో: సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు నేలకూల్చిన తొలి క్రికెటర్‌గా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. క్రికెట్‌లో రోజుకో రికార్డు బద్దలవుతున్నా 11 ఏళ్ల క్రితం మురళీ నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ భద్రంగానే ఉంది.  


మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా గాలేలో జులై 22న ఇండియాతో జరిగిన తొలి టెస్టులో మురళీధరన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మురళీ.. ఈ మైలురాయిని చేరుకునేందుకు మరో వికెట్ అవసరమైంది. అయితే, అప్పటికే భారత జట్టు రెండో ఇన్సింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకుంది. దీంతో మురళీ 800 వికెట్లు మైలురాయిని చేరుకుంటాడా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగింది.


ఎందుకంటే ఈ టెస్టు ప్రారంభానికి ముందే మురళీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తొలి టెస్టు తర్వాత తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడంతో 800 వికెట్ దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్ క్రీడాభిమానుల్లో మొదలైంది.


అయితే, చివరికి ఆ సమయం రానే వచ్చింది. ప్రజ్ఞాన్ ఓఝాకు ఆఫ్ స్టంప్‌కు ఆవల సంధించిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి మహేల జయవర్థనె చేతుల్లో పడడంతో స్టేడియం మార్మోగిపోయింది. బాణాసంచా మోతెక్కింది. మురళీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆనందాన్ని పట్టలేని మురళీధరన్ మైదానంలో గెంతులు వేశాడు. సహచరులు కూడా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.  


మురళీధరన్ తన టెస్ట్ కెరియర్‌లో మొత్తంగా 113 మ్యాచ్‌లు ఆడాడు. వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం మురళీధరన్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టాడు. వన్డే చరిత్రలో ఇదే అత్యధికం.


మురళీధరన్ చివరి టెస్టు మ్యాచ్ అయిన గాలె టెస్టులో శ్రీలంక 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అప్పటి కెప్టెన్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. క్రికెట్‌లో మరో మురళీ భూతద్దం పెట్టి వెతికినా కనిపించడని అన్నాడు. మురళీధరన్‌కు 2017లో ‘ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌’లో చోటు దక్కింది.

Updated Date - 2021-07-23T02:42:19+05:30 IST