భగవద్గీత చెబుతున్నది-1

ABN , First Publish Date - 2020-04-24T15:00:50+05:30 IST

భారతదేశం‌ ప్రపంచానికి అందించిన అసమానమైన‌, మహోన్నతమైన పాఠం భగవద్గీత. ఇక్కడ గీత అంటే గీతం లేదా పాట అని అర్థం కాదు. గీతా‌(త)అన్న పదానికి "ఆధ్యాత్మిక, తాత్త్విక,‌ విషయమై ప్రశ్న జవాబుల

భగవద్గీత చెబుతున్నది-1

భారతదేశం‌ ప్రపంచానికి అందించిన అసమానమైన‌, మహోన్నతమైన పాఠం భగవద్గీత. ఇక్కడ గీత అంటే గీతం లేదా పాట అని అర్థం కాదు. గీతా‌(త)అన్న పదానికి  "ఆధ్యాత్మిక, తాత్త్విక,‌ విషయమై  ప్రశ్న జవాబుల రూపంలో ఉండే గ్రంథం" అని అర్థం. భగవద్గీతలోనే (అధ్యాయం 18,  శ్లోకం 70) ఇలా ఉంది: " అధ్యేష్యతే చ యం‌ ఇమం ధర్మ్యం సంవాద‌మావయోః"‌ అంటే ధర్మం తప్పని మన ఇద్దఱి ఈ సంవాదం  అని అర్థం.‌‌ అక్కడ‌ సంవాదం‌  (పరస్పర సంభాషణ‌ లేదా చర్చ) అనే చెప్పబడింది.


మహాభారతంలో భగవద్గీత అని లేదు.‌ తరువాతి కాలంలో ఈ పాఠానికి భగవద్గీత అన్న పేరు స్థిరపడింది‌‌.   భగవత్ అంటే దైవీ, పవిత్రమైన, మహిమాన్వితమైన, విశిష్టమైన అన్న అర్థాలున్నాయి కనుక ఆ అర్థాలతోనూ, కృష్ణ భగవానుడికి సంబంధించినది కనుక ఆ భావంతోనూ భగవత్ - గీతా(త) అని ఈ‌ పాఠం పేర్కొనబడింది. భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకాలు సరైన అర్థాల్లో మనకు అందలేదు. అంతే కాదు కొన్ని సందర్భాల్లో అవార్థాలు, అపార్థాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎన్నో గీతావాక్యాలకు స్పష్టమైన సత్యమైన అర్థాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకుందాం రండి.


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి బారత|

అభ్యుత్థానమధర్మస్య తదాSSత్మానం సృజామ్యహం|| (అధ్యాయం 4 శ్లోకం 7)


(యదా యదా) ఎప్పుడెప్పుడు (ధర్మస్య) ఉన్నతమైన లేదా బలమైన అలోచనకు (great or strong thought) (గ్లానిః) దౌర్బల్యమూ లేదా బడలికా (అధర్మస్య) ఉన్నతం‌ కాని లేదా బలహీనమైన ఆలోచన (cheap or week thought) కు (అభ్యుత్థానం) అభివృద్ధీ (భవతి) ఉంటుందో (భారత) భారత పుత్రుడా,‌(తదా హి) అప్పుడే (అహం) నేను (ఆత్మానం) పరాక్రమాన్ని (సృజామి) సృష్టిస్తాను. అని ఈ శ్లోకానికి అర్థం.


ఈ శ్లోకానికి  ముందున్న శ్లోకంలో  "అహం అజోSపిసన్ అవ్యయాత్మా" అంటే నేను పుట్టుకలేని వాణ్ణి, నాశనంలేని వాణ్ణి అని చెప్పబడింది‌. అలా చెప్పాక ఈ శ్లోకంలో ధర్మానికి గ్లాని, అధర్మానికి అభ్యుత్థానం కలిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటున్నాను అని‌ చెప్పడం జరగదు. ఆలాంటి అర్థం యుక్తమైనది కాదు. ధర్మ , ఆత్మ అన్న పదాలకు వేఱు వేఱు అర్థాలున్నాయి.  ఆ అర్థాలను సరిగ్గా  అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది.


ఈ యదా యదా హి ...  శ్లోకానికి తరువాత ఈ కింది శ్లోకం‌ చెప్పబడింది...


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం|

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||


(సాధూనాం)యోగ్యులలో  (పరిత్రాణాయ) రక్షణ కోసం, (దుష్కృతాం) పాపాల (వినాశాయ) నాశనం కోసం (చ) ఇంకా (ధర్మ) శక్తిని (strength)ను (సంస్థాపనార్థాయ) నిలబెట్టడం కోసం (యుగే యుగే) యుగయుగాలలోనూ (సంభవామి) ఆధారమౌతాను అని అర్థం. 


(అహం అజోSపిసన్ అవ్యయాత్మా) నేను పుట్టుకలేని వాణ్ణి, నాశనంలేని వాణ్ణి ...  అని చెప్పాక యుగయుగాల్లోనూ నేను పుడతాను అని చెప్పడం‌ జరగదు. సంభవం అంటే పుట్టడం అన్న ఒక్క అర్థమే కాదు ఆధారం అన్న అర్థమూ ఉంది. సంస్కృత పదాలకు సందర్భానుసారం విచక్షణతో, విజ్ఞతతో సరైన అర్థాల్ని గ్రహించాల్సిన‌ అవసరం‌ ఉంది.


భగవద్గీత అంటే అది కళ్లకద్దుకుంటూ‌ ఇంట్లో‌ పెట్టుకోవాల్సిన పుస్తకం కాదు. బుద్ధితో‌ చదివి సరిగ్గా అర్థం‌ చేసుకోవాల్సిన సత్యతత్త్వం, తత్త్వసత్యం.


రోచిష్మాన్

9444012279

rochishmon@gmail.com

Updated Date - 2020-04-24T15:00:50+05:30 IST