డబ్బుల కోసం మేనత్త హత్య

ABN , First Publish Date - 2020-09-10T10:24:08+05:30 IST

వారం రోజుల కిందట హన్మకొండ ట్రైలర్‌స్ర్టీట్‌లో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను

డబ్బుల కోసం మేనత్త హత్య

టైలర్‌స్ర్టీల్‌లో మహిళ హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు

మీడియా సమావేశంలో వెల్లడించిన ఇన్‌చార్జి సీపీ


వరంగల్‌ అర్బన్‌ క్రైం, సెప్టెంబరు 9: వారం రోజుల కిందట హన్మకొండ ట్రైలర్‌స్ర్టీట్‌లో జరిగిన ఓ మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాలకు పంపించారు. బుధవారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ కేసు వివరాలను వెల్లడించారు. 


వరంగల్‌ ఎస్‌ఆర్‌ఎర్‌తోటకు చెందిన దోర్నం శారద (38) భర్త పదేళ్ల కిందట మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి హన్మకొండ ట్రైలర్‌స్ర్టీట్‌లో నివాసం ఉంటోంది. హన్మకొండ కుమార్‌పల్లి మార్కెట్‌లో కూరగాయలు విక్రయిస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతుండగా, కుమారుడు నిఖిల్‌ హన్మకొండలో ఇంటర్‌ చదువుతున్నాడు. శారదకు స్వయాన అన్న కుమారుడు (మేనల్లుడు) అయిన ఆడెపు ఆకాశ్‌బాబు తరుచుగా మేనత్త వద్దకు వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఇంట్లో డబ్బులు, బంగారం ఎక్కడ పెడుతున్నారో చూస్తుండేవాడు. ఆకాశ్‌బాబుకు గంజాయి, మద్యం అలవాటు కావడంతో డబ్బుపై దుర్బుద్ధి కలిగింది. శారద తన కుమార్తె వివాహం కోసం డబ్బులు పోగుచేసి బీరువాలో భద్రపర్చడాన్ని గమనించాడు. వాటిని కాజేయాలని స్కెచ్‌ వేశాడు. 


ఈనెల 3వ తేదీన తెల్లవారుజామున 3గంటలకు శారద ఇంటి వెనుక తలుపులు తీసి ఉండడంతో ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢనిద్రలో ఉన్న శారద తలపై బండరాయితో విచక్షణారహితంగా కొట్టాడు. పక్కనే ఉన్న కుమారుడు నిఖిల్‌ తలపై కూడా బండరాయితో కొట్టి చనిపోయాడని భావించాడు. ఆ తర్వాత బీరువాలో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదు, 5 తులాల బంగారం, 3 సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో శారద మృతి చెందగా నిఖిల్‌ ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దొంగిలించిన డబ్బు, నగలతో హన్మకొండ వినాయకనగర్‌లో ఉన్న తన స్నేహితులు మేకల మచ్చేందర్‌తో పాటు మరో బాలుడి వద్దకు వెళ్లి ఆశ్రయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి డబ్బులతో హైదరాబాద్‌కు వెళ్లి జల్సా చేశారు. మంగళవారం రాత్రి హన్మకొండకు వచ్చినట్టు సమాచారం అందడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోని తీసుకుని విచారించారు. చేసిన తప్పును ఒప్పుకోవడంతో వారి నుంచి రూ.2.71నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో బాలుడిని బోస్టన్‌ జైలుకు.. అకాశ్‌, మచ్చేందర్‌ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు.


వారం రోజులు ముప్పు తిప్పలు

నిందితుడు పోలీసులకు ఎక్కడా ఆధారాలు లభించకుండా జాగ్రత్తపడ్డాడు. ఇద్దరు బీరువా మీదపడి మృతిచెందినట్టు నమ్మించడంతో పాటు హత్యకు ఉపయోగించిన బండరాయిని సైతం మురుగుకాల్వలో పడేశాడు. నిఖిల్‌ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలతో పాటు సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడకు వెళ్లడంతో విషయం తెలుసుకున్న నిందితులు తిరిగి హన్మకొండకు చేరుకున్నారు. హన్మకొండ వినాయకనగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్టు గుర్తించి అరెస్టు చేశారు. కేసును  ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఇన్‌చార్జి డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి సీఐ అజయ్‌యాదవ్‌, ఎస్‌ఐలు వేణగోపాల్‌, శ్రీనివా్‌సలను ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - 2020-09-10T10:24:08+05:30 IST