మునివాకిటే మహమ్మారి, మేల్కోండి!

ABN , First Publish Date - 2021-06-25T09:28:16+05:30 IST

అలలు అలలుగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల రెండు అలలు మనపై విరుచుకుపడ్డాయి. మొదటి అల 2020 మార్చి నుంచి నవంబర్ దాకా ఎంతో మందిని మృత్యుప్రాంగణంలోకి తీసుకువెళ్ళింది...

మునివాకిటే మహమ్మారి, మేల్కోండి!

అలలు అలలుగా కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల రెండు అలలు మనపై విరుచుకుపడ్డాయి. మొదటి అల 2020 మార్చి నుంచి నవంబర్ దాకా ఎంతో మందిని మృత్యుప్రాంగణంలోకి తీసుకువెళ్ళింది. 2021 మార్చి తొలినాళ్ళలో ప్రారంభమైన రెండో అల అసలు బతుకునే మృత్యు సీమగా మార్చి వేసింది. ఇప్పుడు కొవిడ్ కేసులు తగ్గు ముఖం పట్టినప్పటికీ ఈ రెండో హంతక అల ఇంకా చురుగ్గానే ఉంది. కొవిడ్ రెండుదఫాల విజృంభణ మధ్య తేడా ఏమిటి? రెండో విజృంభణతో పోలిస్తే మొదటి విజృంభణ మెల్లగా మరణమృదంగం మోగించింది. రెండో విజృంభణ స్వల్పకాలంలోనే పతాకస్థాయికి చేరింది. తొలిదశలో కంటే మలిదశలో మహమ్మారి సంక్రమణలు 82 శాతం పెరిగాయని కొవిడ్ డేటా విశదం చేసింది. కొవిడ్ మరణాలు మలిదశలో 30 శాతం అధికంగా సంభవించాయి. మొత్తం మీద ‘కేస్ ఫెటాలిటీ రేట్’ (దీనినే కేస్–ఫెటాలిటీ రేషియో అని కూడా అంటారు.) 1.43 శాతం నుంచి 1 శాతానికి తగ్గిపోయింది. నిర్దిష్టకాలంలో ఒక అంటువ్యాధి మూలంగా చనిపోయినవారి సంఖ్య అదేకాలంలో ఆ వ్యాధి బారిన పడ్డ వారి మొత్తం సంఖ్య మధ్య ఉన్న నిష్పత్తినే సాంక్రమికరోగ విజ్ఞానంలో కేస్ ఫెటాలిటీ రేట్‌గా పరిగణిస్తారు. ఒక అంటువ్యాధి లేదా మహమ్మారి తీవ్రతను ఈ రేట్ తెలియజేస్తుంది. తొలి విజృంభణలో కంటే రెండో విజృంభణలో కొవిడ్ సోకినవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దురదృష్టమేమిటంటే తొలిదశలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు రెండో దశలో కంటే చాలా తక్కువగా జరిగాయి.


కొవిడ్ విజృంభణ మూడోదశకు ఇప్పుడు మనం సంసిద్ధమవ్వాలి. కొవిడ్ సంక్రమణల హోరు నిలిపివేసే అంశాలు– విషమ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడాన్ని అలవరచడం, బాధ్యతాయుత ప్రవర్తనలు, వ్యాక్సినేషన్ (టీకాకరణ) మాత్రమే. వ్యాధి పీడితులను ఏకాంత నిర్బంధ వాసంలో ఉంచడం, కాంట్రాక్ట్ ట్రేసింగ్ మొదలైనవి కొవిడ్ సంక్రమణలను గణనీయంగా తగ్గించాయని రుజువయింది. ఈ చికిత్సా పద్ధతులకు తోడు తరచు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం మొదలైన ఆరోగ్యకర ప్రవర్తనలతో వ్యాధి బారినపడే ప్రమాదాన్ని దాదాపుగా నివారించుకోవచ్చు. చాలామంది ‘సామాజిక లేదా ప్రవర్తనాత్మక వ్యాక్సిన్’గా భావిస్తున్న ఈ చర్యలు తదుపరి, భావి కొవిడ్ అలల నియంత్రణకు ప్రధానాధారంగా కొనసాగుతాయి.


2021 జూన్ నాటికి దేశ జనాభాలో యాభైశాతం మందికి పైగా కొవిడ్ వ్యాధి సంక్రమించినట్టు దేశవ్యాప్తంగా సకలప్రాంతాలకు సంబంధించిన డేటా వెల్లడించింది. అత్యధికులలో వ్యాధి లక్షణాలు స్వల్పస్థాయిలోనూ లేదా గుర్తుపట్టలేని రీతిలో మాత్రమే ఉన్నాయి. ఇలా కొవిడ్‌ సోకినవారికి 3 నుంచి 6 నెలల పాటు ఆ మహమ్మారి మళ్లీ సోకకుండా రక్షణ లభిస్తుందని; పరిమిత స్థాయి నుంచి తీవ్రస్థాయిలో కొవిడ్ సోకిన వారికి పునః సంక్రమణ నుంచి 6 నుంచి 9 నెలల పాటు రక్షణ లభిస్తుందని వివిధ దేశాలలో జరిగిన అధ్యయనాలు నిర్ధారించాయి. కట్టుదిట్టమైన నివారణ చర్యలు చేపట్టని పక్షంలో ప్రతి నాలుగు నుంచి ఆరు మాసాలకు కొవిడ్ మహమ్మారి మళ్ళీ మళ్ళీ విజృంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది స్పష్టం.


భారీస్థాయిలో కొవిడ్ సంక్రమణల ఆకస్మిక పెరుగుదల నియంత్రించేందుకు కచ్చితంగా దోహదం చేసే మరో చర్య వ్యాక్సినేషన్. ఈ జూన్ తొలినాళ్ళ వరకు, 18 సంవత్సరాలకు మించిన వయస్సు ఉన్న వారిలో కేవలం 18 శాతం మందికి మాత్రమే ఒక డోసు టీకా వేశారు. రెండు డోసులు వేయించుకున్న వారు కేవలం 4.6 శాతం మంది మాత్రమే. కొవిడ్ సంక్రమణలను పూర్తిగా అదుపు చేయాలంటే దేశజనాభాలో 70 శాతం మందికి టీకా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి నెలా ఒక కోటి 43లక్షల డోసుల టీకాలు వేసినప్పుడు మాత్రమే ఈ లక్ష్యం నెరవేరుతుంది. దేశంలో టీకా ఉత్పాదక సామర్థ్యం ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఆ లక్ష్యం సగం మాత్రమే నెరవేరగలదు. కనుక 18 సంవత్సరాలకు మించిన వయస్సులో ఉన్న భారతీయులందరికీ టీకా వేసేందుకు మనం చాలా చాలా దూరం పయనించవలసి ఉంది. అమెరికా, బ్రిటన్‌లలో ఇప్పటికే 50శాతం మంది వయోజనులు రెండు డోసులు వేయించుకోగా, 85 శాతం మందికి పైగా కనీసం ఒక డోస్ వేయించుకున్నారు. ఈ టీకాకరణ వల్ల ఆ రెండు దేశాలలోనూ కొవిడ్ సంక్రమణలు గణనీయంగా తగ్గిపోయాయి.


కొవిడ్ మహమ్మారి ఆకస్మిక విజృంభణలకు సంసిద్ధం కావడానికి, సంభవించే అపాయాన్ని కచ్చితంగా అంచనా వేయడంతో పాటు ఆ హాని తీవ్రతను తగ్గించడం కూడా చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పింది.. దేశ ప్రజలను కొవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా రక్షించేందుకు 2021 నుంచి మనం అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం మనం శీఘ్రగతిన ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్ (వీటినే క్లినికల్ ప్రాక్టీస్ గైడ్‌లైన్స్ అని కూడా అంటారు.) ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలి. కొత్త ఔషధాలు, వ్యాక్సిన్ల అభివృద్ధికి వీలుగా పరిశోధనలను ప్రోత్సహించాలి. ఇతర దేశాలలో ప్రజలు అనుసరించిన ఆరోగ్యకరమైన ప్రవర్తనా పద్ధతులు వ్యాధి నియంత్రణకు ఎలా తోడ్పడిందీ ప్రజలకు విపులంగా వివరించాలి. సరైన ప్రవర్తనారీతులను పాటిస్తున్న ప్రజలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. గ్రామీణప్రాంతాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుంచి ఉన్నతస్థాయి ఆసుపత్రుల వరకు ఆరోగ్యభద్రతా సిబ్బందికి మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చాలి. ఆక్సిజన్ సిలిండర్లు మొదలైన సహాయక ఆరోగ్యభద్రతా సదుపాయాలను సమృద్ధంగా అభివృద్ధి పరచాలి. ఇవి జరిగినప్పుడు మాత్రమే కొవిడ్ ప్రమాదాన్ని మనం పటిష్ఠంగా ఎదుర్కోగలుగుతాము.


కొవిడ్ తీవ్రతను, మరణాలను నిరోధించడం మన ప్రాథమిక లక్ష్యం. ఇందుకు మన సంజీవనీ మంత్రం–ట్రైనింగ్, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, ట్రస్ట్, ట్రాన్సపరెన్సీ. రాబోయే 4 నుంచి 6 నెలల వరకు మతపరమైన వేడుకలు, రాజకీయ కార్యక్రమాలు, సామాజిక సమావేశాలు, వాణిజ్య కార్యకలాపాల ప్రదేశాలలో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడడాన్ని నిషేధించి తీరాలి. కొవిడ్ మూడో అలను నిరోధించడంలో పౌర సమాజం కీలకపాత్ర నిర్వహించాల్సి ఉంది. మహమ్మారిని ఎదుర్కోవడంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, కాంటాక్ట్ ట్రేసింగ్, టీకా వేయించుకోవడంపై అనేక మందిలో ఉన్న సంకోచాలను తొలగించడం, టీకా వేయించుకోవాల్సిన పౌరుల జాబితాలను రూపొందించడం మొదలైన బాధ్యతల నిర్వహణలో పౌరసమాజం భాగస్వామి కావాలి. ఈ మహమ్మారిని సంపూర్ణంగా నిర్మూలించడంలో ప్రభుత్వం మాత్రమే విజయం సాధించలేదు. విధానాల నిర్ణయంలోనూ, వాటిని అమలుపరచడంలోనూ పౌరసమాజం పాలుపంచుకోవాలి. 


కొవిడ్–మానవాళి ఎదుర్కొంటున్న మొదటి మహమ్మారి కాదని, ఎదుర్కోబోయే చివరి మహమ్మారి అంతకన్నా కాబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ వాఖ్యానించడం గమనార్హం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని కొవిడ్ ముప్పుకు మనం సమర్థంగా, ప్రభావశీలంగా ప్రతిస్పందించాలి. ఇందుకు ప్రజారోగ్య సిబ్బందిని సమగ్రంగా సంసిద్ధపరచడం చాలా ముఖ్యం. మహమ్మారిని నిర్మూలించేందుకు అవసరమైన సకల నైపుణ్యాలను వారికి సమకూర్చేందుకు ప్రభుత్వం భారీ మదుపులు చేసి తీరాలి.

డాక్టర్ జివిఎస్ మూర్తి

(వ్యాసకర్త హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్‌  బ్రిటన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ప్రొఫెసర్).

Updated Date - 2021-06-25T09:28:16+05:30 IST