మునిసిపాలిటీల్లోనూ టాస్స్‌ఫోర్సు

ABN , First Publish Date - 2020-09-14T10:54:07+05:30 IST

మునిసిపాలిటీ పరిధిలో నాలాలను అక్రమిస్తుండడంతో వర్షాకాలంలో నీళ్లు సరిగా వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు

మునిసిపాలిటీల్లోనూ టాస్స్‌ఫోర్సు

అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రత్యేక కమిటీలు

నాలాల  ఆక్రమణలకు చెక్‌.. 

ఇళ్ల అనుమతులపై దృష్టి


హన్మకొండ, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలో నాలాలను అక్రమిస్తుండడంతో వర్షాకాలంలో నీళ్లు సరిగా వెళ్లక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు పొంగి నీటి ప్రవాహం ఇళ్ళల్లోకి వస్తోంది. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌ మహానగరాన్ని వరదలు ముంచెత్తిన సంగతి విదితమే. రాష్ట్ర పురపాలన, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నగరాన్ని సందర్శించి నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్సు బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితే పురపాలికల్లోనూ ఉంది. 


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది పురపాలికలు జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట, డోర్నకల్‌, మరిపెడ, పరకాల, తొర్రూరు, భూపాలపల్లి, వర్ధన్నపేటలోనూ నాలాలపై అక్రమ నిర్మాణాలు విచ్చల విడిగా జరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇళ్ళ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే విషయంలో సంస్కరణలు చేపట్టింది. ఇళ్ల నిర్మాణాల దరఖాస్తుల పరిశీలనకు జిల్లా స్థాయిలో టాస్క్‌ ఫోర్సు కమిటీలను, మునిసిపాలిటీల పరిధిలో ప్రత్యేక కమిటీలను వేయాలని ఆదేశించింది. ఈ కమిటీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


సత్వర మంజూరు కోసం..

ఇప్పటికే ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంలో ప్రత్యేక జీవో విడుదల చేసిన ప్రభుత్వం.. నిర్ణీత సమయంలో అనుమతి ఇవ్వని పక్షంలో ఆన్‌లైన్‌ విధానంలో సత్వరమే మంజూరు చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నా.. పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. జిల్లాలోని పురపాలికల్లో ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొత్త పురపాలికల్లో వివిధ శాఖల్లో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా  ఉంది. ఉన్నవారు కూడా సక్రమంగా పని చేయకపోవడం, నిర్మాణ పనులపై పర్యవేక్షణ కొరవడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇక ముందు అలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.


ప్రత్యేక కమిటీలు..

అక్రమ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్సు,  పురపాలికల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పొరుగు జిల్లాలయిన కరీంనగర్‌, ఖమ్మం, సంగారెడ్డిలలో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. ఇక ఇళ్ళ నిర్మాణ అనుమతులకు అధికారుల కాళ్లావేళ్లా పడాల్సి వచ్చేది. లేదంటే అడిగినంత ఇస్తేనే ఫైల్‌ ముందుకు కదిలేది. ఇకముందు ఆ పరిస్థితి ఉండదు. పట్టణాల్లో టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఇళ్ళ ఇర్మాణాలకు అనుమతులు మంజూరు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో సభ్యులుగా పంచాయతీరాజ్‌ శాఖ, కార్యనిర్వాహక ఇంజనీరు, సూపరింటెండెంట్‌, రోడ్లు భవనాలల శాఖ ఈఈ, డీఈ, పురపాలక ప్రణాళిక విభాగం అధికారులు ఉంటారు. భవన నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు కోరుతూ వచ్చే దరఖాస్తులకు ఈ కమిటీ పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం జిల్లా కమిటీకి నివేదిస్తుంది.


విస్తీర్ణాన్ని విబట్టి..

కొత్త పురపాలక చట్టం ప్రకారం 75 గజాల స్థలంలోపు నిర్మించే భవనానికి అనుమతులు అవసరం లేదు. 75 నుంచి 600 గజాలలోపు బెటర్‌మెంట్‌ చార్జీలు తీసుకొని అనుమతులు ఇవ్వాలి. 600 గజాల కంటే ఎక్కువ ఉన్న స్థలాల్లో నిర్మాణలకు దరఖాస్తు చేసుకున్నవారికి 21 రోజుల్లోపు అనుమతులు ఇవ్వాలి. అనుమతులకు లోబడి ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నదీ లేనిదీ ప్రత్యేక కమిటీలు ఎప్పటికప్పుడు తనఖీ చేస్తాయి. చట్టపరంగా, సాంకేతికంగా అడ్డంకులు ఏర్పడిన ఇళ్ళు, భవనాలు, ఇతర కట్టడాల విషయంలో వాటికి సంబంధించిన నివేదికలను జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్సుకు సమర్పిస్తాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. త్వరలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్సు కమిటీలు, తొమ్మిది పురపాలికల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కానున్నాయి.

Updated Date - 2020-09-14T10:54:07+05:30 IST