ఐపీఎల్: ముంబై ఇండియన్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి

ABN , First Publish Date - 2020-10-02T05:04:36+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో...

ఐపీఎల్: ముంబై ఇండియన్స్ చేతిలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓటమి

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా షేక్ జాయేద్ స్టేడియం వేదికగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓటమి చవిచూసింది. 48 పరుగుల తేడాతో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. గత మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ప్రతిభ కనబర్చిన పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ముంబై జట్టు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులతో సరిపెట్టుకుంది. ఓపెనర్లు లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌లో రాణించకపోవడం పంజాబ్‌ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రాహుల్ 17 పరుగులకే చాహర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.


మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 పరుగులు చేసి బూమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కరుణ్ నాయర్ క్రూనల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో పంజాబ్ పతనం మొదలైంది. ఇలా 10 ఓవర్లలోపే 60 పరుగులకే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మూడు కీలక వికెట్లను కోల్పోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్స్‌లో నికోలస్ పూరన్ ఒక్కడే 27 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. నీషమ్ 7 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 7 పరుగులు, రవి బిష్ణోయ్ ఒక్క పరుగు చేసి పెవిలియన్ బాట పట్టారు. ముంబై బౌలర్లలో పట్టిన్‌సన్, బూమ్రా, చాహర్‌లకు తలో రెండు వికెట్లు దక్కగా.. బౌల్ట్, క్రూనల్ పాండ్యా చెరో వికెట్ తీశారు.


అంతకు ముందు పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ 70 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడానికి కారణమయ్యాడు. చివరి 6 ఓవర్లలో పొలార్డ్, హార్థిక్ పాండ్యా సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగి ఆడారు. పొలార్డ్ 20 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేయగా, హార్థిక్ పాండ్యా 11 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 30 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ పది పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో క్రిష్ణప్ప గౌతమ్, నీషమ్ వేసిన చెరో నాలుగు ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్స్ అత్యధిక పరుగులు రాబట్టారు. గౌతమ్ బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 45 పరుగులు, నీషమ్ బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 52 పరుగులు వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, క్రిష్ణప్ప గౌతమ్‌కు తలో వికెట్ దక్కింది.

Updated Date - 2020-10-02T05:04:36+05:30 IST