ముంబై బ్యాట్స్‌మెన్స్‌లో మెరిసిన ముగ్గురు.. పంజాబ్ టార్గెట్ 192

ABN , First Publish Date - 2020-10-02T03:12:00+05:30 IST

ఐపీఎల్‌ టీ20లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో...

ముంబై బ్యాట్స్‌మెన్స్‌లో మెరిసిన ముగ్గురు.. పంజాబ్ టార్గెట్ 192

అబుదాబి: ఐపీఎల్‌ టీ20లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ డి కాక్ తొలి ఓవర్ ఐదో బంతికి డకౌట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు మంచి స్కోర్‌ను అందించాడు. 45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో రోహిత్ 70 పరుగులు చేశాడు. షమీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి నీషమ్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు.


అయితే.. చివరి నాలుగు ఓవర్లలో పొలార్డ్, హార్థిక్ పాండ్యా సూపర్ ఫామ్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేసి పరుగుల వరద పారించారు. పొలార్డ్ 20 బంతుల్లో 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేయగా, హార్థిక్ పాండ్యా 11 బంతుల్లో 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 30 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ పది పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. పంజాబ్ బౌలర్లలో క్రిష్ణప్ప గౌతమ్, నీషమ్ వేసిన చెరో నాలుగు ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్స్ అత్యధిక పరుగులు రాబట్టారు. గౌతమ్ బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 45 పరుగులు, నీషమ్ బౌలింగ్ చేసిన 4 ఓవర్లలో 52 పరుగులు వచ్చాయి. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్‌, షమీ, క్రిష్ణప్ప గౌతమ్‌కు తలో వికెట్ దక్కింది.


పంజాబ్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యం ఉండటం గమనార్హం. పంజాబ్ బ్యాటింగ్‌పరంగా చూస్తే.. కెప్టెన్ కేఎల్ రాహుల్, క్లాస్ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. పూరన్, మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్‌ కూడా పంజాబ్‌ బ్యాటింగ్‌కు అదనపు బలంగా చెప్పొచ్చు.

Updated Date - 2020-10-02T03:12:00+05:30 IST