Abn logo
Apr 14 2021 @ 03:32AM

ముంబై మురిసె..

  • గెలిపించిన బౌలర్లు 
  • కోల్‌కతాకు నిరాశ


31 బంతుల్లో 30 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. క్రీజులో ఉన్నది  రస్సెల్‌, దినేశ్‌ కార్తీక్‌. ఈ దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో ఓటమి చెందుతుందని ఎవరైనా ఊహించగలరా.. కానీ ముంబై ఇండియన్స్‌ బౌలర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. క్రునాల్‌, బుమ్రా, బౌల్ట్‌ వారిని ఒక్కో పరుగు తీసేందుకే వణికేలా చేస్తూ తమ జట్టుకు అద్భుత విజయాన్నందించారు. అంతకుముందు రస్సెల్‌ (5/15) ధాటికి ముంబైలో సూర్యకుమార్‌, రోహిత్‌ మాత్రమే రాణించారు. చెన్నై: వాంఖడేలో బ్యాట్స్‌మెన్‌ ధనాధన్‌ ఆటతో ఆధిపత్యం ప్రదర్శించగా.. చెపాక్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. బౌలర్లు విజృంభించిన ఈ లోస్కోరింగ్‌ మ్యాచ్‌లో చివరకు ముంబై ఇండియన్స్‌ 10 పరుగుల తేడాతో బోణీ చేసింది. కోల్‌కతా టాప్‌-4 బ్యాట్స్‌మెన్‌ను రాహుల్‌ చాహర్‌ అవుట్‌ చేయగా.. ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), రోహిత్‌ (32 బంతుల్లో 3 పోర్లు, 1 సిక్స్‌తో 43) మాత్రమే రాణించారు. కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది. రాణా (47 బంతుల్లో 57), గిల్‌ (24 బంతుల్లో 33) ఆకట్టుకున్నారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రాహుల్‌ చాహర్‌ నిలిచాడు.


శుభారంభం దక్కినా..: స్వల్ప ఛేదనలో కోల్‌కతా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం చేసింది. రాణా, గిల్‌ తొలి వికెట్‌కు 72 పరుగులు అందించారు. అయితే మిడిలార్డర్‌ దారుణంగా తడబడి మూల్యం చెల్లించుకుంది. మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన రాణా.. మూడో ఓవర్‌లో 6,4తో జోరు పెంచాడు. తొమ్మిదో ఓవర్‌లో గిల్‌ 4,6తో ఊపు మీద కనిపించాడు. కానీ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ తన వరుస ఓవర్లలో గిల్‌, త్రిపాఠి (5), మోర్గాన్‌ (7)తో పాటు 40 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రాణాను సైతం పెవిలియన్‌ బాట పట్టించడంతో ముంబై మ్యాచ్‌పై ఆశలు పెంచుకుంది. 


చివరి 5 ఓవర్లలో..: డెత్‌ ఓవర్లలో కేకేఆర్‌ 5 ఓవర్లలో 31 పరుగులు చేయలేక చావుదెబ్బ తిన్నది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ క్రునాల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. 16వ ఓవర్‌లో ఒకే పరుగిచ్చి షకీబల్‌ (9)ను క్రునాల్‌ అవుట్‌ చేయగా.. 18వ ఓవర్‌లో 3 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. ఇక బుమ్రా 19వ ఓవర్‌లో 4 పరుగులే ఇవ్వడంతో గెలుపు సమీకరణం ఆరు బంతుల్లో 15 రన్స్‌కు మారింది. చివరి ఓవర్లో బౌల్ట్‌ నాలుగు పరుగులే ఇచ్చి రస్సెల్‌, కమిన్స్‌ (0)ను అవుట్‌ చేయడంతో ముంబై మురిసింది..


బౌలర్ల హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్‌, రోహిత్‌ మినహా అంతా విఫలమయ్యారు. చివరి 5 ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో ఈ జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఫామ్‌లో ఉన్న క్రిస్‌ లిన్‌ స్థానంలో డికాక్‌ (2)కు చోటివ్వగా తను రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అయితే రోహిత్‌ నిదానంగా ఆడినా సూర్యకుమార్‌ చెలరేగాడు. ముఖ్యంగా స్పిన్నర్లు హర్భజన్‌, వరుణ్‌ల ఓవర్లలో స్వీప్‌ షాట్లతో ఆడుకున్నాడు. భజ్జీ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో తను మూడు ఫోర్లు సాధించాడు. ఇక 8వ ఓవర్‌లో వరుసగా 6,4,4తో 16 రన్స్‌ రాబట్టాడు. పదో ఓవర్‌లో ఓ భారీ సిక్సర్‌తో 33 బంతుల్లోనే సూర్యకుమార్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఇలా జోరుగా సాగుతున్న అతడి ఇన్నింగ్స్‌కు మరుసటి ఓవర్‌లోనే షకీబల్‌ బ్రేక్‌ వేశాడు. అప్పటికే రెండో వికెట్‌కు 76 పరుగులు జత చేరాయి. ఇక్కడి నుంచి ముంబై వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలో ఇషాన్‌ (1), రోహిత్‌ (43)లను కమిన్స్‌ అవుట్‌ చేయగా.. హార్దిక్‌ (15)ను ప్రసిద్ధ్‌ దెబ్బతీశాడు. 12 బంతులు.. 5 వికెట్లు

డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌ రస్సెల్‌ సంచలన బౌలింగ్‌తో కేవలం రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ అతడికి 18వ ఓవర్‌లో బంతి అందివ్వగా.. ముందు పొలార్డ్‌ (5) జాన్సెన్‌ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఆఖరి ఓవర్‌లోనైతే నాలుగు బంతుల్లో క్రునాల్‌ (15), బుమ్రా (0), రాహుల్‌ చాహర్‌ (8)ను అవుట్‌ చేయడంతో ముంబై కంగుతింది.స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ (బి) కమిన్స్‌ 43; డికాక్‌ (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 2; సూర్యకుమార్‌ (సి) గిల్‌ (బి) షకీబల్‌ 56; ఇషాన్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) కమిన్స్‌ 1; హార్దిక్‌ (సి) రస్సెల్‌ (బి) ప్రసిద్ధ్‌ 15; పొలార్డ్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) రస్సెల్‌ 5; క్రునాల్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) రస్సెల్‌ 15; జాన్సెన్‌ (సి) కమిన్స్‌ (బి) రస్సెల్‌ 0; రాహుల్‌ చాహర్‌ (సి) గిల్‌ (బి) రస్సెల్‌ 8; బుమ్రా (సి) షకీబల్‌ (బి) రస్సెల్‌ 0; బౌల్ట్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 152 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-10, 2-86, 3-88, 4-115, 5-123, 6-125, 7-126, 8-150, 9-150, 10-150. బౌలింగ్‌: హర్భజన్‌ 2-0-17-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-27-1; షకీబల్‌ 4-0-23-1; కమిన్స్‌ 4-0-24-2; ప్రసిద్ధ్‌ 4-0-42-1; రస్సెల్‌ 2-0-15-5.


కోల్‌కతా: నితీష్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) చాహర్‌ 57; గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) చాహర్‌ 33; రాహుల్‌ త్రిపాఠి (సి) డికాక్‌ (బి) చాహర్‌ 5; మోర్గాన్‌ (సి) జాన్సెన్‌ (బి) చాహర్‌ 7; షకీబల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) క్రునాల్‌ 9; దినేష్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 8; రస్సెల్‌ (సి అండ్‌ బి) బౌల్ట్‌ 9; కమిన్స్‌ (బి) బౌల్ట్‌ 0; హర్భజన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 142/7; వికెట్ల పతనం: 1-72, 2-84, 3-104, 4-122, 5-122, 6-140, 7-140; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-27-2; జాన్సెన్‌ 2-0-17-0; బుమ్రా 4-0-28-0; క్రునాల్‌ 4-0-13-1; పొలార్డ్‌ 1-0-12-0; రాహుల్‌ చాహర్‌ 4-0-27-4; రోహిత్‌ 1-0-9-0.

Advertisement
Advertisement
Advertisement