Abn logo
May 22 2020 @ 04:14AM

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

భార్యాభర్తలు, కూతురు, మనవడి మృతి

మృతిపై పలు అనుమానాలు

30ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ నుంచి వరంగల్‌కు వలస 

ఎంజీఎం మార్చూరీకి మృతదేహాలు తరలింపు

గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రియల్‌ ఏరిలో ఘటన


గీసుగొండ, మే 21: పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం వచ్చిన వలస కూలీలు బావిలో శవాలై తేలడం గురువారం కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌ ప్రాంతానికి చెందిన మక్సూద్‌ (50), అతని భార్య నిషా(45), 22ఏళ్ల కుమార్తె(పేరు తెలియాల్సి ఉంది), ఆమె మూడేళ్ల కుమారుడు(పేరు తెలియాల్సి ఉంది) మృతదేహాలు బావిలో  తేలియాడడంతో హృదయాల్ని కలిచి వేసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  మృతిచెందడంతో వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలియరావడం లేదు. గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి శివరామయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.


వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కరీమాబాద్‌ ప్రాంతానికి 30ఏళ్ల క్రితం మక్సూద్‌ కుటుంబం వలస వచ్చింది. మక్సూద్‌కు భార్య నిషా, ఇద్దరు కుమారులు, కుమార్తె, ఆమె కొడుకుతో ఉంటున్నారు. మక్సూద్‌ కుమార్తెకు ఢిల్లీకి చెందిన వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడంతో కూతురు తన మూడేళ్ల బాబుతో కలిసి పుట్టింటివద్దే ఉంటోంది. వీరంతా వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రీయల్‌ ఏరియాలో గల  సాయిదత్తా బారదాన్‌ ట్రేడర్స్‌లో పాత గన్నీ సంచులను కుడుతూ జీవిస్తున్నారు. 


అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో కరీమాబాద్‌ నుంచి పనిచేసేందుకు గొర్రెకుంటకు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో మక్సూద్‌ కుటుంబం ఇబ్బందులు పడుతుండేది. ఈ క్రమంలో తమ గోడును యాజమానికి విన్నవించుకోగా స్పందించి సాయిదత్తా ట్రేడర్స్‌లోని షెడ్స్‌లో కుటుంబం ఉండేందుకు తాత్కాలిక ఆశ్రయాన్ని కల్పించడంతో అక్కడే ఉంటున్నారు.


ఈ క్రమంలో బుధవారం నుంచి మక్సూద్‌ కుటుంబం కనిపించకపోవడంతో సాయిదత్తా ట్రేడర్స్‌ యజమాని సంతోష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మక్సూద్‌ కుటుంబ సభ్యుల సమాచారం కోసం వాకబు చేయగా  వారి సమాచారం తెలియలేదు. గురువారం మధ్యాహ్నం ట్రేడర్స్‌ సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావిలో మసూద్‌తోపాటు అతని భార్య, కూతురు, మనువడు మృతదేహాలు తేలి కనబడటంతో సంతోష్‌ పోలీసులకు సమాచారం అందించాడు.


ఘటనా స్థలానికి గీసుగొండ సీఐ శివరామయ్య, ఎస్సై రహీం చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం బావిలో తేలి ఆడుతున్న మృతదేహాలను ఎంజీఎం మార్చూరికి తరలించారు. ఘటనా స్థలానికి అదనపు డీసీపీ వెంకటలక్ష్మి చేరుకుని విచారణ చేపట్టాలని ఏసీపీతోపాటు సీఐలకు ఆదేశమిచ్చారు. కాగా మక్సూద్‌ ఉంటున్న కరీమాబాద్‌తోపాటు పనిచేస్తున్న గొర్రెకుంట ప్రగతి ఇండస్ట్రీయల్‌ ఏరియాలో మక్సూద్‌ కుటుంబం మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.


హత్యనా..  ఆత్మహత్యనా..?

మక్సూద్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పాడుబడిన బావిలో అనుమానాస్పదంగా శవాలై తేలడం కలకలం రేపుతోంది. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే బావిలో తేలియాడుతున్న శవాలు ఒక్క రోజులో పడినవిగా కనబడటం లేదని తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే బావిలో పడ్డారా.. లేక లేదా నిద్రిస్తున్న సమయంలో వారిని హత్య చేసి బావిలో పడేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా మక్సూద్‌ కుటుంబంలోని మృతి చెందిన నలుగురితోపాటు మరో నలుగురు వారితో ఉండేవారని అయితే ఆ నలుగురు కనిపించకపోవడంతో వారు వారు కూడా మృతి చెందారా, లేక పరారీలోఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.


పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతిపై స్పష్టత వచ్చే అవకాశముంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన ప్రగతి ఇండస్ట్రీయల్‌ ఏరియా ఒకప్పుడు నిత్యం ఫ్యాక్టరీల సవ్వడితో విరాజిల్లుతుండేది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీయల్‌ ఏరియాతోపాటు దానిని ఆనుకొని ఉన్న కీర్తినగర్‌ కాలనీ  ప్రాంతమంతా హత్యలకు.. ఆత్మహత్యలు, అనుమాస్పద మృత ఘటనలకు నిలయంగా మారడంతో ఈ ప్రాంతవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ఈ ప్రాంతంలోని కీర్తి నగర్‌లో వృద్ధు దంపతులు హత్య కావడమేకాకుండా ప్రగతి ఇండస్ట్రీయల్‌ పరిసర ప్రాంతాల్లో పాడుబడిన షెడ్స్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరిని హత్య చేసిన విషయం తెలిసిందే. Advertisement
Advertisement