బహుళ ప్రక్రియల సాహితీ విన్యాసి రెంటాల

ABN , First Publish Date - 2020-09-05T06:23:32+05:30 IST

విద్యార్థిగానే రచనకు శ్రీకారం చుట్టిన రెంటాల 182 రచనలను వివిధ ప్రక్రియలలో చేశారు. ఇందులో పుస్తకరూపం దాల్చినవి 153 కాగా, దాల్చనివి 29. వీరు దాదాపు రెండు లక్షల పుటల సాహిత్యనిధిని తెలుగువారికి అందించారు.ఇంతటి అవిశ్రాంత కృషిచేసినవారు మరొకరు కనిపించరు.

బహుళ ప్రక్రియల సాహితీ విన్యాసి రెంటాల

విద్యార్థిగానే రచనకు శ్రీకారం చుట్టిన రెంటాల 182 రచనలను వివిధ ప్రక్రియలలో చేశారు. ఇందులో పుస్తకరూపం దాల్చినవి 153 కాగా, దాల్చనివి 29. వీరు దాదాపు రెండు లక్షల పుటల సాహిత్యనిధిని తెలుగువారికి అందించారు.ఇంతటి అవిశ్రాంత కృషిచేసినవారు మరొకరు కనిపించరు. ఇన్ని సాహిత్య ప్రక్రియలలో విశేష కృషి చేసినా ఏ ప్రక్రియలోనూ వారి పేరు కలిసిపోకపోవటం, ప్రత్యేకించి కనిపించకపోవటం విచారకరం.


‘‘నాగమాంబా నడుము ఖడ్గం

బ్రహ్మనాయుని సింహనాదం

బాలచంద్రుని పచ్చిరక్తం

కనమదాసు కత్తిపదును’’  – మెరిసిన గుంటూరు జిల్లా పలనాటి సీమలోని రెంటాల గ్రామంలో 1920 సెప్టెంబర్‌ 5న రెంటాల గోపాలకృష్ణ జన్మించారు. తెలుగు నేలలో తీవ్రమైన ఉష్ణోగ్రతలకు నెలవు, ఎండలను ప్రామాణికంగా కొలిచే రెంటచింతల గ్రామానికి సమీప గ్రామమే రెంటాల. అందుకేనేమో 1950లో అభ్యుదయ సాహిత్య రచన ప్రారంభించిన రెంటాల సాహిత్యం ‘ప్రఫుల్లమైన ప్రచండ ఘోషల’ను ప్రసరించింది.


‘మార్క్సు మన మహర్షి –- లెనిన్‌ మన మార్గదర్శి/ నూతన సౌధాలు నిర్మిద్దాం –-- చేతన సాహిత్యం సృష్టిద్దాం’ అంటూ వర్గ దృష్టితో ‘అష్ట దరిద్రుడికీ ఆగర్భ శ్రీమంతుడికీ జరుగుతున్న పోరాటం ఇది/ మంచికీ చెడ్డకూ మధ్య సాగుతున్న సంగ్రామం ఇది’ అని మాన వుడే నాయకుడిగా ‘పీడిత తాడిత సంక్షోభిత మానవ మనోవ్యధల’ను చిత్రిస్తూ వారి పక్షాన కలమెత్తిన చేతనామూర్తి రెంటాల. ‘విముక్తి కోసం మానవుడు నడుపుతున్న ప్రధాన యంత్రమే కవిత్వం’ అనే ఆధునిక భావనతో తన సాహిత్య యాత్రను ప్రారంభించి డెబ్భై అయిదు సంవత్సరాల జీవితకాలంలో ఆరు దశాబ్దాల పాటు కొనసాగించిన అవిశ్రాంత అక్షర తపస్వి రెంటాల గోపాలకృష్ణ.


కవిత్వం, కథానిక, నాటకం, గీత రచన, అనువాదం, అనుసరణ, అనుసృజన, విమర్శ, బాలసాహిత్యం, చలనచిత్ర రచన... ఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలలో రచనలు చేసిన రెంటాల పాత్రికేయుడు, నటుడు, వక్త కూడా. 1936లో పదహారేళ్ల ప్రాయంలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి విద్యార్థిగా ‘రాజశ్రీ’ చారిత్రక నవలను రెంటాల గోపాలకృష్ణమూర్తి పూర్తి పేరుతో రచించి ప్రముఖ పండితుడు, చరిత్ర శాస్త్ర అధ్యాపకులు మారేమండ రామారావు ముందుమాటతో 1939లో ప్రచురించారు. విద్యార్థిగానే రచనకు శ్రీకారం చుట్టిన రెంటాల 182 రచనలను వివిధ ప్రక్రియలలో చేశారు. ఇందులో పుస్తకరూపం దాల్చినవి 153 కాగా, దాల్చనివి 29. వీరు దాదాపు రెండు లక్షల పుటల సాహిత్యనిధిని తెలుగువారికి అందించారు. ఇంతటి అవిశ్రాంత కృషిచేసినవారు మరొకరు కనిపించరు. ఇన్ని సాహిత్య ప్రక్రియలలో విశేష కృషి చేసినా ఏ ప్రక్రియలోనూ వారి పేరు కలిసిపోకపోవటం, ప్రత్యేకించి కనిపించకపోవటం విచారకరం.


రెంటాల సాహిత్య నేపథ్యాన్ని పరిశీలిస్తే తెలుగు సాహిత్యంలో అభ్యుదయ భావనలతో నరసరావుపేటలో ఏర్పడిన నవ్యకళా పరిషత్తు సభ్యులైన అనిసెట్టి సుబ్బారావు, నయాగరా కవులు బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలతో ఆప్తమిత్రులుగా మెలిగారు. వీళ్లందరికీ ఆప్తుడు ఎర్రజెండాల గంగినేని వెంకటేశ్వరరావు. వీరంతా ‘యవ్వనంలో పులుపుల వెంకట శివయ్యగారి రహస్య కమ్యూనిస్టు పాఠాల బోధన వల్ల ప్రభావితులు’ అన్న ఆరుద్ర మాట చారిత్రక సత్యం. నయాగరా కవులలో ‘తానూ ఒకడు కాలేదు గాని, వారితో ఒకటయ్యాడనిపిస్తుందన్న’ కె.వి.ఆర్‌. మాటలు నిజం. రెంటాల రచనల్లో సంఘర్షణ (1950), సర్పయాగం (1957) కవిత్వ సంపుటాలు ఎంతో ముఖ్యమైనవి, ప్రాచుర్యం పొందినవి. ‘రెండు వ్యతిరేకశక్తుల పరస్పర విరుద్ధ విన్యాసాలే ఈ సంఘర్షణ’ అనే మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని ప్రదర్శించారు. ‘మానవుడా! అంత్యరక్త బిం దువు భూస్థలి ప్రవహిల్లు వరకు ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు సంఘర్షణ సాగనిమ్ము’ అని ప్రబోధించారు. ప్రసిద్ధ కవి శ్రీరంగం నారాయణబాబు ‘సంఘర్షణ’కు రాసిన ‘ప్రవర’లో ‘భాషా ప్రయోగంలో ఛందస్సుల పోకడలో ఒక వింత గమనం, ఉద్వేగం, భావౌన్నత్యం కనబడతాయి’ అని విశ్లేషించారు.


‘శోక నిర్మూలనార్థం అఖండ జ్యోతి వెలిగిస్తున్నా! లోక కల్యాణార్థం కఠోరక్రతు దీక్ష వహిస్తున్నా! చేస్తున్నా! చేస్తున్నా సర్పయాగం చేస్తున్నా’ అన్నారు రెంటాల. సర్పయాగం చేసినవాడు జనమేజయుడు అయితే ఈనాటి సర్పయాగంలో జనమే జయిస్తారన్న ఆశాభావాన్ని ప్రకటించారు. అభ్యుదయ రచయితగా రెంటాల తన సమకాలీన సమాజంలోని సంఘటనలకు స్పందించారు. ఆ కాలంలో జరిగిన పోరాటాల పట్ల అమితాసక్తిని ప్రదర్శించారు. అందుకెన్నో ఉదాహరణలున్నాయి. అందులో ‘తెలంగాణ సమరగీతం’ ఒకటి.


‘‘పగలేయి నిజాంకోట ఎగరేయి ఎర్రబావుటా/ వడిచేసి పడవేసి పగలేయి నిజాంకోట/ తెగవేయి నిజాంయాట తగలేయి నిజాంచాట’’ - అని తెలంగాణ సాయుధ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. హిరోషిమాపై అమెరికా సామ్రాజ్యవాద అణుబాంబు దాడులను నిరసించారు. ‘తల్లీ చల్లని శాంతీ ధారుణి పండించవమ్మ! తల్లీ వెన్నెల కాంతీ ధారుణి నిండించవమ్మ’ అని ‘మంగళగీతం’ ఆలపించారు. ఆంధ్ర రాష్ట్రావతరణను ‘నీ దాస్య శృంఖలాలు త్రెంచుటకై ఎన్నో ఏండ్లుగ చేసిన కఠోర తపస్సు ఈనాటికి పండిందమ్మా!’ అంటూ స్వాగతించారు. రెంటాల సాహిత్య కృషిలో పేర్కొనదగినది ‘కల్పన’ కవితాసంకలనం. భావ కవిత్వ వేదిక, భూమిక అయిన ‘వైతాళికులు’ తరువాత ఆధునికతకూ, అభ్యుదయానికీ, విప్లవ భావాలకీ సింహ ద్వారం అయిన ‘కల్పన’ కవితా సంకలనానికి సంపాదకులు అనిసెట్టి, అవసరాల, బెల్లంకొండ, రెంటాల. ప్రధాన కృషి రెంటాలదే. 1953 ఏప్రిల్‌లో వెలువడిన ఈ సంకలనాన్ని ఆనాటి ప్రభుత్వం నిషేధించింది. ఇందులో రెంటాలవి నాలుగు కవితలున్నాయి. వాటిల్లో ‘పల్లకీబోయీలు’ హిందీలోకి ‘పాలక్‌ వాహక్‌’గా తర్జుమా అయింది. ‘కథన కవిత్వం చెప్పటంలో రెంటాలకొక ప్రత్యేకత్వమున్నట్లు గోచరిస్తుంది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని గొంతు విప్పినప్పుడల్లా ఆ గొంతుకలో మనకొక విశిష్టత వినిపించి తీరుతుంది. ఇందుకితని ‘‘పల్లకీబోయీలు’’ ఒక మంచి ఉదాహరణ’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. ఇంకా శివధనువు, నగరంలోని రాత్రి, ఆకలి పాటలు రెంటాల వెలువరించిన అభ్యుదయ సాహిత్యం. రెంటాల కవిత్వంలో విరివిగా పురాణ ప్రతీకలు కనిపిస్తాయి. కారణం సంస్కృతాంధ్ర సాహిత్యాలపై వారికి సాధికారత ఉండటమే.


రెంటాల రచించిన ‘అంతా పెద్దలే’ సాంఘిక, రాజకీయ వ్యంగ్యనాటకం ఆంధ్ర ప్రజానాట్యమండలి ద్వారా ప్రచారమైంది. రెంటాల నాటక సాహిత్య సంపుటి వెలు వడింది. మరికొన్ని నాటకాలతో కలిపి ‘శిక్ష’ నాటిక సంపుటినీ ప్రచురించారు. ఇవన్నీ ప్రజాకళారూపాలుగా ప్రాచుర్యం పొందాయి. రెంటాలకు చిట్టగాంగ్‌ పోరాటయోధురాలు, వీరనారి కల్పనాదత్ అంటే ఎంతో అభిమానం, స్ఫూర్తి. కవితా సంకలనానికి ‘కల్పన’ అనే కాక, కూతురికీ కల్పన అని పేరు పెట్టుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ నిషేధ కాలంలో విజయవాడలోని వారి ఇంటిపై పోలీసు దాడి జరిగింది. ఆ సందర్భంలో రెంటాల తప్పించుకోగలిగారు.


1955లో శ్రీశ్రీ అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఐదవ రాష్ట్ర మహాసభలో రెంటాల కార్యవర్గ సభ్యునిగా ఎంపికయ్యారు. 1962 అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఏర్పడిన చీలిక అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా 1964 ఏప్రిల్‌ 11న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా రెండు ముక్కలైంది. దీనితో రెంటాల మనస్సు కూడా ముక్కలైంది. నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. స్థిరమైన జీవితం కావాలనుకున్నారు. స్వంత మార్గాన్ని నిర్మించుకున్నారు. 1942 ప్రాంతంలో చల్లా జగన్నాథం గుంటూరు నుంచి నిర్వహించిన ‘దేశాభిమాని’ పత్రిక ద్వారా పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించిన రెంటాల పాత్రికేయుడిగా స్థిరపడ్డారు. ‘పండిత పాత్రి కేయుడి’గా గుర్తింపు పొందారు. 1943 నుంచి తనువు చాలించేవరకూ (18 జూలై 1995) విజయవాడలో 52 సంవత్సరాల పాటు జీవించారు. తాను సాహిత్య క్షేత్రంగా ఎంచుకొన్న విజయవాడ రెంటాలను ఎంతగానో గుర్తించి, గౌరవించింది. విజయవాడలో ఏర్పడిన రెంటాల స్మరణోత్సవం సంఘం రెంటాల రచనలు కొన్నిం టిని ప్రచురించింది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సంఘం 2020 జనవరి ఆరున వారి శతజయంతి సభను నిర్వహించింది. అందులో పాల్గొని రెంటాలకు నివాళులర్పించే అవకాశం నాకు కలిగింది.


రఘువంశం నుంచి రష్యన్‌ సాహిత్యం దాకా రెంటాల స్పృశిం చని అంశం లేదు. దీనికి నిదర్శనం వారి అనువాదాలు, ప్రాచీన సాహిత్య సరళ పరిచయం. ‘‘కాళిదాసు, భవభూతి, భాణభట్టు, భారవి, దండి, శూద్రకుడు మొదలైన సంస్కృత మహాకవుల చెప్పు కోదగ్గ గ్రంథాలకు రెంటాల మెచ్చుకోదగ్గ వచనరూపం ఇచ్చాడు. టాల్‌స్టాయ్‌, పుష్కిన్‌, కుప్రిన్‌ వంటి రష్యన్‌ రచయితల గ్రంథాలను తెనిగించాడు. భారత భాగవత రామాయణాలను ఆధునికంగా వచనపరిచాడు’’... రెంటాలవారితోనూ, వారి సాహిత్యంతోనూ ఉన్న ప్రగాఢ పరిచయంతో ఆరుద్ర అన్న మాటలివి.


అభ్యుదయ సాహిత్యోద్యమ వికాసానికి, ప్రజా సాంస్కృతికోద్యమ విస్తృతికీ దోహదపడే కొన్ని రచనలు చేసి, తెలుగు సమాజాన్ని తన సాహిత్యం ద్వారా ప్రభావితం చేసిన ప్రతిభామూర్తి, ప్రజ్ఞాశీలి రెంటాలకు శతజయంతి నివాళి.


పెనుగొండ లక్ష్మీనారాయణ

అరసం జాతీయ కార్యదర్శి

(నేడు రెంటాల గోపాలకృష్ణ శత జయంతి)

Updated Date - 2020-09-05T06:23:32+05:30 IST