బహుముఖంగా భాషోద్యమం

ABN , First Publish Date - 2022-02-20T05:58:40+05:30 IST

వనరులూ, నిపుణులు, మేధావులూ మనకు అందుబాటులో ఉన్నా, ఓట్లకోసం ప్రజల బలహీతనలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే మన పాలక వర్గాల వల్లా, విద్యతో సహా వీలైన అన్ని కీలక రంగాలను శాసిస్తున్న.....

బహుముఖంగా భాషోద్యమం

వనరులూ, నిపుణులు, మేధావులూ మనకు అందుబాటులో ఉన్నా, ఓట్లకోసం ప్రజల బలహీతనలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే మన పాలక వర్గాల వల్లా, విద్యతో సహా వీలైన అన్ని కీలక రంగాలను శాసిస్తున్న వ్యాపార వర్గాల వల్లా తెలుగుజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. ఈ అంశాలన్నిటిపైనా అవగాహనతో బహుముఖ పోరాటానికి తెలుగు భాషోద్యమ సమాఖ్య సిద్ధమవుతున్నది.


మూడుదశాబ్దాల క్రితమే తెలుగుభాష పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా గళం విప్పిన వారిలో ప్రప్రథముడు భూపతి నారాయణమూర్తి అనే దళితోద్యమ నేత. తెలుగుభాషను రక్షించుకోవాలంటూ ఒక రాజకీయపార్టీనే ఆయన పెట్టాడు. ఆ తరువాత దీనికి చేకూరి రామారావు, సి.ధర్మారావు, ఎన్‌.ఎస్‌.రాజు వంటి కొందరు పెద్దలు మాతృభాషా పరిరక్షణ సమితి పేరుతో ఒక సంఘాన్ని స్థాపించి తమ శక్తికొద్దీ ప్రభుత్వానికి విజ్ఞాపనలివ్వటం మొదలుపెట్టారు. ‘జనసాహితి’ అనే సాహిత్య సంస్థ కూడా ముందుగా కదిలింది. ‘నడుస్తున్న చరిత్ర’ అనే ఒక సామాజిక, రాజకీయ మాసపత్రిక సరిహద్దు రాష్ట్రాల్లో తెలుగువారి భాషాసమస్యల గురించి ప్రచారం చేసింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగియైన సి.ధర్మారావుకు నడుస్తున్న చరిత్రతో ఏర్పడిన పరిచయం క్రమంగా పలువురు మిత్రులను కలిపి ఒక చర్చకు దారితీసి కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో రెండురోజుల పాటు తెలుగు భాషోద్యమ సమాలోచనా శిబిరం నిర్వహణకు దారితీసింది. ఈ శిబిరాన్ని అప్పటి శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్‌, నడుస్తున్న చరిత్ర సంపాదకుడు సామల రమేష్‌బాబు నిర్వహించారు. ఆ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 200 మందికి పైగా ప్రతినిధులు చేసిన నిర్ణయం ప్రకారం ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ పేరుతో ఉద్యమాన్ని నిర్మించాలని నిర్ణయించింది.


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఫిబ్రవరి 21న జరపాలన్న యునెస్కో పిలుపునందుకుని తెలుగు భాషోద్యమ సమాఖ్యను 2003 ఫిబ్రవరి 21నే ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం హైదరాబాద్‌లో పెద్దయెత్తున ఫిబ్రవరి 21న జరిగిన ‘బృహత్సభ’లో అనేకమంది హేమాహేమీలు పాల్గొనగా జరిగిన సమాఖ్య ప్రారంభోత్సవ సమావేశం తెలుగుజాతి భాషోద్యమంలో ఒక మలుపుగా, పెద్ద ముందడుగుగా నమోదు అయింది. సి.ధర్మారావు, రమేష్‌బాబు అధ్యక్ష, కార్యదర్శులుగా కేంద్రసంఘం ఏర్పడి, అనేక ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించింది. పొరుగు రాష్ట్రాల్లో కూడా సమాఖ్య శాఖలు ఏర్పడ్డాయి. 2004 చివరిలో ప్రాచీనభాషగా తమిళాన్ని మాత్రమే గుర్తించడంలోని అశాస్త్రీయతను అర్ధసత్యాన్ని, ఎత్తిచూపి ప్రజల్లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కదలిక వచ్చేట్లుగా ఉద్యమాన్ని నడిపింది. ఫిబ్రవరి 21న హైద్రాబాద్‌లో పెద్ద నిరాహారదీక్ష కార్యక్రమాన్ని చేపట్టటంతో అన్నిపార్టీలు, ప్రభుత్వమూ కదిలివచ్చాయి. రచయితల సంఘాలు, ఇతరులు కదిలి కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగుకు, కన్నడానికి కూడా ప్రాచీనభాషా ప్రతిపత్తిని ఇవ్వడానికి కేంద్రం అంగీకరించక తప్పలేదు. రాష్ట్రంలో తెలుగును ఒక తప్పనిసరి భాషగా జి.ఓ. రప్పించడంలోనూ ఇంకా అనేక మార్పులకూ తెలుగు భాషోద్యమ సమాఖ్య కృషి కారణమైంది.


2009లో సమాఖ్యకు సామల రమేష్‌బాబు అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించారు. తెలుగు భాషకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, తెలుగుభాష అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు, ఇంకా కొన్ని కీలకమైన 9 డిమాండ్లతో రాష్ట్రమంతటా చేపట్టిన ఉద్యమం చాలాకాలం సాగి తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలను సమాఖ్య బహిష్కరించి, వీధులకెక్కడానికి దారితీయడంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కొన్ని డిమాండ్లకు అంగీకరించింది. అయితే రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు పట్ల ఏమంత శ్రద్ధ చూపకపోవడంతో తెలుగుకు మంత్రిత్వశాఖ పేరుకే మిగిలి, సాంస్కృతిక శాఖ క్రింద కాలాన్ని వెళ్లబుచ్చుతోంది. తెలంగాణ ప్రభుత్వ పూనికతో ప్రపంచ తెలుగు మహాసభలు ధూంధాం అంటూ హైదరాబాదులో జరిగాయి. తెలుగును విద్యారంగంలో, పరిపాలనలో ఉద్ధరిస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు పెద్దపెద్ద ఆశలను రేకెత్తించినా, చివరకు ఆచరణలో ఏమీ లేకపోవడంతో తుస్సుమంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పరిపాలనలో కూడా ఇంచుమించు అలాగే జరిగింది. మున్సిపాలిటీల నిర్వహణలోని పాఠశాలల్లో తెలుగుమీడియం స్థానే ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టటం, ఇంకా అటువంటి కొన్ని చర్యలు చాపకింద నీరులా సాగి పాఠశాల విద్యలో తెలుగు స్థానాన్ని కల్లోల భరితం చేశాయి. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో కలిసి సాగించిన ఉద్యమాలు నిష్ఫలమైపోయాయి.


తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థ స్థాపనకు ఒక చట్టాన్నే తెస్తామన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక జి.ఓ.తో సరిపుచ్చుకొని కాలక్షేపం చేసింది. ఇంతలో ఎన్నికలు జరిగి వైకాపా అధికారంలోకి రావటంతో అంతా మళ్ళీ మొదటికొచ్చింది. పాఠశాల విద్యను ఇంగ్లీషు మీడియంలోకి తేవాలని తెదేపా రహస్యంగా చేసిన ప్రయత్నాలకు భిన్నంగా వైకాపా ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియాన్ని బహిరంగంగా ప్రకటించి కోర్టులను కూడా ధిక్కరించి, మరీ ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో అటు తెలంగాణలో కూడా ఇంగ్లీష్‌ మీడియం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఒక భాషగానైనా తెలుగును బోధించడం పల్చబడిపోయింది. ప్రైవేటు పాఠశాలల్లో, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుకొంటున్న పిల్లల తెలుగు పరిజ్ఞానం నానాటికీ అడుగంటిపోతోంది. తెలుగు రాయడానికి, మాట్లాడడానికీ కూడా సిగ్గుపడే ధోరణి ప్రబలుతోంది.


తెలుగును కాపాడుకోవడం అంటే ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు. వలస బానిసత్వ బుద్ధి నుంచీ, భయాన్నుంచీ, ఆత్మన్యూనత నుంచీ బయటపడి మన మాతృభాషలో మనం పూర్తిగా వికసిస్తే, శక్తి యుక్తులను పెంచుకొంటూ అవసరమైన పరభాషలను కూడా- ఇప్పుడు ఆంగ్లం కావచ్చు, రేపు మరికొన్ని భాషలు కావచ్చు, ఎన్నైనా నేర్చుకోవచ్చు. నిజానికి స్వంత భాషపై పట్టు పెంచుకొంటే దాని ఊతంతో ఏ ఇతర భాషలపై నైనా ప్రావీణ్యత సాధించవచ్చు. భారత రాజ్యాంగమూ, అనేక అధ్యయనాలు చెప్పేదీ, ఐక్యరాజ్యసమితి/ యునెస్కో, ప్రపంచ మేధావులూ అందరూ చెప్పేదీ ఇదే. కేవలం ప్రజల అవసరాలను అడ్డుపెట్టుకొని వారిని పక్కదారి పట్టించే వెన్నులేని కొందరు ప్రభుత్వ నేతల రాజకీయాలకు జాతిని బలిపశువు చేస్తున్నారు. ప్రాథమిక విద్యలో మాతృభాషను తప్పనిసరి చేసి, ఆ బోధనను పటిష్ఠంగా చేస్తూ, అన్ని విధాలా ఆధునిక భాషగా దానిని ఎదిగించుకోవడం కోసం, సాంకేతికంగా కూడా వనరులను వినియోగించుకోవడానికి ఇప్పుడొచ్చిన లోటేమీ లేదు.


వనరులూ, నిపుణులు, మేధావులూ మనకు అందుబాటులో ఉన్నా కేవలం తప్పుదారి పట్టి, ఓట్లకోసం అధికారం కోసం ప్రజల బలహీనతలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే మన పాలక వర్గాల వల్లా, వారికి తాబేదారులైన కొందరు అధికారుల వల్లా, విద్యతో సహా వీలైన అన్ని కీలక రంగాలను శాసిస్తున్న వ్యాపార వర్గాల వల్లా తెలుగుజాతి భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. అందువల్లనే ఈ అంశాలన్నిటిపైనా అవగాహనతో బహుముఖ పోరాటానికి తెలుగు భాషోద్యమ సమాఖ్య సిద్ధమవుతున్నది. 


-డాక్టర్‌ సామల రమేష్‌బాబు

తెలుగు భాషోద్యమ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు

(నేడు విజయవాడలో తెలుగు భాషోద్యమ సమాఖ్య సర్వసభ్య సమావేశం; రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం) 

Updated Date - 2022-02-20T05:58:40+05:30 IST