దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి : ముద్రగడ

ABN , First Publish Date - 2020-09-21T19:31:31+05:30 IST

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు కీలక సమావేశమయ్యారు.

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి : ముద్రగడ

కాకినాడ : మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో కాపు జేఏసీ నేతలు కీలక సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం 13 జిల్లాల నుంచి కిర్లంపూడికి వచ్చిన కాపు జేఏసీ నేతలను ముద్రగడ సాదరంగా ఆహ్వానించారు. సుమారు అరగంటకు పైగా కాపు ఉద్యమంపై సమాలోచనలు చేపట్టారు. ఈ సమావేశంలో ముద్రగడ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా విరామం తర్వాత ముద్రగడను కాపు జేఏసీ నేతలు కలవడంపై ఉత్కంఠకు తెరపడింది. కొద్దిరోజుల క్రితమే తాను కాపు ఉద్యమ నేతగా తప్పుకుంటున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. ఇప్పుడు కూడా అదే విషయాన్ని మరోసారి ముద్రగడ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా ఆయన విడుదల చేశారు.


కీలక ప్రకటన ఇదీ..

గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. తిరిగి కాపు ఉద్యమం నడపాలన్న మీ కోరికను అంగీకరించలేకపోతున్నా. వ్యక్తిగతంగా మీతోనే ఉంటాను. మనం మంచి స్నేహితులం. మీ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా తెలియజేస్తే నా ఓపిక ఉన్నంత వరకూ వస్తాను. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దుఅని ముద్రగడ ప్రకటనలో కోరారు.


అయితే.. ముద్రగడ ప్రకటనాంతరం కాపు నేతలు ఏం చేయబోతున్నారు..? తదుపరి నిర్ణయమేంటి..? రిజర్వేషన్ల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? అసలు ముద్రగడ స్థానంలో ఎవరైనా నాయకుడిని నియమించుకుంటారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-09-21T19:31:31+05:30 IST