కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2020-03-31T21:36:39+05:30 IST

కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ బహిరంగ లేఖలో పలు విషయాలను రేవంత్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముందు రేవంత్ మూడు డిమాండ్లు ఉంచారు.


టెండర్లకు ఇది సమయమా..?

దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సంయమనంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వ అధినేతగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. బాధ్యత గల ప్రతిపక్షంగా సమయం, సందర్భం దృష్టిలో పెట్టుకొని వాటిని లేవనెత్తకుండా సంయమనం పాటిస్తున్నాం. పునః సమీక్ష చేస్తారన్న ఆకాంక్షతో వాటిని మీ దృష్టికి తెస్తున్నాను. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా సిటీ భూ సేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 3న అందుకోసం సభ నిర్వహిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించి భూ సేకరణ కోసం 3న సభ నిర్వహించడం మతిలేని ఆలోచన. కాళేశ్వరంలో మూడో టిఎంసి నీటి పంపింగ్ పనులకు సోమవారం టెండర్లు పిలిచారు. టెండర్లకు ఇది సమయమా..? తక్షణం టెండర్లు వాయిదా వేయాలి. లేదంటే టెండర్లలో మీకు దురుద్దేశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.


డిమాండ్ చేస్తున్నా..!

నాలుగో తరగతి, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం సరికాదు. ఉన్నతోద్యోగులను, చిరు ఉద్యోగులను ఒకే గాటన కట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య, పారా మెడికల్ సిబ్బందికి తమిళనాడు తరహాలో ప్రోత్సాహాకాలు ఇవ్వాలి. అందుకు విరుద్ధంగా వారి జీతాల్లో కూడా కొత విధించడం నిబద్ధతను తక్కువ చేస్తోంది. ఈ మూడు నిర్ణయాలను పునః సమీక్షించి జనామోద నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానుఅని లేఖ రూపంలో రేవంత్ రెడ్డి తెలిపారు.





Updated Date - 2020-03-31T21:36:39+05:30 IST