ఏయ్ రెడ్డీస్.. ఏంట్రా మీరు చేసేది..? : రఘురాజు ఫైర్

ABN , First Publish Date - 2020-08-15T09:49:16+05:30 IST

గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పోరాడుతున్న వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తనను ఫోన్లో బెదిరించినవారిపై శుక్రవారమిక్కడ

ఏయ్ రెడ్డీస్.. ఏంట్రా మీరు చేసేది..? : రఘురాజు ఫైర్

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పోరాడుతున్న వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. తనను ఫోన్లో బెదిరించినవారిపై శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో విరుచుకుపడ్డారు. మరోసారి తనను రాజీనామా చేయాలని అంటే గూబ పగిలిపోద్దని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.


‘కడప నుంచో, కర్నూలు నుంచో సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత సామాజిక వర్గం వారు నాకు ఫోన్‌ చేసి.. ఒరేయ్‌ నా కొ.. నిన్ను లేపేస్తామని బెదిరిస్తున్నారు. సీఎంగారు పట్టించుకోరు. నిన్న వైఎస్‌ రెడ్డి అంట.. నేడు రామిరెడ్డి అంట, నాకు ఫోన్‌ చేసి నన్ను ఏదో చేస్తారంట.. ఏంట్రా చేసేది... మీరు నా ఇంటికి రండి. సీఆర్‌పీఎఫ్‌ వాళ్లు షూట్‌ చేసేస్తారు. ఏయ్‌ రెడ్డీస్‌.. ఏంట్రా మీరు చేసేది.. యూజ్‌ లెస్‌ ఫెలోస్‌.. రాజీనామా చెయ్యాలంటూ నన్ను బెదిరిస్తారా? నేను ప్రజల మద్దతుతో  గెలిచా. అబద్ధాలాడి మీరు అధికారంలోకి వచ్చారు. మీరే రాజీనామా చేయాలి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.... గూబ పగిలిపోద్ది. నేను రాజీనామా చేయను.. నా బొమ్మతో కూడా నేను నెగ్గా.. ఒక్క జగన్మోహన్‌రెడ్డి బొమ్మతోనే కాదు. నాకు ఫోన్‌ చేసే వెధవల్లారా బీకేర్‌.. పనికిమాలిన వెధవల్లారా.. జాగ్రత్తగా ఉండండి. నా జోలికి రావొద్దు. అనవసరంగా రెచ్చగొట్టకండి‘ అని మండిపడ్డారు. తనను కించపరిచే వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెడుతున్న రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ సాంకేతిక విభాగం ఉన్నతాధికారి గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై ఈ రోజే లోకాయుక్తకు ఫిర్యాదు చేశానన్నారు. 


కేంద్రంపై నెపానికే నిధులడుగుతున్నారు

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క రాజధాని(అమరావతి)నే కట్టలేమని చెప్పిన జగన్‌ ప్రభుత్వం.. అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఎలా కడుతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. ‘ఏపీ ప్రభుత్వం బాటా కంపెనీ ధరల తరహాలో 9.99 లక్షల కోట్లు కేంద్రాన్ని అడిగింది. ఆ డబ్బు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి చేయలేకపోతున్నామని కేంద్రంపై నెపం నెట్టడానికే అంత పెద్దమొత్తం అడుగుతున్నట్లుగా ఉంది. మనం బీదవారం.. కానీ దానకర్ణులం. అడిగినంత కేంద్రం ఎలా ఇస్తుంది’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా వేసిన కేసు ఒక నస అని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా....అమరావతే ముమ్మాటికీ రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జస్టిస్‌ ఈశ్వరయ్య కేసులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ, సీవీసీ సహకారంతో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం హర్షణీయమన్నారు. ‘సీఎంగారూ.. ప్రజాదర్బార్‌ అన్నారు. ఇప్పటికీ నిర్వహించలేదు. రచ్చబండా నిర్వహించిన పాపాన పోలేదు. మీపై ప్రజల్లో ఉన్న విశ్వాసం రానురాను కరిగిపోతోంది. మీ ప్రేమ కోసం ఒకరినొకరు తన్నుకుంటున్నారు. మీ మనసు దొంగలను తక్షణమే దూరం పెట్టండి‘ అని రఘురామకృష్ణంరాజు సూచించారు.

Updated Date - 2020-08-15T09:49:16+05:30 IST