ఉద్యమాలే ఆయన ఊపిరి

ABN , First Publish Date - 2021-03-11T06:32:18+05:30 IST

ఆరుదశాబ్దాల ఉద్యమ చైతన్యం డా.కొల్లూరి చిరంజీవి. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు...

ఉద్యమాలే ఆయన ఊపిరి

నివాళి: 

ఆరుదశాబ్దాల ఉద్యమ చైతన్యం డా.కొల్లూరి చిరంజీవి. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఆఖరి శ్వాస దాకా అన్యాయాలు, ఆకలి దప్పుల నుంచి పేదల విముక్తే ధ్యేయంగా బ్రతికిన ప్రజానాయకుడు డా.కొల్లూరి. ఏ నాయకుడికైనా ఒకటో రెండో ఉద్యమాలతో అనుబంధం ఉంటుంది. కొల్లూరికి మాత్రం అనేక ఉద్యమాలు, పోరాటాలతో విడదీయరాని అనుబంధం ఉంది. తొలితరం అనే మాటకు నిలువెత్తు రూపంగా జీవించిన మరపురాని వ్యక్తి. తరమెల్లిపోతున్నదని ఈ తరం తలచుకునే వ్యక్తుల్లో డా.కొల్లూరి ముఖ్యుడు. ఆయన ప్రస్థానాన్ని, అలుపెరుగని కార్యాచరణను తలుచుకుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నిబద్ధతకు చేతులెత్తి జేజేలు చెప్పాలనిపిస్తది. అట్లా ప్రజల కోసం పరితపించిన నిస్వార్థ, నిష్కల్మష హృదయుడు , మనస్వి డా.కొల్లూరి.


సాంస్కృతికంగా, రాజకీయంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఉద్యమాల గడ్డ వరంగలే కొల్లూరిని కన్నది. తల్లిదండ్రులు ఇద్దరూ ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించిన అరుదైన దళితదంపతులు. తల్లిదండ్రుల నుండి చిన్ననాడే సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నాడు కొల్లూరి. తల్లి క్రైస్తవ కథలు చెప్పినా, తాను మాత్రం ఆధ్యాత్మిక చింతనకు కాకుండా సామాజిక చింతనకు చేరువయ్యాడు. విద్యార్థి దశలోనే ఉద్యమాల బాట పట్టాడు. తెలంగాణ తొలిదశ ఉద్యమకాలమైన 1969లోనే కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థుల ముఖ్యనేతగా పని చేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఎంబీబీయస్‌ పూర్తి చేసి వైద్య వృత్తిలోకి అడుగుపెట్టినా ఎక్కువకాలం అందులో ఉండలేకపోయాడు. తన చుట్టూ ఉన్న సమాజంలో అసమానతలు, అవమానాలు తనను కుదురుగా ఉండనివ్వలేకపోయాయి. అందుకే సామాజిక న్యాయం జరిగినపుడే తన జీవితానికి సార్థకత అని భావించి వైద్య వృత్తిని వదిలేశాడు.


ఆ కాలంలోనే కులాంతర వివాహం చేసుకొని అనేకమందికి ఆదర్శనాయకునిగా నిలిచారు. సరిగ్గా అదే సమయంలో తనలోని సంఘర్షణకు విప్లవమార్గమే సరైనదని నమ్మారు. అలా పీపుల్స్‌వార్‌ పార్టీ తొలితరం నాయకుల్లో ఒకరిగా విప్లవోద్యమానికి పునాదులు వేశారు. ఆ ప్రయాణంలో కొండపల్లి సీతారామయ్య, శివసాగర్‌ వంటి ఎందరో అగ్రనేతలతో కలిసి పని చేశారు. డా.కొల్లూరి మొదటి నుండి బహుముఖ మార్గాల్లో కృషి చేశారు. క్యాడర్‌ను తయారు చేసుకోవాలంటే ముందు నాయకులు కావాలన్నాడు. నాయకత్వానికి శిక్షణా కార్యక్రమాలు పెడితే తాను ప్రపంచ విప్లవోద్యమాల అనుభవాలను ఒక క్లాసుగా బోధించేవాడు. ఆయన పాఠాలు విని కేంద్రకమిటీ స్థాయికి ఎదిగిన నాయకులు ఎందరో ఉన్నారు. అది డా.కొల్లూరి మేధోకృషికి మాత్రమే సాధ్యపడిన విషయం. దళితుడైన డా.కొల్లూరి విప్లవోద్యమంలో ఎక్కువకాలం కొనసాగలేకపోవడం చాలా సహజమైన విషయం. 1977లో విప్లవోద్యమం నుండి ఆయన బయటికి వచ్చాడు. అయినా తన సామాజిక బాధ్యతను మాత్రం విస్మరించలేదు.


ఈ దేశంలో విప్లవం ఏ సమూహాలకు అవసరమో కనుగొన్నాడు. నూటికి ఎనభై శాతంగా ఉన్నా బహుజనుల కష్టాలకు మూలాలను అన్వేషించాడు. కులాన్ని మరిచి నిర్మించే వర్గపోరాటాల వల్ల ఫలితం లేదనుకున్నాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా ఉప్పెనలా వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాణ పని పద్ధతులు కొల్లూరిని ఆకర్షించాయి. ముఖ్యంగా మాన్యులు కాన్షీరాం ఆలోచనాధోరణి, కార్యదక్షతలు ఆయనకు బాగా నచ్చాయి. అంబేద్కరిజమే ఈ దేశాన్ని విముక్తం చేస్తుందనే అవగాహనకు ఆ రోజుల్లోనే అంచనాకు వచ్చాడు. బహుజనులను కూడగట్టి తెలుగునాట బహుజన సమాజ్‌ పార్టీ అడుగుపెట్టడంలో కీలకభూమికను పోషించాడు. కాన్షీరాం ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా డా.కొల్లూరితోనే ముఖ్యమైన నిర్ణయాలు చర్చించేవాడు. బీఎస్పీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన అనేక కార్యక్రమాలకు డా.కొల్లూరి బహుజనుల జాతీయ నాయకునిగా పని చేశాడు. ‘బహుజన’ పత్రికకు ఎడిటర్‌గా పని చేశాడు. ఇలా రెండు ప్రధాన భావజాలాలకు సంబంధించిన సంఘ నిర్మాణాలలో కొల్లూరి ప్రత్యక్షంగా పాలుపంచుకోవడం ఒక చరిత్ర.


తెలంగాణ రాష్ట్ర సాధనలో డా.కొల్లూరి పోషించిన పాత్ర అద్వితీయమైంది. తొలిదశలో అరవై తొమ్మిది ఉద్యమకారుల జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ప్రొ.జయశంకర్‌ కంటే ముందే తెలంగాణ రాష్ట్ర విముక్తి కావాలని గళమెత్తిన నాయకుడు కొల్లూరి. తెలంగాణ ప్రజలకు స్వతంత్ర అస్తిత్వముండాలని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో జరిగిన అన్యాయం దారుణమైందని వందలాది వేదికల మీద ఉపన్యసించాడు. ఈ ఆర్తి, ఆవేదన మలిదశలోను చల్లారింది లేదు. కొల్లూరి ఒక హైదరాబాదీగా ఇక్కడి చరిత్ర సంస్కృతి పట్ల ఎప్పుడు నిబద్ధతతో వ్యవహరించాడు. వాయిస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు కెప్టెన్‌ పాండురంగారెడ్డి వంటి నాయకులతో నిత్యం అనేక ఆలోచనలు పంచుకున్నాడు. ముఖ్యంగా హైదరాబాద్‌ ముస్లిం సమాజంతో, విద్యావంతులతో కలిసి పని చేశాడు. హైదరాబాద్‌ అస్తిత్వం ప్రమాదంలో పడే ప్రతీసారీ ‘సేవ్‌ హైదరాబాద్‌’ అంటూ గర్జించాడు కొల్లూరి.


ఇక సామాజిక ఉద్యమాల్లో సైతం కొల్లూరి పోషించిన పాత్ర విస్మరించలేనిది. దళితుల్లో దగాపడిన సమూహాల కోసం కూడా బరిగీసి నిలబడిన సాహసం ఆయనది. ఎమ్మార్పీఎస్‌ ఏర్పాటుకు ముందు జరిగిన అనేక చర్చల్లో స్వయంగా పాల్గొని దిశానిర్దేశం చేసిన పెద్దదిక్కు డా.కొల్లూరి. ఒక్క ఎమ్మార్పీఎస్‌తోనే కాదు సామాజిక న్యాయమే లక్ష్యంగా ముందుకు వచ్చిన అనేక సంఘాలకు, వేదికలకు వెన్నుదన్నుగా నిలిచాడు. తన వంతు పాత్రను బాధ్యతతో పోషించాడు. సాహిత్యంలో దండోరా గొంతుకను బలంగా వినిపించిన నాగప్పగారి సుందర్రాజు వంటి కవులు, రచయితలకు కొల్లూరి ఒక పథనిర్దేశకుడిగా నిలబడ్డారు. అక్షరాల విలువ తెలిసిన ఆలోచనాపరునిగా పదునైన సాహిత్యసృజనకు మార్గనిర్దేశనం చేశారు. తెలంగాణ సాధనలో సాహిత్య సాంస్కృతిక రంగాల పాత్ర కీలకమని గుర్తించాడు.


డా.కొల్లూరి చనిపోయే సమయానికి కనీసం సొంత ఇల్లు కూడా లేదు. అనారోగ్యానికి వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితి. ఇవాళ ఉద్యమాలను, పార్టీలను ఆధారంగా చేసుకొని కోట్లు కూడబెట్టుకునే స్వార్ధపూరిత జమానా నడుస్తున్నది. ఇలాంటి కాలంలో విలువలతో కడదాక ప్రజల కోసమే జీవించిన సిసలైన ప్రజానేత డా.కొల్లూరి. ఈ దేశంలో నిరుపేదలైన బహుజనుల విముక్తి కోసం తన ఏడుదశాబ్దాల జీవితాన్ని తృణప్రాయంగా ధారపోసిన మహా మనిషి కొల్లూరి. బహుజన రాజ్యాధికార సాధనే కాదు, అంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుజనుల వాటా బహుజనులకు దక్కాలన్న ఆయన ఆశయాన్ని సాధించాలి. అదే డా.కొల్లూరికి నిజమైన నివాళి.

డా.పసునూరి రవీందర్‌

కొంగర మహేష్‌

Updated Date - 2021-03-11T06:32:18+05:30 IST