ట్రంప్‌ నోట సచిన్‌, కోహ్లీ మాట

ABN , First Publish Date - 2020-02-25T10:43:20+05:30 IST

ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ‘మొతేరా’ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో...

ట్రంప్‌ నోట సచిన్‌, కోహ్లీ మాట

మొతేరా స్టేడియం ప్రారంభోత్సవంలో  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

ఆ ఇద్దరు గొప్ప క్రికెటర్లు

అహ్మదాబాద్‌: ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ‘మొతేరా’ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా చేసిన ప్రసంగంలో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్లను ట్రంప్‌ ప్రస్తావించారు. వారి క్రికెట్‌ నైపుణ్యాలను కొనియాడిన ఆయన ‘సచిన్‌, విరాట్‌ ప్రపంచంలో గొప్ప క్రికెటర్లు. వారు ఆడుతుంటే భారత క్రికెట్‌ అభిమానులు మైమరచిపోతారు. వారికి పెద్దఎత్తున మద్దతు పలుకుతారు’ అని అన్నారు. దాంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు పెద్దపెట్టున చప్పట్లు చరవగా..ప్రధాని మోదీ నవ్వుతూ కనిపించారు. ఇక గుజరాత్‌ రాష్ర్టానికి చెందిన గొప్ప దేశభక్తుడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరును ఈ స్టేడియానికి పెట్టడం ముదావహమని ట్రంప్‌ కొనియాడారు. గతంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెక్సాస్‌లోని భారీ ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఆయనకు స్వాగతం పలికామని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో తమను స్వాగతించడం గొప్పగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో వేలాది మంది ప్రజల మధ్య ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానితోపాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. 


  ‘మొతేరా’ ఆద్యుడిని మరిచారు!

మృగేష్‌ జైకృష్ణ.. బీసీసీఐ, గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) మాజీ ఉపాఽధ్యక్షుడు. పునర్నిర్మించిన మొతేరా స్టేడియాన్ని ట్రంప్‌ ప్రారంభించినా.. 1983లో నిర్మితమైన అసలు మొతేరా స్టేడియం రూపకర్త మృగేష్‌. అప్పట్లో రికార్డు స్థాయిలో ఎనిమిది నెలల 13 రోజులలో ఆ స్టేడియం సిద్ధమవడంలో జైకృష్ణ అహరహరం శ్రమించారు. కానీ సోమవారం జరిగిన అధునాతన మొతేరా స్టేడియం ప్రారంభానికి ఆయనను ఆహ్వానించకపోవడం గమనార్హం. ‘అవును.. సోమవారం జరిగిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమానికి నాకు ఆహ్వానం రాలేదు’ అని మృగేష్‌ ధ్రువీకరించారు. 76 ఏళ్ల మృగేష్‌ పారిశ్రామికవేత్త. స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గుజరాత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 36 ఏళ్ల కిందట మొతేరా స్టేడియం నిర్మాణంనాటి సంగతులను ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారన్నారు. 


 సచిన్‌ పేరు తప్పు పలికిన ట్రంప్‌

 తన ప్రసంగంలో..సచిన్‌ పేరును ప్రస్తావించిన డొనాల్డ్‌ ట్రంప్‌ స్టేడియంలోని వేలాదిమంది  ప్రజల మన్ననలు అందుకున్నారు. కానీ టెండూల్కర్‌ పేరును ఆయన తప్పుగా పలకడం గమనార్హం. ‘సూచిన్‌’ టెండూల్కర్‌గా పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రసంగంలో సచిన్‌ పేరును అలా ప్రస్తావించడాన్ని ఐసీసీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోకు ఐసీసీ ‘సచ్‌, సుచ్‌, సూచ్‌ ఎవరికైనా తెలుసా?’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 


చారిత్రక ఘటనలకు వేదిక

 1983 నుంచి ఎన్నో చారిత్రక ఘటనలకు మొతేరా వేదికైంది. 1986-87 సిరీస్‌లో దాయాది పాకిస్థాన్‌పై 10వేల పరుగులు చేసిన గవాస్కర్‌ ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కపిల్‌దేవ్‌ 432వ వికెట్‌తో న్యూజిలాండ్‌ దిగ్గజ పేసర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును బద్దలుగొట్టాడు.  2009 నవంబరులో అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్లను, అలాగే 30వేల అంతర్జాతీయ పరుగులను  శ్రీలంకపై సచిన్‌ ఇక్కడే చేశాడు. మరోవైపు తనను ప్రారంభోత్సవానికి ఆహ్వానించ కపోయినా.. మొతేరా రికార్డు పుటల్లోకెక్కడం ఎంతో సంతోషంగా ఉందని 1983లో  స్టేడియం నిర్మాణానికి ఆద్యుడైన జైకృష్ణ తెలిపారు. 

Updated Date - 2020-02-25T10:43:20+05:30 IST