దాగుడుమూతలు

ABN , First Publish Date - 2020-05-31T08:32:25+05:30 IST

ఎస్‌ఈసీ వ్యవహారం రసకందాయంలో పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ ఆట మొదలైంది. ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మధ్యలో కుదించడం కుదరదంటూ హైకోర్టు

దాగుడుమూతలు

  • ఎస్‌ఈసీ వివాదంలో మరిన్ని మలుపులు
  • నిమ్మగడ్డను గుర్తించని ప్రభుత్వం
  • ‘స్వీయ ప్రకటన’ చెల్లదన్న ఏజీ.. ఆపై ఎస్‌ఈసీ కార్యదర్శి సర్క్యులర్‌
  • బాధ్యతల స్వీకరణ ఉత్తర్వులు వెనక్కి
  • హైకోర్టు తీర్పుతో సర్కారు ఆటలు
  • ఆర్డినెన్స్‌ను రద్దు చేయడమంటే
  • అంతకుముందు స్థితి తేవాల్సిందే
  • నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్నట్లే!
  • ఇది న్యాయ నిపుణుల మాట


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎవరు?

‘నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలి’... అని హైకోర్టు చెప్పేసింది. 

‘హైకోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించాను’ అని నిమ్మగడ్డ శుక్రవారమే సర్క్యులర్‌ పంపించారు. 

కానీ... ‘అదేం చెల్లదు. ఆయనంతట ఆయన మళ్లీ కుర్చీలో కూర్చోలేరు. మేం సుప్రీంకోర్టుకు వెళతాం’ అని ప్రభుత్వం చెబుతోంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఎస్‌ఈసీ వ్యవహారం రసకందాయంలో పడింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం-నిమ్మగడ్డ మధ్య ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ ఆట మొదలైంది. ఎస్‌ఈసీ పదవీకాలాన్ని మధ్యలో కుదించడం కుదరదంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. సదరు ఆర్డినెన్స్‌ను కోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తూ జారీ చేసిన జీవోనూ కొట్టేసింది. ఈ తీర్పు అనంతరం... ‘నేను మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను’ అని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఒక సర్క్యులర్‌ జారీ చేశారు. అదే సర్క్యులర్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి (ఇన్‌చార్జి) జీవీఎస్‌ ప్రసాద్‌ అటెస్ట్‌ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ అధికారులందరికీ పంపించారు. దీంతో... నిమ్మగడ్డ మళ్లీ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారికంగా ధ్రువీకరించినట్లయింది.


మారిన సీన్‌...

శనివారం రాత్రి ఒక నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. అసాధారణ రీతిలో అడ్వొకేట్‌ జనరల్‌తో ప్రెస్‌మీట్‌ పెట్టించారు. ఆయనకు ఒకవైపున సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌, మరోవైపు పంచాయతీరాజ్‌ కార్యదర్శి కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ కూర్చున్నారు. వారి సమక్షంలో ఏజీ ఎస్‌.శ్రీరాం ఒక ప్రకటన చేశారు. ‘నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ చెల్లదు’ అని తెలిపారు. ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టును వెళతామని చెప్పారు. అంటే... నిమ్మగడ్డను ప్రభుత్వం ఎస్‌ఈసీగా గుర్తించడంలేదన్న మాట! అందుకు తగినట్లుగానే... ఏజీ ప్రెస్‌మీట్‌ ముగిసిన కాసేపటికే, ఎస్‌ఈసీ కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ నుంచి మరో సర్క్యులర్‌ వెలువడింది. ‘‘నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా మళ్లీ బాధ్యతలు చేపట్టినట్లు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశం వచ్చేదాకా ఇదే స్థితి కొనసాగుతుంది’’! అని అందులో తెలిపారు. ఈ తాజా సర్క్యులర్‌ పూర్తిగా ప్రభుత్వ నిర్దేశితమని తెలుస్తోంది. దీనిని జారీ చేసేముందు రమేశ్‌ కుమార్‌ను సంప్రదించలేదు. ఆయన ఆమోదం తీసుకోలేదు. వెరసి... హైకోర్టు తీర్పును జీర్ణించుకోలేని, నిమ్మగడ్డ పునఃనియామకాన్ని అంగీకరించలేని ప్రభుత్వం...  దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌తో వివరణ ఇప్పించి, ఎస్‌ఈసీ సెక్రటరీ ద్వారా ‘విత్‌డ్రా’ సర్క్యులర్‌ జారీ చేయించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


నిపుణులేమంటున్నారు...

ఆర్డినెన్స్‌ను, దాని ఆధారంగా జారీ చేసిన జీవోలను కొట్టివేసిన తర్వాత కూడా... నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను ఎస్‌ఈసీగా గుర్తించకపోవడంపై పలువురు న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘నిమ్మగడ్డను మేం తొలగించలేదు. సంస్కరణల్లో భాగంగా పదవీకాలాన్ని కుదించాం. దాని ప్రభావం వల్ల ఆయన పదవీకాలం ముగిసింది’ అని ఇదే ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ఇప్పుడు... పదవి కుదించే ఆర్డినెన్స్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అంటే... ఈ ఆర్డినెన్స్‌ జారీకి ముందున్న స్థితిని కొనసాగించాలని చెప్పినట్లే. ఆయనను తొలగిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి... మళ్లీ నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-05-31T08:32:25+05:30 IST