ధనం.. దుఃఖభాజనం

ABN , First Publish Date - 2020-11-09T08:43:27+05:30 IST

ప్రపంచంలో ధనానికి ప్రాధాన్యం ఎక్కువ. కానీ సంపాదించిన ఆ ధనం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. అజగర మునితో ప్రహ్లాదుని సంభాషణ సందర్భంగా

ధనం.. దుఃఖభాజనం

రాజతః చోరతః శత్రోః స్వజనాత్పశుపక్షితః!

అర్థిభ్యః కాలతః స్వస్మాన్నిత్యం ప్రాణార్థవద్భయమ్‌!!


ప్రపంచంలో ధనానికి ప్రాధాన్యం ఎక్కువ. కానీ సంపాదించిన ఆ ధనం వల్ల కూడా అనేక అనర్థాలున్నాయని శ్రీమద్భాగవతం చెబుతోంది. అజగర మునితో ప్రహ్లాదుని సంభాషణ సందర్భంగా ధన ప్రసక్తి వస్తుంది. అప్పుడు వేదవ్యాస భగవానుడు చెప్పించిన ఈ మాటలు.. అందరూ తెలుసుకోవాల్సిన అపురూపమైన విషయాలు. ‘‘రాజుల వల్ల, చోరుల వల్ల, శత్రువుల వల్ల, తనవారి వల్ల, పక్షుల వల్ల, కాలము వల్ల.. చివరికి తన వల్ల తనకు కూడా ఽధనవంతులకు నిత్యం భయం ఉంటుంది.’’ అని దీని అర్థం. 

‘‘ధనమూలమిదం జగత్‌’’ ..అన్న భారతీయ ధర్మమే ‘‘దిగర్థందుఃఖభాజనం’’ అని కూడా అన్నది. అంటు ధనమే అన్ని దుఃఖాలకూ కారణమని అర్థం. ధన సంపాదనలో ఎంత కష్టమున్నదో దానికి మించిన కష్టం దాన్ని కాపాడుకోవడంలో ఉందన్న విషయంపై శ్లోకం తెలుపుతున్నది. బాగా డబ్బు సంపాదించేవారిపై పాలకుల దృష్టి ఉంటుంది. దీంతో వారివల్ల చిక్కుల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అతిగా సంపాదించాలన్న దురాశ మనిషిని వక్రమార్గం పట్టిస్తుంది.


అదెప్పటికైనా ప్రమాదమే. అదే విధంగా తాను దాచిన  సొమ్ము దొంగల పాలు కావచ్చు. ధనం ఆత్మీయులను కూడా దూరం చేస్తుంది. ఇలా ఏ విధంగానైనా ధనం వల్ల ప్రమాదాలే ఎక్కువ. అయితే అక్రమ మార్గంలో, అన్యాయంగా సంపాదించి సుఖాలను అనుభవించాలనుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ధర్మ మార్గంలో అవసరానికి తగిన రీతిలో చేసే ధన సంపాదన అసలైన ఆనందాన్నిస్తుంది. అందుకని పండితులైనవారు, ధర్మమార్గ ప్రవర్తకులైన వారు, దీనిపై మమకారాన్ని విడిచిపెడతారు. ధనం ఉన్నవారికి అంతులేని బాధలు ఉంటాయన్న జ్ఞానాన్ని ఇలా శ్రీమద్భాగవతం సప్తమస్కంధంలోని త్రయోదశాధ్యాయంలోని అజగరముని ప్రహ్లాద సంవాదం విపులంగా వివరించింది. 




గన్నమరాజు గిరిజా మనోహరబాబు

Updated Date - 2020-11-09T08:43:27+05:30 IST