Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ ఘటనకు 21 ఏళ్లు

నెత్తుటి జ్ఞాపకం 

 పీపుల్స్‌వార్‌ ఉద్యమానికి  భారీ ఎదురుదెబ్బ

 నేలకొరిగిన ముగ్గురు అగ్రనేతలు

 వారి జ్ఞాపకార్థం పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు

 మావోయిస్టు పార్టీగా ఆవిర్భావంతో పీఎల్‌జీఏగా మార్పు

 నేటి నుంచి వారోత్సవాలు ప్రారంభం

 అప్రమత్తమైన పోలీసులు.. ముమ్మర తనిఖీలు 


వరంగల్/భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా (అప్పటి కరీంనగర్‌ జిల్లా) మల్హర్‌ మండలం కొయ్యూరులో 1999 డిసెంబరు 2న భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.  పీపుల్స్‌వార్‌ కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతోష్‌రెడ్డి, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి శీలం నరేష్‌ మృతి చెందారు. అయితే వీరిని డిసెంబరు 1న బెంగళూరులో పట్టుకున్నారని, హెలికాప్టర్‌లో చిత్రహింసలు పెట్టి హతమార్చి, కొయ్యూరు అడవుల్లో ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని అప్పట్లో పీపుల్స్‌వార్‌ ఆరోపించింది. ఈ విషయమై పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయటంతో జాతీయస్థాయిలో కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ చర్చనీయాంశంగా మారింది. ఈ  ఎన్‌కౌంటర్‌లో  ముగ్గురు అగ్రనేతలను కోల్పోయిన పీపుల్స్‌వార్‌కు గట్టి దెబ్బ తగిలింది.  


అగ్రనేతల స్మారకార్థం అంకురార్పణ

అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌ స్మారకార్థం  2000 డిసెంబరు 2న పీపుల్స్‌వార్‌ గ్రూపు పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ(పీజీఏ)ని ఏర్పా టు చేసింది. అప్పటి నుంచి ప్రతి ఏటా డిసెంబరు 2 నుంచి 8 వరకు పీజీఏ వారోత్స వాలను నిర్వహి స్తోంది. చర్చల సమయంలో 2004లో హైదరా బాద్‌లోని బేగం పేట వద్ద కొయ్యూ రు ఎన్‌కౌంటర్‌ మృ తులు నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌  జ్ఞాపకార్థం భారీ స్థూపాన్ని నిర్మించింది.


ఈ క్రమంలో పీపుల్స్‌వార్‌తో పాటు దేశంలో మరో అతిపెద్ద నక్సల్‌ గ్రూపు ఎంసీసీఐలు 2004 సెప్టెంబరు 21న ఐక్యమై సీపీఐ (మావోయిస్టు) పార్టీగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ (పీజీఏ)ని పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీజీ ఎల్‌ఏ)గా మార్చారు. 21 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ కొయ్యూరు నెత్తుటి జ్ఞాపకాన్ని పీఎల్‌జీఏ వారోత్సవాల్లో స్మరిం చుకుంటోంది. పీఎల్‌జీఏను బలోపేతం చేయటంతోపాటు ఇటీవల జరుగుతున్న దాడుల వెనుక పీఎల్‌జీఏ కీలకంగా ఉంటోంది. యువతను ఆకట్టుకునేందుకు పీఎల్‌జీఏ రిక్రూట్‌మెంట్లను ప్రోత్సహి స్తోంది. డిసెంబరు 2 నుంచిగ్రామగ్రామానా పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోవాలని మా వోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ ఓ ప్రకటనలో కోరారు. ప్రజలు, ప్రజాసంఘాలు సభల్లో అమరులను స్మరించుకోవాలని, యువత పీఎల్‌జీఏలోకి రిక్రూట్‌ కావాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 


నిర్బంధం మధ్య కరోనాతో పోరు

మావోయిస్టులు ఒకవైపు తీవ్ర నిర్భందాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు కరోనాతో పోరాడు తోంది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణతో పాటు అనేకమంది కీల క మావోయిస్టు నేతలు కరోనా, అనారోగ్యంతో  కన్నుమూశారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి భిక్షపతి జనవరి 18న అనారోగ్యానికి గురై మృతి చెందారు. జూన్‌ 10న మరో విప్లవ దిగ్గజం కత్తి మోహన్‌రావు గుండెపో టుతో మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామానికి చెందిన మోహ న్‌రావు కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశారు. అలాగే  మహబూ బాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూ డెం గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ ఆలియాస్‌ యాప నారాయణ కరోనా లక్షణాలతో బాధపడుతూ జూన్‌ 21న గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన కేంద్ర కమిటీ సభ్యురాలు సిద్ధబోయిన సారక్క అలియాస్‌ భారతక్క జూన్‌ 22న దండకారణ్యంలో కరోనా లక్షణాలతో అనారోగ్యానికి గురై గుండె పోటుతో కన్నుమూశారు. వీరితో పాటు మరో నాలుగురైదుగురు ఓరుగల్లుకు చెందిన మావోయిస్టు కీలక నేతల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ పీఎల్‌జీఏ వారోత్సవాల్లో వీరందరినీ స్మరించుకోనున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. 

ఉద్రిక్తతగా ఏజెన్సీ

మావోయిస్టు పార్టీ ఓరుగల్లుపై దృష్టిసారించటంతో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఏడాదిన్నర కాలంగా మావోయిస్టులు ఛత్తీస్‌ గఢ్‌, మహారాష్ట్ర  నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి ప్రవే శిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో సుమారు వెయ్యి మందికి పైగా గ్రేహౌండ్స్‌ బలగాలు, స్పెషల్‌ పార్టీ పోలీసుల బృందాలతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య వార్‌ తీవ్రమవుతోంది. ఫలితంగా పచ్చని అడవిలో నెత్తుటేరులు పారుతున్నాయి. 2020 అక్టోబరు 11న ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురంలో టీఆర్‌ఎస్‌ నేత మడూరి భీమేశ్వర్‌రావును మావోయిస్టులు ఇన్‌ఫార్మర్‌ పేరుతో హతమా ర్చారు. దీనికి ప్రతి దాడిగా అక్టోబరు 18న పోలీసులు ములుగు జిల్లా మంగపేట మండలం దేవునిగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయి స్టులను హతమార్చారు.


25న ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకుడు కోటేష్‌ను ఇన్‌ఫార్మర్‌ పేరుతో మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నపురం వద్ద కాల్చి చంపారు. ఈ ఏడాది అక్టోబరు 25న ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దులోని చిల్లంతోగు గుట్ట సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సెప్టెంబరు నెలలో పీఎల్‌జీఏ బెటాలియన్‌-2 కమాండర్‌, దాడుల సూత్రధారి హిడ్మా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో పర్యటించి వెళ్లారనే ప్రచారం ఓరుగల్లును హీటెక్కించింది. భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపత్తి అడవుల్లో నవంబరు 13న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 28 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఇలా వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. 


వారోత్సవాలపై పోలీసుల నజర్‌

మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల హైఅలర్ట్‌ అయ్యారు. పీఎల్‌జీఏ వారోత్సవాల్లో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలని వ్యూహరచన చేశారు. ఇప్పటికే అడవి ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులు వారోత్సవాల నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లా ల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంత రం తనిఖీలు చేస్తున్నారు.  వరంగల్‌ నగరం లో మావోయిస్టు సానుభూతిపరుల కార్యకలా పాలపై నిఘా పెట్టినట్టు సమాచారం. గొత్తికోయగూడెల్లో తనిఖీలతోపాటు నిరం తరం నిఘా పెడుతున్నారు. 


మావోయిస్టులకు ఎవరూ సహకరించొద్ద ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను గ్రామాల నుంచి సురక్షత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచి స్తున్నారు. ఏటూరునాగారం సమీపంలోని ముళ్లకట్ట వంతెన, కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన, మేడిగడ్డ బ్యారేజీ వంతెన, తుపాకులగూడెం బ్యారేజీ వంతెన నుంచి రాకపోకలపై పోలీసులు నజర్‌ పెట్టారు. పొరుగు రాష్ర్టాలకు సరిహద్దులో ఉన్న వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, తాడ్వాయి, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, మహదేవపూర్‌, భూపా లపల్లి మండలాల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేస్తున్నారు.

Advertisement
Advertisement