Abn logo
Oct 24 2020 @ 00:22AM

ముగ్గురిలో మనవాడే ‘ఘనుడు’

స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే నాయకులు ప్రజాస్వామ్యానికి హానికారులు. వీరిలో కొంతమంది ఇతరుల కంటే మరింత చెడ్డవారు. అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోతే, ఆయన పాలనలో జరిగిన నష్టాల నుంచి అమెరికా సత్వరమే కోలుకునే అవకాశముంది. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి కాకముందే బ్రిటన్ తనలో తాను ముడుచుకు పోసాగింది. చరిత్రపై ఆయన ప్రభావం ఉపేక్షణీయమైనది. నరేంద్ర మోదీ పాలన భారత ప్రజాస్వామ్యనికి ఇప్పటికే అపరిమిత అపకారం చేసింది. దేశ పరిస్థితులను బాగు చేసేందుకు దశాబ్దాలు పడుతుంది.


నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల తరుణంలో బెంగలూరులో స్ట్రోబ్ టాల్బాట్ ప్రసంగ సమావేశానికి నేను అధ్యక్షత వహించాను. ఆయన అప్పట్లో వాషింగ్టన్‌లోని సుప్రసిద్ధ మేధోమండలి ‘బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్’కు అధిపతిగా ఉండేవారు. అంతకు ముందు బిల్ క్లింటన్ ప్రభుత్వంలో విదేశాంగశాఖ ఉపమంత్రిగా భారతీయులకు ఆయన సుపరిచితులు. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే అమెరికా విదేశాంగవిధానం భారత్ ప్రయోజనాలకు దోహదం చేసేదిగా పరిణమించడంలో ఆయన కీలకపాత్ర అవిస్మరణీయమైనది. 


బెంగలూరులో స్ట్రోబ్ టాల్బాట్ ప్రసంగ కార్యక్రమం 2016 నవంబర్ మూడోవారంలో జరిగింది. అప్పటికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. విజయం హిల్లరీ క్లింటన్‌ను వరిస్తుందని అందరూ భావించారు. అయితే అమెరికా ఓటర్ల తీర్పు భిన్నంగా ఉంది. బెంగలూరుకు అమిత ఆనందోత్సాహాలతో రావాల్సిన టాల్బాట్ పూర్తిగా దిగాలుపడిపోయి వచ్చారు. ప్రసంగానికి ముందు నేను ఆయనతో మాటామంతీ జరిపాను. ఒక అబద్ధాలకోరు గెలిచాడని ఆయన ఆక్రోశించారు. ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నో అసత్యాలు చెప్పారని టాల్బాట్ ఆరోపించారు. నేను ఆయనతో ఏకీభవించాను. అయితే ట్రంప్ పదే పదే పలికిన రెండు మాటలు సంపూర్ణ సత్యవాక్కులు అని నేను స్పష్టంగా చెప్పాను. ‘కుటిల హిల్లరీ’ అన్నవే ఆ రెండు మాటలు. 


అమెరికా ప్రథమ మహిళగా, విదేశాంగమంత్రిగా, సెనేటర్‌గా హిల్లరీ క్లింటన్ స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్ విమర్శించారు. మరి అధ్యక్షుడు ట్రంప్ విషయమేమిటి? స్పష్టమే. అవినీతిపరుడు, అసమర్థుడు, అప్రయోజకుడిగా అమెరికన్ ఓటర్ల మనస్సుల్లో ఆయన ముద్రపడ్డారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడంలో ఆయన విఫలమయ్యారు. ఇది ఆయన పాలనా బలహీనతలను బహిర్గతపరిచింది. ఆదాయపు పన్ను విషయంలో వెల్లువెత్తిన ఆరోపణలకు సమాధానమివ్వడానికి నిరాకరించడం ట్రంప్ నిజాయితీని సందేహాస్పదం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఆయన అనర్హుడు అనే అభిప్రాయం ఆ దేశ ఓటర్లలో దృఢపడుతోంది. స్త్రీలను చులకన చేయడం ఆయన స్వతస్సిద్ధ స్వభావమని స్పష్టమవడంతో 2016లో ఆయనకు ఓటు వేసిన మహిళలలో అత్యధికులు ఇప్పుడు భిన్నాభిప్రాయంతో ఉన్నారు. మృదు సంభాషి, మంచీమర్యాదతో వ్యవహరిస్తూ ప్రజావిధానంపై నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్న వివేకశీలి జో బైడెన్ నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలలో విజేత కానున్నారని (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి) పలు సర్వేలలో స్పష్టంగా వెల్లడయింది. 


సమష్టిగా, సమన్వయ సహకారాలతో పరిపాలన నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలకు సార్థకత. డోనాల్డ్ ట్రంప్ వాగాడంబరుడు. తనను తాను గొప్పగా ప్రచారం చేసుకోవడంలోనే ఆయనకు ఆసక్తి. తాము నిర్వహిస్తున్న పదవికి తమ గొప్పదనంతో వన్నె తెచ్చిన అమెరికా అధ్యక్షులు పలువురు ఉన్నారు. ఇరవయ్యో శతాబ్దిలో జాన్ ఎఫ్ కెన్నడీ, థియోడర్ రూజ్వెల్ట్, 19వ శతాబ్దిలో ఆండ్ర్యూ జాక్సన్ అలాంటి ఉదాత్తులే . వారితో ట్రంప్‌కు పోలిక తీసుకురావడమే అసంబద్ధం. 


అమెరికా ప్రజాస్వామ్యానికి ట్రంప్ ఇప్పటికే చేసిన నష్టం కంటే మరింత ఎక్కువ నష్టం చేయలేదంటే అందుకు ఆ దేశ రాజ్యాంగ, పౌర వ్యవస్థల గొప్పదనమే కారణం. మీడియా, విశ్వవిద్యాలయాలు, రక్షణ వ్యవస్థలు, వైజ్ఞానిక సంస్థలు తమ న్యాయవర్తనను, నైతిక నిష్ఠను కోల్పోలేదు. వ్యక్తిగత లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం తమను నియంత్రించేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంలో ఆయా వ్యవస్థలు, సంస్థల వారు గణనీయంగా సఫలమయ్యారు. ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాధించిన పక్షంలో అమెరికా పునర్నిర్మాణంలో ఈ వ్యవస్థలు, సంస్థలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రపంచ వ్యవహారాలలో దాని పాత్రను నిర్మాణాత్మకంగా పునరుద్ధరిస్తాయి.


ప్రపంచ సంపన్న ప్రజాస్వామ్య దేశం అమెరికా మాదిరిగానే, ప్రపంచ పురాతన ప్రజాస్వామ్య రాజ్యం బ్రిటన్‌ కూడా ఇప్పుడు ఒక వాగాడంబరుడి పాలనలో ఉంది. అధికార పీఠాన్ని బోరిస్ జాన్సన్ అధిష్ఠించిన తీరు, ట్రంప్‌కు అధ్యక్ష పదవీ ప్రాప్తి పద్ధతికి భిన్నమైనది కాదు. స్ఫూర్తిదాయక పాలననందించడంలో విఫలమైన థెరెసా మే కు సాహసిక ప్రవృత్తి గల బోరిస్ సరైన ప్రత్యామ్నాయమని బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ భావించింది. 2017 సార్వత్రక ఎన్నికలలో బోరిస్ ప్రజ్ఞాపాటవాల కారణంగానే కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. దీనికి తోడు ప్రత్యర్థి లేబర్ పార్టీ నేత జెరిమీ కోర్బిన్ ప్రభుత్వ నిర్వహణకు పూర్తిగా అనర్హుడని బ్రిటిష్ ఓటర్లు విశ్వసించారు.


డోనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే బోరిస్ జాన్సన్ చాదస్తం లేని వ్యక్తి. నియంతృత్వ ధోరణులు తక్కువ. జాత్యహంకారి కాదు. అయితే అవకాశవాది. పాలకుడిగా ట్రంప్ బలహీనతలు ఆయన అధ్యక్ష పదవీకాలం చివరి సంవత్సరంలో బహిర్గతమయ్యాయి. బోరిస్ జాన్సన్ పట్ల ప్రజలు విముఖత చూపేందుకు ఎంతో కాలం పట్టలేదు. కరోనా మహమ్మారి, యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగే ప్రక్రియ విషయంలో జాన్సన్ వైఖరి ఆయన్ని ఒక అస్పష్టంగా మాట్లాడే హాస్యగాడిగా ప్రజల ముందు నిలబెట్టింది. సార్వత్రక ఎన్నికలలో ఓడిపోయిన లేబర్ పార్టీ కోర్బిన్ నాయకత్వాన్ని తిరస్కరించింది. అన్నివిధాల యోగ్యుడైన కెయిర్ స్టార్మెర్ లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు. బోరిస్ కంటే స్టార్మెరే యోగ్యుడని బ్రిటిష్ ఓటర్లు భావిస్తున్నారు. ఈ పరిణామం, కన్సర్వేటివ్ పార్టీలో బోరిస్ జాన్సన్ స్థానాన్ని బలహీనపరిచింది. ప్రధానమంత్రి పదవికి ఆయన కంటే ఆర్థికమంత్రి రిషి సునాక్ యోగ్యుడనే అభిప్రాయం కన్సర్వేటివ్ ఎంపీలలో బలపడుతోంది. బ్రిటన్‌లో తదుపరి సార్వత్రక ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ లోగా కన్సర్వేటివ్‌లు బోరిస్ జాన్సన్‌ను ఇంటికి సాగనంపే అవకాశమూ ఎంతగానో ఉంది. 2016 నుంచి అమెరికా ఒక వాచాలుడి పాలనతో విసుగెత్తి పోతూంటే, 2017 నుంచి ఇంగ్లండ్‌ ఒక వాగాడంబరుడి అసమర్థ పాలనలో ఉంది. 


సరే, తుదకు తప్పనిసరిగా, ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధిక జనాభా గల మన సొంత ప్రజాస్వామిక వ్యవస్థ విషయాన్ని విలోకిద్దాం. డోనాల్డ్ ట్రంప్ కంటే రెండున్నర సంవత్సరాల ముందు, బోరిస్ జాన్సన్ కంటే ఐదు సంవత్సరాల ముందే నరేంద్ర మోదీ అధికారానికి వచ్చారు. ఈయనా ఒక వాక్శూరుడే. తన పార్టీ, ప్రభుత్వం కంటే తానే అధికుడినని మోదీ అనుకుంటారు. తన అధికారాన్ని పటిష్ఠపరచుకోవడానికి మోసగించేందుకు గానీ, అసత్యాలను చెప్పేందుకు గానీ ఆయన వెనుకాడరు.


కొన్ని విధాలుగా డోనాల్డ్ ట్రంప్, బోరిస్ జాన్సన్‌లతో నరేంద్ర మోదీకి పోలికలు ఉన్నాయి. అయితే అనేక విధాలుగా ఆయన వారిరువురి కంటే భిన్నమైన నేత. ముందుగా పేర్కొనవలసిన విషయం మోదీ ఆ ఇద్దరి కంటే చాలా కాలంగా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ప్రజావ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలను తన సొంత లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించుకోవడంలో ఆయన మంచి అనుభవజ్ఞుడు. రెండో విషయం, తాను విశ్వసించే భావజాలానికి ట్రంప్, జాన్సన్‌ల కంటే మోదీయే ఎక్కువ నిబద్ధుడు. హిందూ అధిక సంఖ్యాకవర్గ వాదానికి ఆయన మూర్తీభవించిన ప్రతీక. మన సమాజంలోని అధిక సంఖ్యాక వర్గాల వారికే తొలి, మలి, తుది ప్రాధాన్యమివ్వాలని ఆయన భావిస్తారు. ట్రంప్ శ్వేతజాత్యహం కారం, విదేశీయుల పట్ల జాన్సన్ వైముఖ్యతను మించినవి ఆయన హిందూ ఆధిక్యతా విశ్వాసాలు. మూడో విషయం తన సైద్ధాంతిక స్వప్నాలను సాకారం చేసుకునేందుకు మోదీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు ఉంది. సంస్థాగత బలం, ఆర్థిక వనరుల సమీకరణ సామర్థ్యాల విషయంలో అమెరికా, బ్రిటన్‌లలోని ఏ మితవాద సంస్థ కూడా సంఘ్‌కు సాటి కాదు. 


ట్రంప్, జాన్సన్ తమ తమ దేశాల ప్రయోజనాలకు ఎంత హానికారులుగా ఉన్నారో నరేంద్ర మోదీ తన దేశ ప్రయోజనాలకు అంతకంటే ఎక్కువ ప్రమాదకారిగా ఉన్నారు. భారత ప్రజాస్వామ్య సంస్థలు దృఢమైనవి కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. తాను చెప్పిట్లుగా చేయాలని ఎఫ్‌బిఐని ట్రంప్ ఆదేశించలేరు. అయితే మన ఆదాయపన్ను శాఖ, దర్యాప్తుసంస్థల అధికారులు ఏమి చేయాలో నరేంద్ర మోదీ స్పష్టంగా నిర్దేశించి, తన లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. స్వతంత్ర, నిష్పాక్షిక తీర్పులను వెలువరించేందుకు మన ఉన్నత న్యాయవ్యవస్థలోని కొంతమంది న్యాయమూర్తులు భయపడుతున్నారు. మీడియాలో పలు సంస్థలు తమ వెన్నెముకను కోల్పోయి భీరువుల్లా వ్యవహరిస్తున్నాయి. ప్రధానమంత్రి వ్యవహారశైలిని ఈ కీలక వ్యవస్థలు ఆక్షేపించలేక పోతున్నాయి. ఆయన పలు తప్పులకు పాల్పడుతున్నారు. సమున్నత సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారు. అయినా వీటికి ఆయన్ని జవాబుదారీగా చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. 


అధికారంలో తిరుగులేని విధంగా కొనసాగడంలో ట్రంప్, జాన్సన్‌ల కంటే మోదీ ఎక్కువ అదృష్టవంతుడు. ప్రతిపక్షాలలో, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తీరుతెన్నులలో ఎటువంటి మార్పు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. హిల్లరీ క్లింటన్‌ను ఓడించడంకంటే జో బైడెన్‌ను ఓడించేందుకు ట్రంప్ చాలా కష్టపడుతున్నారు. జాన్సన్‌కు కోర్బిన్ కంటే స్టార్మెరే ఎక్కువగా గట్టి పోటీ నిస్తున్నారు. మరి మన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విషయమేమిటి? 2014, 2019 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అవమానకరంగా ఓడిపోయింది. ఆశ్రిత పక్షపాతి అన్న అపప్రథను ఆయన ఎదుర్కొంటున్నారు. అనుభవ రాహిత్యం ఆయన్ని తప్పటడుగులు వేయిస్తోంది. దశాబ్దాలుగా కుటుంబ నియోజకవర్గమైన అమేథీని కూడా ఆయన నిలబెట్టుకోలేక పోయారు. అయినప్పటికీ 2024 సార్వత్రక ఎన్నికలలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకువస్తోంది!


స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చే నాయకులు ప్రజా స్వామ్యానికి హానికారులు. వీరిలో కొంతమంది ఇతరుల కంటే మరింత చెడ్డవారు. అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోతే, ఆయన పాలనలో జరిగిన నష్టాల నుంచి అమెరికా సత్వరమే కోలుకునే అవకాశముంది. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి కాకముందే బ్రిటన్ తనలో తాను ముడుచుకుపోసాగింది. చరిత్రపై ఆయన ప్రభావం ఉపేక్షణీయమైనది. నరేంద్ర మోదీ పాలన భారత ప్రజాస్వామ్యానికి ఇప్పటికే అపరిమిత అపకారం చేసింది. ఈ దేశ పరిస్థితులను బాగు చేయడానికి దశాబ్దాలు పడుతుంది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement