గాంధీ స్ఫూర్తితో మోదీ కార్యాచరణ

ABN , First Publish Date - 2020-10-02T06:08:29+05:30 IST

గ్రామీణ వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకునే వేళ ఉపాధ్యాయులు శ్రద్ధతో బోధించిన మహాత్మా గాంధీ పాఠ్యాంశాలు చిరుప్రాయంలోనే ఉన్నత వ్యక్తిత్వానికి...

గాంధీ స్ఫూర్తితో మోదీ కార్యాచరణ

గ్రామీణ వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకునే వేళ ఉపాధ్యాయులు శ్రద్ధతో బోధించిన మహాత్మా గాంధీ పాఠ్యాంశాలు చిరుప్రాయంలోనే ఉన్నత వ్యక్తిత్వానికి సోపానంగా మారాయి. ఆ స్ఫూర్తి, పట్టుదల, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, అలుపెరగని తత్వం బాల్యంలోనే మాలాంటి ఎందరో విద్యార్థులకు ఉన్నత శిఖరాలనధిరోహించడానికి ఆలంబన అయ్యాయి. భారతీయ విద్యా, వైద్య, విజ్ఞాన శాస్త్రాలలో, అనేకమంది ఎన్నెన్నో నూతన విషయాలను ఆవిష్కరించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఈ కోవలోనే నేనూ అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తగా నాసా, ఇస్రో సంస్థలలో అనేక శాస్త్రపరమైన విషయాలను ఔపోసన పట్టగలిగాను. 


‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస’ అవుతుంది అన్న గాంధీ మాటలు నాటికీ నేటికీ నూతనోత్సాహం నింపుతాయి. తగిన రీతిలో శ్రమించేందుకు ఆ మాటలు తారకమంత్రంగా పని చేస్తూనే ఉంటాయి. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న మహాత్ముని సేవాతత్పరత నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. శాస్త్రవేత్త గా నా ప్రస్థానం సాగిస్తునే, ఎక్కడో ఓ మూల ప్రజాసేవకు అంకితం కావాలనే దృఢసంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశానికి ప్రేరేపించింది. 


‘భోజనం పెట్టు వానికి భోజనం లేదంటూ’ కవికోకిల గుర్రం జాషువా పడిన ఆవేదన మన కంట కన్నీరు తెప్పిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడ ఇప్పటిదాకా రైతుల జీవన విధానంలో పెద్దగా మార్పు లేదు. అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి చేయూతనిస్తోంది. రైతులు జవసత్వాలు పుంజుకుని, ఆరుగాలం పడే కష్టానికి తగ్గ ఫలితం సాధించాలనే దిశగా ప్రధాని యోచించి వారి అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టినవే కొత్త వ్యవసాయ బిల్లులు. అవి చట్ట రూపం దాల్చడంతో రైతులు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఈ బిల్లులు ద్వారా దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి దేశంలో ఎక్కడైనా ఎవరికైనా రైతు తనకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చాటుకుంది.


అదేవిధంగా గాంధీజీ కలలు కన్న స్వచ్ఛభారత్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రధాని నరేంద్ర మోది పరిశుభ్రతపై ఒక గొప్ప కార్యక్రమాన్నిన రూపొందించారు. ‘2019లో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆయనకు మన దేశం అందించగల ఉత్తమ నివాళి స్వచ్ఛభారత్’ అని మోదీ అన్నారు. 2014 అక్టోబర్ రెండో తేదీన దేశం నలుమూలలకు విస్తరించేలా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఒక జాతీయ ఉద్యమ రూపంలో మొదలుపెట్టారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన భారత్‌ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని ప్రధాని ఆ సందర్భంగా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద చీపురు చేతబట్టి చెత్తా చెదారాన్ని ఊడ్చివేయడం ద్వారా ఆయన స్వయంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘న గందగీ కరేంగే, న కర్నే దేంగే’ అనే మంత్రాన్ని ఆయన ప్రజలకు ఉపదేశించారు.


హింసతో సాధించేదేమీ లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తానని చెప్పి, ఆ మాటను గాంధీజీ నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం. నేడు ఆ మహనీయుని జన్మదినం. ఆ ఉదాత్తుడికి ఘనమైన నివాళి అర్పిస్తూ స్మరించుకుందాం. 

చందు సాంబశివరావు

అంతరిక్ష శాస్త్రవేత్త (ఇస్రో/నాసా) అధికార ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్

Updated Date - 2020-10-02T06:08:29+05:30 IST