Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆధునిక వేమన

twitter-iconwatsapp-iconfb-icon
ఆధునిక వేమన

ఆత్మగౌరవమ్ము అఖిల సంపదలందు/ గొప్పదంచు బుధులు చెప్పిరయ్య/ కుదువబెట్టవద్దు పదవికోసము దాని / అవధరింపుమయ్య ఆర్షపుత్ర!– అంటూ ఆత్మగౌరవానికున్న అత్యధిక ప్రాధాన్యతను వివరించడంతోపాటు, విఱ్ఱవీగవద్దు విజయము సిద్ధింప/ నీల్గవద్దు కలిమి కలిగినపుడు/ సర్వమిచ్చువాడు సర్వేశ్వరుడెగా– అంటూ స్థితప్రజ్ఞత్వాన్ని ప్రబోధించిన ఆధునిక వేమన డా.టి.వి.నారాయణ. 1925 జులై 26న హైదరాబాద్‌లోని బొల్లారంలో శ్రీమతి తక్కెళ్ల నరసమాంబ, శ్రీ తక్కెళ్ళ వెంకయ్య దంపతులకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు శ్రీ టి.వి. నారాయణ. బాల్యంలో నారాయణగారికీ, వారి తమ్ముడు శంకరరావుగారికీ వాళ్ళ నాన్నగారు ‘రామరామ శతకం’ నుంచి రోజుకొక పద్యం చొప్పున నేర్పించేవారు. సతతం సద్ధర్మగామియై, నిరంతరం న్యాయపథం తప్పకుండా ఆదర్శప్రాయమైన జీవితం గడిపిన వెంకయ్యగారు 1939లో (నారాయణగారి 14వ ఏట) మరణించారు. వీరి తల్లిగారైన శ్రీమతి నరసమాంబ పాలనలో నారాయణ గారు, వారి ఇరువురు సోదరులూ ప్రతికూల ఆర్థిక పరిస్థితులనూ, దుర్భర దారిద్య్రాలనూ ఎదుర్కొంటూ ఉన్నత విద్యావంతులయ్యారు. గౌరవప్రదమైన ఉద్యోగబాధ్యతలు నిర్వహించారు. నిరంతర అధ్యయనం, నిష్కళంక జీవన విధానాన్ని అలవర్చుకున్న టి.వి.నారాయణ ఎం.ఏ, ఎం.ఇడి, ఎల్‌.ఎల్‌.ఎం, పిహెచ్.డి పట్టాలు పొందారు. విద్యా రంగానికి వీరు చేసిన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) ప్రదానం చేసింది.


పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నారాయణ జిల్లా విద్యాధికారిగా, కళాశాల ఆంగ్లాధ్యాపకులుగా, ప్రధానాచార్యులుగా, సెకండరీ విద్యాబోర్డు కార్యదర్శిగా, విద్యాశాఖ ఉపసంచాలకులుగా, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా వివిధ హోదాలలో సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. మూడు దశాబ్దాలకుపైగా విద్యాశాఖలో ఉత్తమ అధ్యాపకులుగా, ఉన్నత పరిపాలనాదక్షులుగా వేలాదిమంది విద్యార్థులను ప్రత్యక్షంగా ప్రభావితం చేశారు. శ్రమ సంస్కృతిని త్రికరణశుద్ధిగా గౌరవించడమే కాదు, నిత్య జీవితాచరణగా నిరూపించిన కర్మయోగి డా.టి.వి.నారాయణ. నిరంతర గ్రంథాధ్యయనం వల్ల పెంపొందిన సాహిత్యాభిలాషతో హృదయం స్పందించినప్పుడల్లా కవిత్వం, పద్యాలు, వ్యాసాలు రాశారు. ఆయా సందర్భాలను పురస్కరించుకుని పత్రికల వారి విజ్ఞప్తి మేరకు, ఆకాశవాణి వారి పిలుపు మేరకు నారాయణగారు రచనలు చేసి పంపేవారు.


నూనూగు మీసాల నూత్నయవ్వనవేళ సదాలక్ష్మితో ప్రేమలోపడిన నారాయణగారి హృదయాంతరాళం నుంచి వెలువడిన గీతాల సంపుటి ‘మిమువీడిన ఫలం’ పేరిట వెలువడింది. 1983 మార్చి నెలలో వీరి తొలికవితా సంపుటి ‘ఆత్మదర్శనం’ ప్రచురింపబడింది. 1987 అక్టోబర్‌ మాసంలో ‘అమరవాక్సుధాస్రవంతి’ గ్రంథం అచ్చయింది.


సాంఘిక సమతావాదం, హేతువాదదృష్టి, సంఘసంస్కరణాభిలాష, ఆధ్యాత్మిక తత్త్వప్రబోధాల అభినివేశం గల నారాయణ సహజంగానే వేమన పద్యాలతో బాగా ఆకర్షితులయ్యారు. తేటతెలుగులో ఆటవెలదులను రచించాలన్న కోరిక కలిగింది. ఒకనాడు ప్రార్థనానంతరం వీరు ఆలోచిస్తుండగా ‘అవధరింపుమయ్య ఆర్షపుత్రా!’ అన్న మకుటం స్ఫురించింది. ఈ మకుటంతో ‘ఆర్షపుత్రశతకం’ పేరిట 108 పద్యాలు రాశారు. ఈ శతకం పండితుల, పామరుల ఆదరణను పొందింది. ‘‘ఆదరించిరట ఆదికాలము నుండి/ ఆస్తికులను వోలె నాస్తికులను/ పరిమళించెనిచట భావపుష్పములెన్నో/ అవధరింపుమయ్య ఆర్షపుత్ర!’’ – అని ప్రవచించిన నారాయణగారి అపారమైన శిష్యసంపదలో ఆస్తికులూ, నాస్తికులూ, హేతువాదులూ, భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులూ, ఆర్యసామాజికుల వంటి విభిన్న భావధారలవారున్నారు.


విద్యకూ, ఉద్యోగానికీ మాత్రమే లంకె ఉన్న నేటి సమకాలీన వ్యవస్థలో పదవీ విరమణ నాటికి పిహెచ్‌.డి పూర్తిచేసిన నారాయణ, పదవీవిరమణానంతరం ఎల్‌.ఎల్‌.బి; ఎల్‌.ఎల్‌.ఎం డిగ్రీలు పొందారు. ‘‘మంచి కర్మ యెపుడు మంచినే చేకూర్చు/ చెడ్డకర్మ సతము చెడుగు చేయు/ కర్మకెప్పుడెట్టి కక్షయే లేదయా...’’ అని స్పష్టంచేసిన ఈ సహజకవి, వందో పద్యంలో, ‘‘అమలు చేయలేని ఆదర్శముల జెప్పి/ మోసపుచ్చవద్దు మోటుజనుల/ అర్థమైన నాడు అంతు తేల్చెదరయా...’’ అంటూ సూటిగా, స్పష్టంగా అల్పాక్షరాలలో, అనల్పార్థాలను స్ఫురింపజేశారు. ఆయన పద్యాలు సూక్తులుగా, సామెతలుగా ప్రజల నాలుకలపై నడయాడే లక్షణం కలిగి ఉన్నాయి.


అలాగే ‘భవ్య చరిత శతకము’, ‘జీవనవేదం’, ‘శ్రుతిసౌరభం’ మొదలైన పద్య కదంబాలను ప్రకటించిన నారాయణగారి రేడియో ప్రసంగాల సంపుటి ‘మహనీయుల మహితోక్తులు’ శీర్షికన వెలువడింది. ‘ది సాండ్స్‌ ఆఫ్‌ టైం’ ఆంగ్ల పద్యకృతిని వీరు తమ తల్లిగారికి అంకితమిచ్చారు. అయిదారు ఉపనిషత్తులను తేటతెలుగులోకి అనువదించారు. సామాజిక, సాహిత్య, తాత్త్విక, మనస్తత్వ, విద్యా సంబంధమైన విషయాలపై వందలాది వ్యాసాలను రచించిన నారాయణగారి రచనాశైలి సహజ సుందరంగా, సరళంగా, చదివింప జేసేదిగా ఉంటుంది.


నిరుపమానమైన దేశభక్తి, సామాజిక న్యాయచింతన, నిరాడంబర జీవనవిధానం, శిష్యులపై ప్రసరించిన గురువాత్సల్యం, క్రమశిక్షణతో కూడిన ఉదాత్తవ్యక్తిత్వం, సమసమాజ నిర్మాణకాంక్ష రూపుగట్టిన నారాయణ గారికి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ వంటి అత్యున్నత పురస్కారం అందించింది. 96 ఏళ్ల నిండైన జీవితం పూర్తిచేసుకున్న నారాయణగారు మంగళవారం ఉదయం అస్తమించారు. వారి ఆదర్శాలు నేటితరానికి అనుసరణీయాలు.

ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

పూర్వ ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలయం

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.