అడ్డుకున్నా.. ఆగలేదు

ABN , First Publish Date - 2020-10-24T09:32:13+05:30 IST

మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని, సన్న రకం వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని

అడ్డుకున్నా..  ఆగలేదు

జగిత్యాల కలెక్టరేట్‌ను ముట్టడించిన రైతులు

మొక్కజొన్న, సన్న ధాన్యానికి మద్దతు ధర కోసం డిమాండ్‌

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హౌస్‌ అరెస్టు


జగిత్యాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని, సన్న రకం వరిధాన్యానికి క్వింటాల్‌కు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక శుక్రవారం చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చింది. ఆందోళన నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌, రైతు ప్రతినిధులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఎస్పీ సింధూ శర్మ ఆధ్వర్యంలో జగిత్యాలలో భారీగా పోలీస్‌ బలగాలను మోహరించారు. రైతులు కలెక్టరేట్‌ వైపు రాకుండా చుట్టూ బారీకేడ్లను పెట్టడంతో పాటు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పా టు చేశారు. జగిత్యాలలో 144 సెక్షన్‌ విధించారు. అయినా పోలీసుల కళ్లుగప్పి రైతులు కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ధర్నా చేస్తున్న రైతులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా, ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీస్‌ వాహనం అద్దాలు పగిలాయి. కలెక్టర్‌ బయటకు వచ్చి వినతి పత్రాలు తీసుకోవాలని రైతులు పట్టుబట్టారు. అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ వచ్చి వినతి పత్రాలు స్వీకరించారు. కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.


కడుపు కాలి రైతులు రోడ్డెక్కారు: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని కడుపు కాలి రైతులు రోడ్డెక్కారని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్‌ లక్ష్యంగా పని చేస్తున్నారని, రైస్‌మిల్లర్లతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేంద్రం వెంటనే మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వ రంగ సంస్థలతో కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-24T09:32:13+05:30 IST