నేను ఏ తప్పూ చేయలేదు

ABN , First Publish Date - 2022-01-27T08:40:22+05:30 IST

తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై సీబీసీఐడీ విచారణ వేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు.

నేను ఏ తప్పూ చేయలేదు

కక్ష సాధింపుతోనే సీబీసీఐడీ విచారణ

ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం


అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): తాను ఏ తప్పూ చేయలేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై సీబీసీఐడీ విచారణ వేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ‘సీబీసీఐడీ విచారణ వేసినట్లు మీడియా ద్వారా తెలిసింది. నా శ్రేయోభిలాషుల అనుమానాలు నివృత్తి కోసం సమాధానం చెప్తున్నాను. ఇది పాత సబ్జెక్ట్‌. టైపో గ్రాఫిక్‌ మిస్టేక్‌ వల్ల జరిగింది. దీనిని నేరంగా పరిగణించి, గతంలో నా ప్రత్యర్థులు వివాదం చేశారు. దాని ఫలితమే ఇప్పుడు నాపై విచారణ. ఎన్నికల అఫిడవిట్‌లో డిగ్రీ క్వాలిఫికేషన్‌ అని ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇంటర్మీడియట్‌ అనే ఇచ్చాను. నేను సర్వీ్‌సలో ఉండగా, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉన్న వాళ్లని హెడ్‌ ఆఫీ్‌సకు డిప్యూటేషన్‌పై పిలిచారు. నా క్వాలిఫికేషన్‌ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్స్‌ అని స్పష్టంగా చెప్పాను. అప్పట్లో డీకాంని బీకాంగా టైప్‌ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చానని ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో దానిపై విచారణ జరిగింది. అది నేరపూరితం కాదని, ఎలాంటి ప్రయోజనాలూ పొందలేదని, పని్‌షమెంట్‌ సరికాదని అప్పటి విచారణ అధికారి కూడా తేల్చారు.


దాంతో 2019లోనే దాన్ని ముగించారు. నాపై ఉన్న ఛార్జస్‌ అన్నీ డ్రాప్‌ అయి మూడేళ్లు దాటింది. కానీ, నేను టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేక, అసూయతో మా శాఖలోని వారే ఫిర్యాదు చేశారు. బి.మెహర్‌కుమార్‌ అనే ఉద్యోగితో లోకాయుక్తలో పిటిషన్‌ వేయించారు. నా రికార్డుల్లో తప్పులుంటే అతనికి వచ్చిన నష్టం ఏమిటి?  అతను మా ప్రత్యర్థి. ఒకసారి ముగిసిన అంశంపై ఏ విధంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారో చట్టపరంగా సమాధానం చెప్పాలి. ఇందులో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీలో సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రోద్భలంతోనే ఇదంతా జరిగింది. అతను మాకు వ్యతిరేకంగా ఉండేవారు. ఎన్జీవో ఆర్గనైజేషన్‌లో కూడా నాపై పోటీకొచ్చి ఓడిపోయారు. ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదీ సక్సెస్‌ కాలేదు. ఇది కూడా సక్సెస్‌ కాదు’ అన్నారు. లోకాయుక్త నుంచి సీబీసీఐడీకి విచారణకు రావడంలో ఎంతవరకు చట్టబద్ధత ఉందనేది చూడాలని అశోక్‌బాబు చెప్పారు.


‘ప్రభుత్వం కూడా ఆనాడు డ్రాపయింది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా వచ్చాయి. చిన్న పొరపాటుకి అన్ని విచారణలు పూర్తి చేసి, క్లీన్‌ చీట్‌ ఇచ్చారు. ఒకసారి కోర్టుకెళ్లి విఫలమయ్యారు. ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెచ్చారు. సూర్యనారాయణ ప్రభుత్వ సొంత మనిషి. ఆయన వెనుక ఎలాంటి ఆర్గనైజేషన్‌ లేదు. టీడీపీని వ్యతిరేకించినందునే ప్రభుత్వం అతన్ని దగ్గరకు తీసింది. జీరోను హీరోను చేశారు. అతను డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌ పాస్‌ కాకుండా వేరే వాళ్ల నంబర్‌తో పాసైనట్లు ఎస్‌ఆర్‌ ఎంట్రీ చేస్తే, సస్పెండ్‌ అయ్యారు. చాలా మందికి ఇది తెలియదు. అతనిని డిస్మిస్‌ చేయాలని కూడా ప్రభుత్వం సిఫారసు చేస్తే, రిక్వెస్ట్‌ చేసి, సస్పెన్షన్‌ తెచ్చుకున్నారు. ఇలాంటి చరిత్ర ఉన్న వ్యక్తిని ప్రభుత్వం దగ్గరికి తీసి, నాపై కక్షసాధింపులకు పాల్పడుతోంది.


దీనిపై చట్టపరంగా పోరాడతా. అవసరమైతే న్యాయపోరాటం చేస్తా’ అని చెప్పారు. ‘ఇవాళ సూర్యనారాయణ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండొచ్చు. రేపు ప్రభుత్వాలు మారొచ్చు. భవిష్యత్‌ ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు. ‘ఉద్యోగుల ఆందోళనను మళ్లించడానికా?  లేక టీడీపీ మద్దతు ఉన్నందున నైతికంగా దెబ్బతీయడానికి చూస్తున్నారా అనేది చూడాలి. లోకాయుక్త నిర్ణయం తీసుకునే ముందు నా వివరణ తీసుకోలేదు. సీబీసీఐడీ చేపట్టాల్సిన అంశం కాదిది. సీబీఐ విచారణ వేసినా భయపడేది లేదు’ అని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-27T08:40:22+05:30 IST