తెలుగమ్మాయికి కిరీటం దక్కేనా?

ABN , First Publish Date - 2021-12-16T04:43:30+05:30 IST

మిస్‌యూనివర్స్‌ కిరీటం మన సొంతమయింది. ఈ రోజు జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

తెలుగమ్మాయికి కిరీటం దక్కేనా?

మిస్‌యూనివర్స్‌ కిరీటం మన సొంతమయింది. ఈ రోజు జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మిస్‌ వరల్డ్‌ కిరీటం కైవసం చేసుకోవడానికి భారత్‌ నుంచి పోటీలో నిలిచింది తెలుగమ్మాయి మానసా వారణాసి. 


ఆ విశేషాలు ఇవి...

ఈ రోజు 70వ మిస్‌ వరల్డ్‌ 2021 పోటీలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ పోటీల్లో 23 ఏళ్ల తెలుగమ్మాయి మానసా వారణాసి భారత్‌ తరపున పోటీలో ఉన్నారు. గత ఏడాది ఫెమినా మిస్‌ ఇండియా 2020 కిరీటం కైవసం చేసుకున్న మానస మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మానస వాసవి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఎక్స్‌చేంజ్‌ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. మానస అందాల పోటీల్లో రాణించడం వెనక కుటుంబ ప్రోత్సాహం ఉంది. నిజానికి మానస చిన్నప్పుడు నలుగురిలో కలవడానికి, మాట్లాడటానికి సిగ్గుపడేది. కానీ క్రమంగా తనను తాను మెరుగుపరుచుకుంది. పోటీల్లో ధైర్యంగా పాల్గొనేది. భరతనాట్యం, మ్యూజిక్‌ను బాగా ఇష్టపడే మానస.. తన స్ఫూర్తి ‘‘మిస్‌వరల్డ్‌ 2000 సంవత్సరం విజేత ప్రియాంక చోప్రా’’ అంటారు. ‘‘ఎంతో మంది బ్యూటీ క్వీన్స్‌ ఉన్నా ప్రియాంక చోప్రా మాత్రం ప్రత్యేకం. ఆమె అన్వేషకురాలు. ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఆమెను చూసే నాలో ఉన్న బెరుకును దూరం చేసుకున్నాను. నాకు బాగా స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఆమె’’ అని అంటారు మానస. 


తన వంతు బాధ్యతగా...

21 ఏళ్ల వయసులో మోడలింగ్‌ పై ఫోకస్‌ పెట్టిన మానస కొద్దికాలంలోనే ఆ రంగంలో తనదైన ముద్ర వేశారు. మానస మంచి డ్యాన్సర్‌ కూడా. భరతనాట్యంలో మంచి నైపుణ్యం ఉంది. అంతేకాదు స్విమ్మర్‌ కూడా. పాటలు కూడా బాగా పాడతారు. మోడలింగ్‌లోకి అడుగుపెట్టాక సామాజిక సేవపైనా దృష్టి సారించారామె. సమయం దొరికినప్పుడల్లా ముషీరాబాద్‌ బాలికల పాఠశాలలో పిల్లలకు ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులు బోధించే వారు. కోఠిలో ఉన్న షెల్టర్‌ హోమ్‌లో ఉన్న పిల్లలకు సైతం పాఠాలు చెప్పేవారు. సమాజంలో మార్పు కోసం తన వంతు బాధ్యతగా పనిచేశారు. పిల్లల సంరక్షణకు సంబంధించిన చట్టాలను మరింత బలోపేతం చేయాలని కోరుతూ ‘‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’’ అనే ప్రాజెక్ట్‌లోనూ పాలు పంచుకుంటోంది. హైదరాబాద్‌ పోలీసులు చేపట్టిన ‘వి కెన్‌’ క్యాంపెయిన్‌లోనూ పాలు పంచుకుంటోంది.


విజేతగా తిరిగిరావాలని...

మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకోవడంతో సంబరాలు చేసుకుంటున్న భారతావని మిస్‌ వరల్డ్‌ కిరీటం సైతం మనమే గెలుచుకోవాలని కోరుకుంటోంది. విజేతగా నిలవాలని కోరుకుంటూ ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు పోర్టారికోలో జరగనున్న పోటీల్లో విజేతకు జమైకాకు చెందిన గత విజేత టోనీ యాన్‌ సింగ్‌ కిరీటం తొడుగుతారు.

Updated Date - 2021-12-16T04:43:30+05:30 IST