బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN , First Publish Date - 2022-01-07T20:48:26+05:30 IST

ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (ఎస్ఎన్ డిపి) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్: ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బేగంపేట నాలా పరిసర ప్రాంత ప్రజల వరదముంపు సమస్యకు నాలాల సమగ్ర అభివృద్ధి (ఎస్ఎన్ డిపి) కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి జీహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, రెవెన్యూ, దేవాదాయ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ అంశాలపై  సమగ్రంగా చర్చించారు. 


ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బేగంపేట నాలా కు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే వరద నీటితో బేగంపేట డివిజన్ లోని బ్రాహ్మణ వాడి, అల్లంతోట బావి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాలలో ని ప్రజలు వరద ముంపుకు గురవుతున్నారని వివరించారు. ఎస్ఎన్డిపి కార్యక్రమం క్రింద ఈ నాలా కు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఆయా కాలనీల నుండి స్ట్రామ్ వాటర్ పైప్ లైన్, సీసీ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో ఆయా ప్రాంతాల ప్రజలకు వరదముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం చూపినట్లు అవుతుందని మంత్రి తెలిపారు. ఎస్ఎన్డీపి ప్రాజెక్ట్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు సమన్వయంతో  వ్యవహరించి ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. 


ముషీరాబాద్ మండల పరిధిలోని భోలక్ పూర్ లో గల సోమప్ప మఠం కు చెందిన 3,571 గజాల స్థలంలో సుమారు 130  నిరుపేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్నాయని, వీరిలో 53 కుటుంబాలకు 1996 సంవత్సరంలో పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల వారు విద్యుత్, నల్లా కనెక్షన్ వంటి సౌకర్యాలు పొందారని చెప్పారు. ఈ స్థలాన్ని జీహెచ్ఎంసి స్వాధీనం చేసుకొని, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వివరించారు. అదేవిధంగా ముషీరాబాద్ మండల పరిధిలోని జీరా కాంపౌండ్ లో సుమారు 70 కుటుంబాల వారు ఎన్నో సంవత్సరాలుగా ఇండ్లను నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారని, వీరికి రోడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. 


దేవాదాయ శాఖ కు చెందిన ఈ స్థలాన్ని జీహెచ్ఎంసి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా స్థల సేకరణ జరిపితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలను కూడా సిద్దం చేసినట్లు చెప్పారు. రాంగోపాల్ పేట డివిజన్ లోని 134 గృహాల వారు GO 816 క్రింద 1994 సంవత్సరంలో రెగ్యులరైజేషన్ క్రింద దరఖాస్తు చేసుకున్నారని, సుప్రీం కోర్టు లో పలు వివాదాలు పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగలేదని వివరించారు.  సనత్ నగర్ లోని ఇండస్త్రియల్  ప్రాంతంలో అండర్ పాస్ నిర్మాణ పనులు, పతే నగర్ వంతెన విస్తరణ, రాణిగంజ్ రైల్వే బ్రిడ్జి పనులను చేపట్టేందుకు రైల్వే, జీహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-01-07T20:48:26+05:30 IST