మనం నిర్వహించుకునే పండగలే మన సంస్కతిని తెలియజేస్తాయి: తలసాని

ABN , First Publish Date - 2022-03-18T20:01:42+05:30 IST

మనం జరుపుకునే పండుగలు మన సంస్కతి, సాంప్రదాయాలను చాటి చెప్పుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

మనం నిర్వహించుకునే పండగలే మన సంస్కతిని తెలియజేస్తాయి: తలసాని

హైదరాబాద్: మనం జరుపుకునే పండుగలు మన సంస్కతి, సాంప్రదాయాలను చాటి చెప్పుతాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హోలీ సందర్భంగా ఇందిరా పార్కు లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీవేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేసి వేడుకల్లో పాల్గొన్న వారిలో జోష్ నింపారు. యువత కూడా విజిల్స్, కేకలు వేస్తూ మంత్రితో పాటు డ్యాన్స్ చేశారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు దేశం మొత్తం ఎంతో సంతోషంగా హొలీ జరుపుకోవడం అనాదిగా వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే విధంగా అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 


తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరా పార్క్ అభివృద్దికి అనేక చర్యలు తీసుకుందని, వాకర్స్ సమస్యలను కూడా ఎన్నో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. తమ చిరకాల కోరిక స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి విన్నవించగా, ఇందిరా పార్కులో స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని మంత్రి వెంటనే ప్రకటించారు. ట్యాంక్ బండ్ నుండి ఇందిరా పార్క్ కు రోప్ వే ను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకెళ్ళినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, దైవజ్ఞ శర్మ, స్థానిక కార్పొరేటర్ రచన శ్రీ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్, నిర్వహకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T20:01:42+05:30 IST