మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మెడకు టాంపరింగ్‌ వివాదం!

ABN , First Publish Date - 2022-01-26T08:57:19+05:30 IST

ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో అఫిడవిట్లను మార్చారన్న ఆరోపణల ఉచ్చు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మెడకు బిగుసుకునేలా కనిపిస్తోంది.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మెడకు టాంపరింగ్‌ వివాదం!

  • ఈసీ వెబ్‌సైట్‌లో అఫిడవిట్లను మార్చారని ఫిర్యాదు
  • సాంకేతిక బృందంతో విచారణ జరిపిస్తున్న ఈసీ
  • టాంపరింగ్‌ను ధ్రువీకరిస్తే మంత్రిపై తప్పని చర్యలు!

హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం వెబ్‌సైట్లో అఫిడవిట్లను మార్చారన్న ఆరోపణల ఉచ్చు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మెడకు బిగుసుకునేలా కనిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన శ్రీనివా్‌సగౌడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను ఈసీ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయించినట్లు కొందరు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసుల వివరాలతో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ను ఈసీ తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ప్ర జలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే పోలింగ్‌ పూర్తయి, ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు కొత్త అఫిడవిట్‌ ప్రత్యక్షమైందని, అనర్హత వేటునుంచి తప్పించుకునేందుకు సవరించిన అఫిడవిట్‌నుశ్రీనివా్‌సగౌడ్‌ స్థానిక ఈసీ అధికారులతో కుమ్మక్కై అప్‌లోడ్‌ చేయించినట్లు ఆరోపణలు వ చ్చాయి. దీనిపై గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పడు కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. అంతర్గతంగా సాంకేతిక బృందంతో విచారణ జరిపిస్తోంది. విచారణ అంశం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ట్యాంపరింగ్‌ను సాంకేతిక బృందం ధ్రువీకరిస్తే.. మంత్రిపై ఐపీసీ, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నివేదిక తెప్పించుకుంది. ఇందులో ఈసీ వెబ్‌సైట్‌ను మంత్రి ట్యాంపరింగ్‌ చేసిన విషయం నిజమేనని శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ అంశాన్ని ఎ న్నికల అధికారులు ఎక్కడా బయట పెట్టడంలేదు.  


ఇవీ ఆరోపణలు..

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్‌.. ఆ ఏడాది నవంబరు 14న తొలుత నామినేషన్‌తో పాటు అఫిడవిట్‌ దాఖలు చేశారు. అయితే అందులో ఆయన కొన్ని విషయాలను దాచారంటూ ‘మన పాలమూరు అభివృద్ధి ఫోరం’  సంస్థ ప్రతినిధులు 2018 నవంబరు 29న మహబూబ్‌నగర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.


ఈ ఫిర్యాదులో శ్రీనివా్‌సగౌడ్‌ తన పేరిట, తన భార్య పేరిట ఉన్న రెండు కార్లకు సంబంధించిన ట్రాఫిక్‌ చలాన్ల బకాయిల వివరాలు పేర్కొనలేదని తెలిపారు. టీఎస్‌ 06 ఈఎల్‌ 6666 ఫార్చునర్‌ వాహనం 29 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 35,515 బకాయి ఉందని, దీంతోపా టు శ్రీనివా్‌సగౌడ్‌ సతీమణి పేరున ఉన్న వాహనం టీఎస్‌ 06ఈఆర్‌ 6666 వాహనంపై 8సార్లు ట్రాఫిక్‌ చలాన్లు రూ. 10,180 కలిపి మొత్తం రూ.45,695 బకాయి ఉన్నదని పేర్కొన్నారు. వీటితోపాటు శ్రీనివా్‌సగౌడ్‌ భార్యపేరిట ఏపీజీవీబీ, మహబూబ్‌నగర్‌ బ్రాంచిలో ఉన్న రుణ వివరాలనూ పేర్కొనలేదని ఫిర్యాదులో తెలిపారు.

Updated Date - 2022-01-26T08:57:19+05:30 IST