తెలంగాణా అంటే తుపాకీలో గుండు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN , First Publish Date - 2022-01-20T00:49:45+05:30 IST

తెలంగాణా అంటే తుపాకీలో గుండు లాంటిదని, మనిషిలో గుండె కాయ లాంటిదని మంత్రి

తెలంగాణా అంటే తుపాకీలో గుండు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: తెలంగాణా అంటే తుపాకీలో గుండు లాంటిదని, మనిషిలో గుండె కాయ లాంటిదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని ఊకచెట్టు వాగుపై కురుమూర్తి స్వామి దేవాలయం వరకు కాజ్ వే బ్రిడ్జి, చెక్ డ్యామ్, బీటీరోడ్డు నిర్మాణం కోసం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డెబ్బై ఏళ్ళుగా ఇక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా కూడా పదవులు అనుభవించిన వారున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ వాళ్ళు ఈ ప్రాంతానికి ఏమైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. నలుగురు, ఐదుగురు కలసి ఏదో చేయాలని, మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. మీ తల్లదండ్రులను అడగండి, అప్పుడు ఎలా ఉండేదో, ఇపుడు ఎట్లా ఉందో అని ఆయన అన్నారు.  మిమ్మల్ని చూసుకోండని మా కార్యకర్తలకు మేము పిలుపునిస్తే మీరు ఏమైతారో అలోచించండని ఆయన హెచ్చరించారు. మీకు కావలసిన పనులను అడగండి చేస్తామన్నారు.


కురుమూర్తి స్వామి ఆలయం దాకా రోప్ వే

సీఎం కేసీఆర్‌ను అడుక్కొని ఐనా సరే నిధులు తెస్తామని ఆయన ప్రకటించారు. ప్రజలు అడిగితే కురుమూర్తి స్వామి ఆలయం దాకా రోప్ వే తెస్తామన్నారు. కానీ రాజకీయాలు చేస్తే సహించమని ఆయన హెచ్చరించారు. వాట్సాప్, ట్విట్టర్లను నమ్ముకుని ఇతర పార్టీల నాయకులు ఉరుకులాడుతున్నారని ఆయన ఆరోపించారు. మీరు అధికారంలో ఉంటుండగా ఏమి చేశారో చెప్పండని ఆయన సవాల్ విసిరారు. ఇపుడు అంతకన్నా ఎక్కువ రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను జైల్‌లో పెడితే లక్షలాది మంది ఏ త్యాగానికైనా సిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జైల్ గోడలు బద్దలు కొడతామన్నారు. చరిత్రను తిరగరాసే పరిస్తితి వస్తదని ఆయన హెచ్చరించారు. 


తాము మౌనంగా ఉన్నామనే నెపంతో అడ్డమైన వాళ్ళు అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. తాము బూతులు మాట్లాడితే ఆ నాయకులు తట్టుకోలేరన్నారు. తెలంగాణా అంటే తుపాకీలో గుండు లాంటిదని, మనిషిలో గుండెకాయ లాంటిదని ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T00:49:45+05:30 IST