వైభవంగా హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-08T21:12:26+05:30 IST

నగరం వేదికగా ఇంత పెద్ద జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహించడం రాష్ట్రానికే తలమానికమని క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

వైభవంగా హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్ ప్రారంభం

హైదరాబాద్‌: నగరం వేదికగా ఇంత పెద్ద జాతీయ స్థాయి స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహించడం రాష్ట్రానికే తలమానికమని క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జాతీయ సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌ను మంత్రి, శాట్స్ చైర్మ‌న్ వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, భార‌త ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వ‌ర్ పాండే, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్య‌క్షుడు అరిశ‌న‌ప‌ల్లి జ‌గ‌న్ మోహ‌న్‌రావుతో కలిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి పోటీల‌ను ప్రారంభించారు. తొలుత మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకు ఇలాంటి ఈవెంట్లు మరిన్ని చేసేందుకు క్రీడా సంఘాలు ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారలందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 


చారిత్రాత్మ‌క న‌గ‌రంగా, ఐటీ హ‌బ్‌గా పేరొందిన హైద‌రాబాద్‌ను త్వ‌ర‌లో స్పోర్ట్స్ హ‌బ్‌గా కూడా త‌యారు చేస్తామ‌ని చెప్పారు. ఇక‌, ఉద్యోగ‌, విద్యాప్ర‌వేశాల్లో స్పోర్ట్స్ కోటాను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దేన‌ని మంత్రి అన్నారు.  అనంత‌రం జగన్‌ మోహనరావు మాట్లాడుతూ ముందుగా ఇంత పెద్ద ఈవెంట్‌ నగరంలో నిర్వహించడానికి అనుమతిచ్చిన తెలంగాణ సర్కార్‌, భారత ఒలింపిక్ సంఘం, సాయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి అదుపులోకి వచ్చినా అడపాదడపా అక్కడో ఇక్కడో కేసులు వస్తూనే ఉన్నాయి. అయినా జాతీయ హ్యాండ్‌బాల్ సంఘంపై, తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి వివిధ రాష్ట్రాల‌ నుంచి తమ పిల్లలను ఇక్కడికి పంపినందుకు అన్ని రాష్ట్రాల‌ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 


పోటీల విష‌యానికొస్తే అన్ని జ‌ట్లు గెలుపోట‌ముల‌ను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని, అదే క్రీడాకారుల‌కు ఉండాల్సిన ప్ర‌థ‌మ ల‌క్ష‌ణమ‌ని అన్నారు. ఎందుకంటే క్రీడలు మనుషుల మధ్యే కాదు, ప్రాంతాల మధ్యనున్న దూరాన్ని కూడా చెరిపేస్తాయ‌ని, ఐకమత్యానికి, సమానత్వానికి, సౌభ్రాతత్వానికి క్రీడలు ప్రతీక అని జ‌గ‌న్ మోహ‌న్‌రావు చెప్పారు. ‘హైదరాబాద్‌ను హ్యాండ్‌బాల్‌ అడ్డాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు.


నగరంలో త్వరలోనే హ్యాండ్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తాం. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలే కాకుండా ఆసియా చాంపియ‌న్‌షిప్‌ను కూడా నిర్వ‌హించేందుకు ఆతిథ్య హ‌క్కులు సంపాదిస్తాం. అలానే ఐపీఎల్‌ తరహాలో హ్యాండ్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ను కూడా అతి త్వరలో నిర్వహిస్తాం’ అని జగన్‌ మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఓఏ కోశాధికారి ఆనందీశ్వ‌ర్ పాండే, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి పవన్‌, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T21:12:26+05:30 IST