ఐసీఎంఆర్‌ చెప్పినట్లే కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-06-06T08:43:38+05:30 IST

భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు.

ఐసీఎంఆర్‌ చెప్పినట్లే   కరోనా పరీక్షలు

తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరు నేతలు

చానెళ్లలోనూ నెగెటివ్‌ ప్రచారం సరికాదు

ఏది పడితే అది రాయడం మంచిది కాదు

ఎన్ని వేల మందికి పాజిటివ్‌ వచ్చినా 

చికిత్సకు సన్నద్ధం: మంత్రి ఈటల

ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వండి

10 లక్షల పీపీఈ కిట్లు, 11 లక్షల మాస్కులు సిద్ధం: ఈటల

ఎన్ని వేల మందికి పాజిటివ్‌ వచ్చినా చికిత్సకు సన్నద్ధం


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. కరోనా లక్షణాలున్నవారు, వృద్ధులు, చిన్న పిల్లలు వంటి హైరిస్క్‌ ఉన్నవారికి పరీక్షలు చేయాలంటూ ఐసీఎంఆర్‌ సూచించిందని, ఆ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. శుక్రవారం కరోనా పరీక్షల వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు. కొంతమంది రాజకీయ నాయకులు, మరికొంత మంది సామాజిక మాధ్యమాల్లో కరోనా పరీక్షలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పరీక్షల నిర్వహణ సరిగా లేదని, క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు లేవని ఆరోపిస్తున్నారని తెలిపారు. పకడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని, మందులు, పీపీఈ కిట్లు సరిపడా ఉన్నాయని, పాజిటివ్‌ వచ్చిన వైద్య సిబ్బందికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని మంత్రి వివరించారు. వైద్యుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించేలా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ‘‘కొన్ని రాజకీయ పార్టీలు, కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అదే పనిగా నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారు. వారికో న్యాయం, మాకో న్యాయమా, వాళ్లకో పద్ధతి, మాకో పద్ధతా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దు. పరీక్షల విషయంలో కేంద్రం, ఐసీఎంఆర్‌ ఇచ్చిన సూచనలను పాటిస్తున్నాం. అయినా కోర్టులలో వ్యాజ్యాలు వేసి ప్రభుత్వం పని చేసుకోకుండా చేస్తున్నారు’ అని అన్నారు.


ఆస్పత్రికి వచ్చి విశ్లేషించండి

‘వైద్య సిబ్బందికి, జర్నలిస్టులు, పోలీసులు.. ఇలా ప్రత్యక్ష విధుల్లో ఉన్నవారందరికీ పరీక్షలు చేస్తున్నాం. కొంత మంది సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు పెట్టి చానెళ్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రజలపై ప్రేమ ఉంటే ఆస్పత్రులకు వచ్చి చూసి విశ్లేషించాలి. ఏది పడితే అది రాయడం, చానెళ్లలో చూపించడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తుల సూచనల ఆధారంగా విమర్శలు చేయొద్దని రాజకీయ నామకులకు కూడా చెప్పాం. ఏవైనా సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి. కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేయొద్దు. ప్రభుత్వం పనితనాన్ని, గాంధీ వైద్యుల అంకితభావాన్ని చాలా మంది మెచ్చుకుంటున్నారు. గాంధీలో 1200 మంది రోగులు ఉన్నప్పటికీ.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినా.. దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. డాక్టర్లకు కిట్లు, మాస్కులు ఇవ్వకపోవడం వల్లే వైరస్‌ సోకిందని అంటున్నారు. ఇది తప్పు. ముంబైలో, అమెరికాలో వైద్యులకు కిట్లు ఇవ్వకపోతేనే వారికి వ్యాధి వచ్చిందా? అమెరికాలో 3ు వైద్య సిబ్బందికి వైరస్‌ సోకింది. కిట్లు ఇవ్వకపోతేనే వారికి వైరస్‌ సోకిందా? బాధ్యతగా పనిచేస్తున్న వైద్యులకు ధైర్యం ఇవ్వాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదు’ అని ఈటల అన్నారు.


10 లక్షలకు పైగా పీపీఈ కిట్లు

తమ వద్ద ప్రస్తుతం 10 లక్షలకు పైగా పీపీఈ కిట్లు ఉన్నాయని మంత్రి ఈటల వెల్లడించారు. మరో 11 లక్షలు ఎన్‌-95 మాస్కులున్నాయని తెలిపారు. వైద్యులకు మాస్కులు, గ్లౌజులకు, మందులకు కొరత లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ సిబ్బంది కోసం ప్రస్తుతం 84 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు, 56 లక్షల అజిత్రోమైసిన్‌ టాబ్లెట్లు ఉన్నాయన్నారు. మరో 150 వెంటిలేటర్లను తెప్పించామని తెలిపారు. కేంద్రాన్ని 1000 వెంటిలేటర్లు ఇవ్వాలని కోరామని, అందులో 50 వచ్చాయని, మిగతా 950 త్వరలో వస్తాయని ఆశిస్తున్నామన్నారు. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడానికి అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో సపోర్ట్‌ మిషన్లను పెట్టనట్లు వివరించారు. పాజిటివ్‌ వచ్చిన వైద్య సిబ్బంది కోసం నిమ్స్‌లో ఐసొలేషన్‌ వార్డును పెట్టబోతున్నామన్నారు. రాబోయే కాలంలో ఎన్ని వేల మందికి పాజిటివ్‌ వచ్చినా.. చికిత్స చేయడానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. గాంధీలో ముగ్గురు, పేట్లబురుజు ఆస్పత్రిలో 17 మంది, నిమ్స్‌లో ఆరుగురు వైద్య సిబ్బందికి పాజిటివ్‌ వచ్చిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-06T08:43:38+05:30 IST