Abn logo
Aug 15 2020 @ 04:45AM

చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం

హైదరాబాద్‌కు ‘హెరిటేజ్‌’గా గుర్తింపునకు కృషి: కేటీఆర్‌


అఫ్జల్‌గంజ్‌, 14 ఆగస్టు (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలోని చారిత్రక నేపథ్యం ఉన్న పురాతన కట్టడాలను పరిరక్షించడమే లక్ష్యంగా తెంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అపూరమైన గొప్ప వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌ను యునెస్కో హెరిటేజ్‌ సిటీగా గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రూ. 15 కోట్లతో ఆన్ని హంగులతో ఆధునికీకరించిన మొజంజాహి మార్కెట్‌ను శుక్రవారం మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని, శ్రీనివాస్‌ గౌడ్‌, మేయర్‌ బొంతు రాంమోహన్‌, ఎంపీలు అసదుద్దీన్‌ ఓవైసీ, కె.కేశవరావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో ఎంజే మార్కెట్‌ దగ్గర ఐస్‌క్రీం తిన్నానని గత స్మృతులను నెమరువేసుకున్నారు. మరోవైపు.. రూ.90,48,960 విలువైన 3000 ఐఆర్‌ థర్మామీటర్లు, 3000 ఆక్సీ మీటర్లును హ్యుందయ్‌ మోబిస్‌ ఇండియా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ను సంస్థ ప్రతినిధులు కలిశారు.   


మరో 25 బస్తీ దవాఖానాలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలోని పలు నియోజకవర్గాల్లో సిద్ధమైన 25 బస్తీ దవాఖానాలను శుక్రవారం మంత్రులు ప్రారంభించారు. ఉప్పల్‌ నియోజకవర్గం రామంతాపూర్‌ రాంరెడ్డినగర్‌, యాకత్‌పురా నియోజకవర్గం జవహర్‌నగర్‌లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్‌.. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక ఎమ్మెల్యేలు భేతి సుభా్‌షరెడ్డి, అహ్మద్‌ పాషా ఖాద్రీలతో కలిసి ప్రారంభించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట బోయిగూడలో బస్తీ దవాఖానాను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఖైరతాబాద్‌ కుమ్మరి బస్తీ, సనత్‌నగర్‌ అశోక్‌నగర్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌.. కిషన్‌బాగ్‌, దూద్‌బౌలి, కూర్మగూడలో మంత్రి మహమూద్‌ అలీ.. మన్సూరాబాద్‌ వీరన్నగుట్ట, హస్తినాపురం భూపేష్‌ గుప్తానగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాంగోపాల్‌పేట, పోచమ్మబస్తీ, గడీఖానాలో మంత్రి తలసాని.. ముషీరాబాద్‌లోని కవాడిగూడ, దూద్‌బౌలి, రామ్నా్‌సపురలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, నగరంలోని ఎమ్మెల్యేలు పలు ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించారు.