కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టండి

ABN , First Publish Date - 2021-10-22T21:43:20+05:30 IST

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం కట్టుబడి వుందని, కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నమ్మకం కలుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టండి

హైదరాబాద్: తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం కట్టుబడి వుందని, కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నమ్మకం కలుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచడానికి చేపట్టిన చర్యలపై రాష్ట్రంలో పని చేస్తున్న 11 ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఆయిల్ పామ్ సాగు అవుతున్న జిల్లాలలోని కంపెనీలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 


జిల్లాల వారీగా రైతులను కొత్తగూడెం జిల్లాలో క్షేత్ర సందర్శన కు తీసుకు వెళ్ళి వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేపట్టాలి అని నిర్ణయించినందున , కంపెనీలు అవసరం ఉన్నంత మేరకు నాణ్యమైన మొక్కలను వారి వారి నర్సరీలలో పెంచి రైతులకు  సకాలం లో అంద చేయాలని మంత్రి సూచించారు. రైతులకు అవగాహన కల్పించడం కొరకు విత్తనం నుండి ఆయిల్ తీసే విధానం వరకు అన్నీ అంశాలను రైతులకు అర్థమయ్యే విధంగా సుమారు అర గంట నిడివి గల డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయిల్ ఫెడ్ ఎండీని ఆదేశించారు. 


కంపెనీల వారీగా నర్సరీల ఏర్పాటు, దిగుమతి చేసుకున్న ఆయిల్ పామ్ విత్తన మొలకలు, వాటిని పెంచుతున్న విధానము, అవి నాటాడానికి అందుబాటులోకి వచ్చే సమయము మొదలైన  అంశాల పై సుధీర్గంగా సమీక్షించారు.ఆయిల్ పామ్ మొక్కల లభ్యత, నాణ్యత పరిశీలనకు త్వరలోనే నర్సరీలను సందర్శించనున్నట్టు తెలిపారు.ఆయిల్ పామ్ విత్తన మొలకలపై దిగుమతి సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 30 శాతం నుండి 5 శాతానికి తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్  వెంకట్రామ్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T21:43:20+05:30 IST