రాజ్యాంగాన్ని సవరిస్తే అంబేడ్కర్‌ను అవమానించినట్లా?
ABN , First Publish Date - 2022-02-05T08:21:08+05:30 IST
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, అలా సవరిస్తే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించినట్లా? అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
- కేసీఆరే నిజమైన అంబేడ్కర్ వాది: కేటీఆర్
- ఇప్పటికీ 105 సార్లు సవరించారు
- వాజ్‌పేయి హయాంలోనూ కమిటీ
- అంబేడ్కర్ నినాదాలతోనే రాష్ట్ర సాధన
- విపక్ష నేతలవి చిల్లర ఆరోపణలు
- నిధుల కేటాయింపులో కేంద్రానిది నిర్లక్ష్యం: మంత్రి కేటీఆర్
కందనూలు/జడ్చర్ల, ఫిబ్రవరి 4: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించాయని, అలా సవరిస్తే రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించినట్లా? అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్‌డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2001లో రాజ్యాంగాన్ని సవరించడానికి ఒక కమిటీని వేశారని, అప్పుడు వాజ్‌పేయి.. రాజ్యాంగాన్ని అవమానపరిచి నట్లా? ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలని అన్నారని, ఆయన కూడా అంబేడ్కర్‌ను అవమానించినట్లేనా? అని నిలదీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్థాపించిన ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన మోడల్ స్కూల్‌ను శుక్రవారం మంత్రులు సబితాఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో రూ. 2.10 కోట్లతో నిర్మించిన 40 డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేడ్కర్ నినాదాలతోనే 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడామని, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ నిజమైన అంబేడ్కర్‌వాది అని అన్నారు. రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే.. దానిని తగులబెట్టడంలో తానే ముందుంటానని రాజ్యాంగం రచించిన మూడేళ్ల తర్వాత అంబేడ్కరే అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు, తెలంగాణకు, దళితులకు, రైతులకు జరిగిన అన్యాయాల గురించి లేవనెత్తితే.. సమాధానం చెప్పలేకనే విపక్ష నేతలు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడుతున్న నాల్గవ పెద్ద రాష్ట్రం తెలంగాణ అని రిజర్వ్ బ్యాంక్ నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తాను పుట్టి పెరిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి పాఠశాలను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కేటీఆర్ కొనియాడారు.