మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం-మంత్రి కొప్పుల

ABN , First Publish Date - 2021-11-07T00:08:40+05:30 IST

మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 204 పాఠశాలలను ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు

మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతాం-మంత్రి కొప్పుల

హైదరాబాద్: మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 204 పాఠశాలలను ఏర్పాటు చేశారని మంత్రి కొప్పులఈశ్వర్ చెప్పారు.మైనారిటీ గురుకులాల నిర్వహణ, పనితీరుపై శనివారం ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి అహ్మద్ నదీమ్,విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లాతో సమీక్ష జరిపారు. వీటిలోఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు.బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో మంత్రి ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి గురుకులాల నిర్వహణ, పనితీరు, ఫలితాలు,ఉన్నతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ఈ ఏడాది 124 పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసినట్లు,వీటి కోసం 48 భవనాలను అద్దెకు తీసుకున్నట్లు షఫీవుల్లా మంత్రికి వివరించారు.వీటికి అదనపు నిధుల మంజూరు, బకాయి పడిన కిరాయిల గురించి ఆర్థిక శాఖతో  సమన్వయం చేసుకోవలసిందిగా అధికారులను మంత్రి కోరారు.ఆహార పదార్థాల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని,నాణ్యతా, పోషకాల విషయంలో ప్రమాణాలు తప్పక పాటించాలని, విద్యార్థులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని మంత్రి ఆదేశించారు.


ప్రతి శనివారం రెండు గంటలు "పాఠశాల ప్రగతి" పేరిట పరిసరాల పరిశుభ్రత, మొక్కల్ని నాటడం,వాటికి నీళ్లు పోయడం వంటి పనులు చేపట్టాలని సూచించారు.జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటి, నీట్ లోమైనారిటీ విద్యార్థులు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు. 

Updated Date - 2021-11-07T00:08:40+05:30 IST