Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 17 Sep 2021 15:47:37 IST

అటవీ అధికారులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

twitter-iconwatsapp-iconfb-icon
అటవీ అధికారులు, సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

భూపాల పల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అజంనగర్ రేంజ్ పందిపంపుల గ్రామ పరిధిలో అటవీ అధికారులు, సిబ్బందిపై జరిగిన దాడిని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. విధి నిర్వహణలో, బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేయటం సమంజసం కాదని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దాడి సమాచారం తెలుసుకున్న మంత్రి, అరణ్య భవన్ నుంచి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా బాధిత రేంజ్ అధికారి గూడూరి దివ్య, ఇతర సిబ్బందితో నేరుగా మాట్లాడారు. సంఘ‌ట‌న‌పై ఆరా తీశారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు, ఇతర ప్రభుత్వ శాఖలు స్పందించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. పోడు సమస్య పరిష్కారంపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసిందని, తొలి సమావేశం శనివారం 18వ తేదీ జరుగుతుందన్నారు. 


అటవీ పున‌ర్జీవ‌నంలో భాగంగా అట‌వీ భూముల్లో అధికారులు మొక్క‌లు నాటుతున్నార‌ని, ఇది వారి వ్య‌క్తిగ‌త విష‌యం కాదని అంద‌రూ గుర్తించాల‌న్నారు. అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టం ప్ర‌కారం  అట‌వీ అధికారులు త‌మ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నార‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎవ‌రికైనా ఇబ్బందులు ఉంటే జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా అట‌వీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాల‌ని సూచించారు. పోడు భూముల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని, గిరిజ‌న ప్రాంత ప్ర‌జ‌లు  కూడా సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు. దాడులు చేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని గుర్తించాల‌న్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారులతో పాటు అన్ని సర్కిళ్లు, జిల్లాల అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


తెలంగాణకు హరితహారంలో భాగంగా అడవుల రక్షణ, అటవీ పునరుద్దరణ పనుల్లో పాల్గొంటున్నామని రేంజ్ అధికారి దివ్య తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలను మంత్రికి వివరించారు. అటవీభూమిలో నాటిన నాలుగు వేల పండ్ల మొక్కలను తొలగించి, పోడుదారులు సాగు ప్రయత్నం చేశారని, గతంలో ఇలాంటి ప్రయత్నం చేస్తే వారించి, అటవీ భూమిని ఆక్రమించబోమని వారి నుంచి లిఖిత పూర్వకహామీ కూడా తీసుకున్నామని రేంజ్ అధికారి దివ్వ తెలిపారు. ఆ భూముల పరిశీలనకు వెళ్లిన తమపై విచక్షణారహితంగా దాడి చేశారని వివరించారు.దాడులకు వెరవకుండా విధి నిర్వహణలో పాల్గొన్న రేంజ్ ఆఫీసర్ తో పాటు, అటవీ సిబ్బందిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రశంసించారు.

దాడులు పునరావృతం కాకుండా, నిందితులకు సరైన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లాల వారీగా ఏర్పాటైన ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీలు ఇలాంటి సంఘటనలపై తక్షణం స్పందించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ కోరారు. ఉద్యోగ ధర్మంలో భాగంగా ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన సిబ్బందిపై దాడి చేయటం సమంజసం కాదన్నారు. తమ అధికారులు, సిబ్బంది ఇలాంటి దాడులకు వెనుకాడరని పీసీసీఎఫ్ అన్నారు. రాష్ట్ర అటవీ అధికారుల సంఘం, ఫారెస్ట్ రేంజ్ అధికారుల సంఘం, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ తరపున ప్రతినిధులు దాడి సంఘటనను ఖండించారు. ప్రభుత్వం తమకు అండగా ఉన్నందుకు మంత్రితో పాటు ఉన్నతాధికారులకు కృతజ్ఝతలు తెలిపారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.