తెలంగాణ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పణకు కృషి

ABN , First Publish Date - 2022-01-08T21:50:03+05:30 IST

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్లుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.

తెలంగాణ ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్యం సమర్పణకు కృషి

హైద‌రాబాద్: తిరుమ‌ల తిరుప‌తి  దేవస్థానంలో గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్న‌ట్లుగానే తెలంగాణ‌లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో  గో ఆధారిత నైవేద్యం ప్రవేశ‌పెట్టాల‌ని యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ నిర్వ‌హ‌కులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. శ‌నివారం అర‌ణ్య భ‌వ‌న్ లో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌, సేవ్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు విజ‌య రామ‌కుమార్ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి విన‌తి పత్రం  అందించారు.దేశ వ్యాప్తంగా గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసే రైతులను ప్రోత్స‌హించేందుకు వారు పండించిన ఉత్ప‌త్తుల‌ను ఆలయాల్లో  వినియోగించి,గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రిని కోరారు.  


త్వ‌ర‌లో పునః ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యంలో స్వామివారికి గో ఆధారిత నైవేద్యాన్ని  ప్రవేశపెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.తెలంగాణ‌లోని ఆల‌యాల్లో గో ఆధారిత నైవేద్య స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మాన్నిమొద‌లు పెడితే ఇక్క‌డ గో సంత‌తి వృద్ది చెందుతుంద‌న్నారు. రైతుల‌ను మ‌రింత ప్రోత్స‌హించేందుకు గోఆధారిత వ్య‌వ‌సాయంపై వారికి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్టు వివ‌రించారు.దేవ‌తామూర్తులకు స్వచ్ఛమైన ఆవుపాలు,నెయ్యి, బియ్యం, పప్పులు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ద్వారా యుగ తులసి, సేవ్‌ ఫౌండేషన్ల కృషి అభినందనీయమని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లోని దేవాల‌యాల్లో గో ఆధారిత నైవేధ్యాన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు కృషి చేస్తామ‌న్నారు.

Updated Date - 2022-01-08T21:50:03+05:30 IST