బీజెపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-05T22:39:59+05:30 IST

తెలంగాణ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

బీజెపీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలి: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మ‌ల్: తెలంగాణ  ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజెపీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ లో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ రైతు బంధు, రైతు బీమాతో పాటు అనేక  సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ  ప్రభుత్వాన్ని అంద‌రూ ప్ర‌శంసిస్తుంటే  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అడ్డ‌గోలుగా  మాట్లాడుతున్నార‌న్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తో పాటు ప్రజల నుంచి టీఆర్ఎస్ కు లభిస్తున్న మద్దతు చూసి ఓర్వలేక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టీఆర్ఎస్  ప్ర‌భుత్వంపై  అవాకులు చెవాకులు పేలుతున్నార‌ని మండి పడ్డారు.


తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వంపై  బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తే స‌హించేది లేద‌న్నారు. న‌ల్ల చట్టాలు తెచ్చి రైతుల‌ను అరిగోస పెట్టిన మీకు రైతుల గురించి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు. 70  ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మ‌కానికి పెట్టి ల‌క్ష‌లాది  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను రోడ్డు మీద‌కు  తీసుకువ‌స్తున్నమీకు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల‌పై మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పాలసీ కాకుండా సేల్ ఇండియా పాలసీ అమలు చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ  హామి ఇచ్చిన రెండు వేల కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 


జేపీ నడ్డా కాళేశ్వరం మిషన్ భగీరథ ఇలాంటి పథకాలపై వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రాజెక్టు అభివృద్ధి డిస్కవరీ ఛానల్ లో సైతం ప్రసారమైన విషయాన్ని బీజేపీ నేతలు గమనించాలని సూచించారు.మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా  మారుమూల గ్రామాల్లో సైతం ఇంటింటికి నల్ల నీరు అందుతుంటే మీ క‌ళ్ళ‌కు క‌న‌ప‌డుత లేదా అని ప్ర‌శ్నించారు.కరోనా నిబంధనలు ఉల్లంఘించి అనుమతిలేని దీక్ష చేపట్టిన బండి సంజయ్ పోలీసులపై దాడులు చేశారని, చట్టం ప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జైల్లో బండి సంజయ్ పరామర్శిస్తున్న కేంద్ర మంత్రులు... వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేఖంగా  పోరాడుతూ ప్రాణాలు కోల్పొయిన‌  రైతు కుటుంబాలు ఎందుకు పరామర్శించ లేదన్నారు. 

Updated Date - 2022-01-05T22:39:59+05:30 IST