15లోగా ఏకసంఘంగా ఏర్పడాలి: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2022-02-03T08:01:18+05:30 IST

వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.

15లోగా ఏకసంఘంగా ఏర్పడాలి: మంత్రి గంగుల

లేదంటే ప్రభుత్వం పేరుతోనే పట్టా  


హైదరాబాద్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. బుధవారం 14 ఏక కుల సంఘాలకు మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ ఆత్మగౌరవ భవన అనుమతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ఇతరులు కూడా ఫిబ్రవరి 15లోగా ఏక సంఘంగా ఏర్పడి భవన నిర్మాణ అనుమతి పొందేందు కు ముందుకు రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి చివరి నాటికి భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఏకసంఘంగా ఏర్పడని కులాలకు చెందిన భూమిని ప్రభుత్వం పేరుతో పట్టా చేసి ప్రభుత్వమే భవన నిర్మాణం, నిర్వహణ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దేశం లో 60ు జనాభా ఉన్న బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. భవిష్యత్తులో ప్రతి మండలానికి ఒక బీసీ గురుకులం ఏర్పాటు కానుందన్నారు.


బీసీ కుల సంఘాలు అడగకున్నా బీసీల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి తలసాని చెప్పారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో ఆయా సంఘాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీలను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ తపిస్తున్నారని బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌ అన్నారు.

Updated Date - 2022-02-03T08:01:18+05:30 IST