తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ధైర్యాన్నిచ్చారు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-06-06T17:59:56+05:30 IST

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ధైర్యాన్నిచ్చారు: ఎర్రబెల్లి

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ధైర్యాన్నిచ్చారు: ఎర్రబెల్లి

మహబూబ్‌నగర్: ప్రపంచం మొత్తం కరోనాతో అల్లకల్లోలంగా ఉన్నా... సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  జిల్లాలోని నెల్లికుదుర్ మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ జెడ్పిచైర్ పర్సన్ బిందు, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు ప్రజలందరు ఇక ముందు అప్రమత్తంగా, పరిశుభ్రంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. గ్రామంలో ప్రతి వ్యక్తి పరిసరాల, పరిశుభ్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ పరిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని... దీని కోసం ఎన్ని నిధులైన వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆహార నియమాలు కొంత వరకు కరోనాని కట్టడి చేయగలుగుతున్నాయని తెలిపారు. 


గ్రామాల్లో కూడా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. గత పాలనలో కరెంట్, నీళ్లు, పెట్టుబడి ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారని... సీఎం కేసీఆర్ తన పాలనలో రైతాంగానికి ఒక్క సమస్య లేకుండా చేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన ప్రజల సంక్షేమం, రైతుల విషయంలో సీఎం కేసీఆర్ ఎక్కడ రాజీ పడలేదన్నారు. రూ.7 వేల కోట్ల రైతు బంధు ఇచ్చి, రూ.30 వేల కోట్లతో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఒకప్పుడు 10 ఎకరాలు ఉండి, వ్యవసాయం చేసేటోడికి పిల్ల నిచ్చేటోడు కరువయ్యారని...కానీ సీఎం కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేయడానికి గ్రామాలకు యువత తరలి వస్తున్నారన్నారు. 


తెలంగాణ సోనా కొత్త రకం బియ్యం కోసం దేశం మొత్తం తెలంగాణ వైపు ఎదురు చూస్తోందని అన్నారు..మాహబూబాబాద్‌లో 25 వేళా మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని...త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆకేరు వాగుపై 6 కొత్త చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-06T17:59:56+05:30 IST