ప్రభుత్వమే ప్రజల పండగలను నిర్వహిస్తోంది: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-10-02T22:18:20+05:30 IST

ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండగని చేయడం చరిత్రలో ఎక్కడా లేదని పంచాయితీరాజ్,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ప్రభుత్వమే ప్రజల పండగలను నిర్వహిస్తోంది: ఎర్రబెల్లి

జనగామ జిల్లా: ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండగని చేయడం చరిత్రలో ఎక్కడా లేదని పంచాయితీరాజ్,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ప్రజల పండగలను నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భారీ ఎత్తున హాజరైన మహిళలకు ప్రభుత్వం అందచేస్తున్న బతుకమ్మ చీరలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద‌న్న‌లా ఆడ బిడ్డ‌ల‌కు మేన మామ‌లా బ‌ట్టలు పెట్టి పండుగ చేస్తున్నారని అన్నారు.  


రంజాన్, క్రిస్మస్, బ‌తుక‌మ్మ వంటి పండుగ‌ల‌కు సీఎం బ‌ట్ట‌లు పెట్టే ఆన‌వాయితీని కొన‌సాగిస్తున్నారని అన్నారు.సీఎం కేసిఆర్ అభివృద్ధి-సంక్షేమ‌ ప‌థ‌కాలతో ప్ర‌జ‌ల‌కు నిత్యం పండుగ చేస్తున్నాని పేర్కొన్నారు.బతుకమ్మ చీరల తయారీతో నేత పని వారికి చేతినిండా ప‌ని క‌ల్పించ‌డంతోపాటు, తెలంగాణ మ‌హిళ‌ల‌ను గౌర‌వించుకోవాల‌ని సీఎం కేసిఆర్ ఒక బ‌హుమ‌తిగా చీర‌ల‌ను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్ర‌తి ఏడాది రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా మ‌హిళ‌ల‌కు చీర‌లు అందిస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.రాష్ట్రంలో 20ల‌క్ష‌ల‌, 36వేల‌, 234 కుటుంబాల‌కు ఈ చీరలు అందుతున్న‌యని తెలిపారు. 


బతుకమ్మ చీరల కోసం 2019లో 313 కోట్లు ఖ‌ర్చు చేస్తే, 2020లో 317 కోట్లు ఖ‌ర్చు చేశామని, ఈ ఏడాది 333 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నట్టు మంత్రి వివరించారు.ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ స్పందన ను తెలియచేశారు. బతుకమ్మ చీరలు, పుట్టింటి సారే లాగా తమకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. మా ఇంటికి పెద్దన్నలా, ఆడ పడచులకు మేన మామ లా సీఎం కెసీఆర్ అందిస్తున్న అద్భుత కానుకగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-02T22:18:20+05:30 IST