సొంత ఖజానా కోసమే గనులు ‘గాలి’కి

ABN , First Publish Date - 2022-08-11T09:02:15+05:30 IST

సొంత ఖజానా కోసమే గనులు ‘గాలి’కి

సొంత ఖజానా కోసమే గనులు ‘గాలి’కి

సజ్జల కంపెనీల్లో జనార్దనరెడ్డి పెట్టుబడి పెట్టి బై బ్యాక్‌ చేశారు

సీమకు జగన్‌ ద్రోహం చేశారు: బీటెక్‌ రవి


అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌రెడ్డి తన సొంత ఖజానాను పెంచుకోవడానికే గాలి జనార్దనరెడ్డికి మళ్లీ గనులను ధారాదత్తం చేయడానికి సిద్ధమయ్యారు. గాలి జనార్దనరెడ్డిపై వివాదాలు వచ్చినప్పుడు ఆయనెవరో తనకు తెలియదని చెప్పిన జగన్‌ ఇప్పుడు ఆయనకే మైన్స్‌ను ధారాదత్తం చేస్తున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి) ఆరోపించారు. బుధవారం ఆయన టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గాలి జనార్దనరెడ్డి కంపెనీ ఆర్‌.ఆర్‌.గ్లోబల్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి సంస్థలలో పెట్టుబడులు పెట్టించి బై బ్యాక్‌ చేశారు. కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం జనార్దనరెడ్డికి 14 ఎకరాలిస్తే.. దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.1,000 కోట్లు తీసుకుని జైలుకు వెళ్లి నాశనం చేశారు. రూ.15 వేల కోట్ల విలువైన మైన్స్‌ను కూడా గాలి జనార్దనరెడ్డికి ధారాదత్తం చేశారు. దీనిపై ఇప్పటికీ సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. రాష్ట్రంలో ఇసుక, మద్యం అమ్మకాల ద్వారా జగన్‌రెడ్డికి కావాల్సినంత ఆదాయం వచ్చింది. ఇక మిగిలిన ఐరన్‌ ఓర్‌ ద్వారా లబ్ధి పొందాలనే గాలి జనార్దనరెడ్డికి గనులను కట్టబెట్టడానికి ప్రణాళిక రచించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామంటున్న జగన్‌రెడ్డి ముందు పులివెందులలో గెలిచి చూపించాలి. తనను ఎన్నుకున్న పులివెందుల ప్రజలకు జగన్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. సొంత చెల్లెలు, అమ్మని పార్టీలో ఉండనివ్వకుండా పంపించేశాడు. సొంత బాబాయి కూతురిని కోర్టుల చుట్టూ తిరిగేలా చేశాడు. సొంత బాబాయిని చంపి, సొంత మనుషులను కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా చంపుకుంటూ వస్తున్నారు. కుటుంబ సభ్యులకే అన్యాయం చేసినవాడు.. ప్రజలకు న్యాయం చేస్తాడా? చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని పులివెందుల స్థాయికి తీసుకువెళ్తానని జగన్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మూడు రాజధానులు నిర్మిస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్‌ తన సొంత నియోజకవర్గంలో ప్రయాణీకుల కోసం ఒక బస్టాండ్‌ను కూడా నిర్మించలేకపోయారు. జగన్‌రెడ్డి కడప జిల్లాకు, రాయలసీమకు తీరని ద్రోహం చేశారు’’ అంటూ ధ్వజమెత్తారు. 


Updated Date - 2022-08-11T09:02:15+05:30 IST