దివికేగిన దిగ్గజం

ABN , First Publish Date - 2021-06-19T09:31:09+05:30 IST

మిల్కా సింగ్‌..భారతేకాదు ప్రపంచం గర్వించతగ్గ అథ్లెట్‌. దిగ్గజ క్రీడాకారుడైనా అత్యంత సాదాసీదా జీవనం గడపడం మిల్కాసింగ్‌ గొప్పతనం.

దివికేగిన దిగ్గజం

స్ఫూర్తి ప్రదాత

కరోనాతో  కన్నుమూసిన మిల్కాసింగ్‌

గతవారమే భార్య మృతి


(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): మిల్కా సింగ్‌..భారతేకాదు ప్రపంచం గర్వించతగ్గ అథ్లెట్‌. దిగ్గజ క్రీడాకారుడైనా అత్యంత సాదాసీదా జీవనం గడపడం మిల్కాసింగ్‌ గొప్పతనం. ‘ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి’ అనే సామెతకు ఈ ఫ్లయింగ్‌ సిఖ్‌ అచ్చమైన ఉదాహరణ. భారత్‌-పాకిస్థాన్‌ విభజన సందర్భంగా జరిగిన అల్లర్లలో చిన్న వయస్సులోనే మిల్కా తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇక స్ర్పింటర్‌గా తన కల నెరవేర్చుకొనేందుకు అతడుపడ్డ కష్టం గురించి మాటల్లో చెప్పలేం. ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ పేరిట నిర్మించిన మిల్కాసింగ్‌ బయోపిక్‌ దేశ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకం. అలాంటి మిల్కాసింగ్‌ జీవితంలో కొన్ని అబ్బురపరిచే సంగతులు..


ఆ ధైర్యం..అనన్య సామాన్యం..:

మనిషి జీవితం సుఖదుఃఖాల సమాహారం. కానీ మిల్కా జీవితంలో విషాదం ఆదిలోనే చోటుచేసుకుంది. టీనేజ్‌లోకి అడుగు పెట్టకముందే..భారత్‌ విభజన సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లు మిల్కా తల్లిదండ్రులను బలిగొన్నాయి. అంతులేని ఆ విషాదాన్ని దిగమింగిన అతడు గొప్ప అథ్లెట్‌గా ఎదగడం సామాన్యమైన విషయం కాదు. 


పట్టువదలని విక్రమార్కుడు..:

పట్టుదలకు మారుపేరు మిల్కా. ఆర్మీలో చేరాలనేది అతడి మరో ఽధ్యేయం. అందుకోసం మూడుసార్లు దరఖాస్తు చేసినా అన్నిసార్లూ నిరాశే ఎదురైంది. కానీ పట్టువీడని అతడు నాలుగో ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. 


ఆ శిక్షణ అతడికే చెల్లు..:

మన టార్గెట్‌ను చేరుకొనే క్రమంలో ఎంత కష్టించాలో మిల్కాను చూస్తే తెలుస్తుంది. స్ర్పింటర్‌గా సత్తాచాటేందుకు రోజూ అత్యంత ఒత్తిడి పరిస్థితుల్లో శిక్షణ పొందేవాడు. కొండకోనల్లో, యమునా నది ఇసుక తిన్నెల్లో, దూసుకుపోయే రైళ్లతో పోటీపడి పరిగెత్తేవాడు. ఈక్రమంలో రక్త వాంతులైనా, డీహైడ్రేషన్‌తో సొమ్మసిల్లినా భయపడకుండా శిక్షణ కొనసాగించడం మిల్కాకే చెల్లింది. 


ఎంత ఎదిగినా ఒదిగే..:

లభించిన పేరు ప్రతిష్ఠలతో గర్వం, డాబు, దర్పం ప్రదర్శించకూడదనేది మిల్కా మనస్తత్వం. కెరీర్‌లో బరిలోకి దిగిన 80 రేసుల్లో 77 గెలిచినా అతడు ఏనాడూ ఉదాసీనత కనబర్చలేదు. కామన్వెల్త్‌ క్రీడలైనా, ఏషియన్‌ గేమ్స్‌ విజయాలయినా సాధించింది చాలు అనుకోలేదు. నిత్య సాధనతో ఇంకా మెరుగయ్యేందుకు ప్రయత్నించాడు. ప్రతి విజేతా మిల్కాసింగ్‌ నిరంతర తపనను చూసి ఎంతో నేర్చుకోవాలి.


ఒక్క పతకమూ ఉంచుకోలేదు..:

కెరీర్‌లో ఎన్నో విజయాలు, మరెన్నో పతకాలు. కానీ ఒక్క మెడల్‌నూ తన దగ్గర ఉంచుకోలేదు మిల్కాసింగ్‌. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి తన పతకాలన్నింటినీ ఇచ్చేశాడు. మరో అథ్లెట్‌ అయితే సాధించిన మెడల్స్‌ అన్నింటినీ తన గదిలో అందంగా అలంకరించుకొని మురిసిపోయేవాడే. 


న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్‌ దిగ్గజం ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ మిల్కా సింగ్‌ (91) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నెల రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతున్నారు. గత నెల 20న మిల్కాకు మొదట కరోనా సోకగా 24న మొహాలీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అదే నెల 30న డిశ్చార్చి అయినప్పటికీ తిరిగి ఈనెల 3న ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో చండీగఢ్‌లోని పీజీఐఎంఆర్‌లో చేర్పించారు. దీంతో గురువారం నెగెటివ్‌గా తేలడంతో మిల్కాను సాధారణ వార్డుకు మార్చారు. కానీ శుక్రవారం విపరీత జ్వరం.. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడంతో తిరిగి ఐసీయూకు మార్చాల్సి వచ్చింది. కానీ పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి మరణించాడు. గత ఆదివారమే మిల్కా భార్య నిర్మల్‌ కౌర్‌ (85) కరోనాతోనే మృతి చెందింది. భారత క్రీడారంగంలో ఆణిముత్యంలా వెలిగిన మిల్కా.. 1958 కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణంతో పాటు ఆసియా క్రీడల్లో నాలుగు పసిడి పతకాలు సాధించాడు. ఇక.. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. 

Updated Date - 2021-06-19T09:31:09+05:30 IST