వలస కూలీలకు ఆపన్నహస్తం

ABN , First Publish Date - 2020-04-01T08:29:19+05:30 IST

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు రాష్ట్ర సర్కారు ఆపన్నహస్తం అందించింది. వారిని ఆదుకునేందుకు ఉపశమన చర్యలు చేపట్టింది.

వలస కూలీలకు ఆపన్నహస్తం

పొరుగు రాష్ట్రాల వారికి బియ్యం, డబ్బు పంపిణీ

ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు

జిల్లాల్లో పంపిణీని చేపట్టిన యంత్రాంగం

తెలంగాణలో 1.94 లక్షల మంది కూలీల గుర్తింపు

నేటి నుంచి బియ్యం పంపిణీ!

లబ్ధిదారునికి 12 కిలోలు.. 87.54లక్షల కార్డులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిక్కుకుపోయిన వలస కూలీలకు రాష్ట్ర సర్కారు ఆపన్నహస్తం అందించింది. వారిని ఆదుకునేందుకు ఉపశమన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాల యంత్రాంగం కదిలి వలస కూలీలను గుర్తించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ కూలీలకు బియ్యం, డబ్బు పంపిణీ చేశారు. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కూలీలు వచ్చారు.


లాక్‌డౌన్‌ కారణంగా వారు అటు సొంత రాష్ట్రాలకు వెళ్లలేక, ఇటు కూలీ పనులు దొరక్క పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది కాలినడకన స్వరాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే వీరి ద్వారా వైరస్‌ ప్రబలే ప్రమాదమున్నందున అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కూలీలు తెలంగాణలోనే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీలను ఆదుకునే చర్యలు చేపట్టింది. అధికారులు ఇప్పటివరకు రాష్ట్రంలో 1.94 లక్షల మంది కూలీలను గుర్తించారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ చేశారు.  మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చి సింగరేణిలో పనిచేస్తున్న కూలీలకు కూడా బియ్యం, డబ్బును పంపిణీ చేశారు. కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, సూర్యాపేట, జనగామ, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, రాజన్న-సిరిసిల్ల, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లోనూ వలస కూలీలకు సరుకులు అందించారు. నారాయణపేట జిల్లాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులను, ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న 5,458 మందికి రేషన్‌ పంపిణీ చేశారు. పాలమూరు నుంచి ఉపాధి కోసం వలసవెళ్లిన 4,141 మంది కూలీలు తిరిగి జిల్లాకు వచ్చారు. వారందరికీ బియ్యం, నగదు ఇచ్చారు. జడ్చర్లలో చిక్కుకుపోయిన 60 మంది జార్ఖండ్‌ కూలీలకు పెద్దాయపల్లిలో వసతి, భోజన సదుపాయాలు కల్పించారు.


అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రాష్ట్ర కూలీల అడ్డగింత

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్‌ నుంచి కాలినడకన వచ్చిన వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 30 మంది కూలీలు లాతూర్‌లోని ప్రైవేటు కంపెనీలలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారంతా కాలినడకన స్వగ్రామాలకు బయలుదేరారు. సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వీరిని పోలీసులు అడ్డుకుని కూర్చోబెట్టారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన తరువాత స్వగ్రామాలకు పంపే ఏర్పాటు చేస్తామని చెప్పారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భవానీ ఆధ్వర్యంలో కూలీలకు భోజన సదుపాయం కల్పించారు. అలాగే మహారాష్ట్రలోని అకోలా నుంచి కాలినడకన నవీపేట మండలంలోని యంచ చెక్‌పోస్టుకు చేరిన 20మంది తెలంగాణ కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో భోజన సౌకర్యాలు కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు.


అన్నార్తుల కోసం 21 వేల శిబిరాలు: కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 31: లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కూలీలు, నిరాశ్రయుల కోసం దేశవ్యాప్తంగా 21 వేల శిబిరాలను ఏర్పాటు చేశామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. 23 లక్షలకుపైగా అన్నార్తులకు ఈ శిబిరాల్లో ఆహారం అందిస్తున్నామని పేర్కొంది.


Updated Date - 2020-04-01T08:29:19+05:30 IST