‘ఓయో’లో మైక్రోసాఫ్ట్‌కు వాటా!

ABN , First Publish Date - 2021-07-31T06:25:41+05:30 IST

భారత్‌కు చెందిన ఆతిథ్య రంగ స్టార్టప్‌ ఓయోలో వాటా కొనుగోలుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘ఓయో’లో మైక్రోసాఫ్ట్‌కు వాటా!

న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఆతిథ్య రంగ స్టార్టప్‌ ఓయోలో వాటా కొనుగోలుకు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య చర్చలు పురోగతిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్‌ ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టనుందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే, స్వల్ప వాటానే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించేందుకు ఇరు వర్గాలు నిరాకరించాయి. ఈ పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా ఓయో మార్కెట్‌ విలువను 900 కోట్ల డాలర్లు (సుమారు రూ.67,000 కోట్లు)గా లెక్కగట్టే అవకాశం ఉంది. ఓయో తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) కంటే ముందే వాటా కొనుగోలు పూర్తి కావచ్చని తెలుస్తోంది. అయితే, పబ్లిక్‌ ఇష్యూపై ఓయో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


రూ.4,920 కోట్ల సమీకరణ : అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఓయో ఇటీవలి కాలంలో 66 కోట్ల డాలర్లు (సుమారు రూ.4,920 కోట్లు) సమీకరించింది. టర్మ్‌లోన్‌ బీ ఫండింగ్‌ ద్వారా సేకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. 


ఓయో ప్రస్థానం: గొలుసుకట్టు హోటళ్ల నిర్వహణ సంస్థ ఓయో 2013లో ప్రారంభమైంది. తొలుత భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ.. ప్రస్తుతం ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాల్లోని 80 దేశాలకు విస్తరించింది. లక్షకు పైగా హోటళ్ల నెట్‌వర్క్‌ కలిగి ఉంది. ఈ స్టార్ట్‌పలో జపాన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌, సికోయా క్యాపిటల్‌, లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌, హీరో ఎంటర్‌ప్రైజెస్‌ తదితర సంస్థలు పెట్టుబడులు కలిగి ఉన్నాయి. త్వరలో మైక్రోసాఫ్ట్‌ కూడా వీటి సరసన చేరనుంది. కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారం స్తంభించిపోయింది. దాంతో ఓయో సంక్షోభంలోకి జారుకుంది. 2019లో 1,000 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువ.. గత కొన్ని త్రైమాసికాల క్రితం 300 కోట్ల డాలర్లకు పడిపోయింది. మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు కంపెనీ మార్కెట్‌ విలువ పెంపునకు దోహదపడనున్నాయి. కరోనాతో కుదేలైన హోటళ్ల వ్యాపారం ఈ ఏడాది నిలకడగా పుంజుకుంటోందని ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ రితేష్‌ అగర్వాల్‌ అన్నారు. 

Updated Date - 2021-07-31T06:25:41+05:30 IST