ఎన్నారై డెస్క్: స్నేహితులు, కుటుంబసభ్యులు ఆపదలో ఉన్నారని తెలిసిన వెంటనే వారిని కాపాడుకునేందుకు ముందుకు ఉరుకుతాం. మనమున్న స్థితి ఏంటి..? తరువాత ఏం చేయాలి..? వంటి ఆలోచనలు రావు. వారి కోసం చేయగలిగినంతా చేయాలనే తపనే మనసంతా ఆవరిస్తుంది. తాజాగా అమెరికాకు చెందిన మెటియోరాలజిస్ట్(వాతావరణ అధ్యయనకర్త) సరిగ్గా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ఎన్‌బీసీ వాషింగ్టన్ చానల్‌లో గురువారం వాతావరణ వార్తలు చదువుతున్న ఆయన.. తన కుటుంబం ప్రమాదంలో పడబోతోందని తెలిసి వెంటనే లైవ్‌లో ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం అమెరికా మొత్తం వైరల్ అవుతోంది.
సుమారు 8.45 గంటలకు ఆయన లైవ్‌లో వాతావరణ రిపోర్టు ఇస్తుండగా.. ఓ సుడిగాలి తన నివాసం ఉంటున్న ప్రాంతం గుండా వెళ్లబోతోందన్న వార్త చేరింది. ఆ సుడిగాలి తాను ఉంటున్న ఇంటి మీద నుంచే వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించిన ఆయన షో మధ్యలోనే ఇంటికి కాల్ చేశాడు. అవతలి.. తన కుమారుడు ఫోన్ ఎత్తడంతో సుడిగాలి రాబోతున్న విషయాన్ని చెప్పి.. ఇంట్లోవాళ్లందరూ ఇంట్లోనే ఉన్న సెల్లార్‌లోకి వెళ్లి దాక్కువాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు సూచించాక.. కుదుటపడ్డ ఆయన..సుడిగాలి విషయాన్ని ముందుగా మావాళ్లకు చెప్పాలి అంటూ కాల్ కట్ చేశారు. ఆ తరువాత యథాప్రకారం.. తన వార్తలను కొనసాగించారు. కాగా.. ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇది జరిగిన కొద్ది సేపటికే వాతావరణ శాఖ సుడిగాలి వస్తోందన్న హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు. దీంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. ‘‘లైవ్‌లో ఇలా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ.. వాతావరణ అధ్యయనకారులకు సుడిగాలి వల్ల కలిగే ప్రమాదం ఎంతటిదో తెలుసు. ఇటువంటి ఘటనలు మనసును కదిలిస్తాయి.’’ అంటూ మరో మెటియోరాలజిస్ట్ వ్యాఖ్యానించారు.