బ్యాంకుల విలీనాలు ఇక కష్టమే!

ABN , First Publish Date - 2020-02-24T10:23:32+05:30 IST

బ్యాంకుల విలీనాలు ఇక కష్టమే!

బ్యాంకుల విలీనాలు ఇక కష్టమే!

  • ఇంకా కొలిక్కి రాని అనుమతుల ప్రక్రియ 
  • గడువింకా నెల రోజులే.. 

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీన ప్రక్రియ ఇప్పట్లో తేలేలా లేదు. ఈ సంవత్సరం మార్చి చివరి నాటికల్లా అన్ని అనుమతులు పూర్తి చేసి ఏప్రిల్‌ 1 నుంచి 10 పీఎ్‌సబీలను విలీనం చేసిన నాలుగు పీఎ్‌సబీలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు అవసరమైన రెగ్యులేటరీ అనుమతులు, ఇతర అనుమతుల ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇందుకు అనేక అంశాలు అడ్డంకులుగా  మారాయి. అవేంటంటే..


 అన్నింటికీ ఆటంకాలే..

పది పీఎ్‌సబీల మెగా విలీనానికి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఇంకా షేర్ల కేటాయింపు నిష్పత్తి, సంబంధిత బ్యాంకు వాటాదారుల అనుమతులు, ఇతర నిబంధనలు పూర్తి కాలేదు. ఇందుకు ఇంకా ఎంత లేదన్నా మరో నెల, నెలన్నర రోజుల సమయం పడుతుందని అంచనా. దీనికి తోడు ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఈ విలీన ప్రక్రియలో ఉన్న బ్యాంకుల నుంచి పూర్తి వివరాలు కోరింది. విలీనం తర్వాత వచ్చే మూడు, ఐదేళ్లలో ఏర్పడే మొండి బకాయిలు, మూలధన అవసరాలు, పరపతి వృద్ధి రేటు, విలీనంతో ఏర్పడే పొదుపు వివరాలు సమర్పించాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు ఈ పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నాటికల్లా ఈ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు పెద్దగా లేవని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.


పార్లమెంట్‌ ముందుకే రాలేదు..

పీఎ్‌సబీల విలీనానికి పార్లమెంట్‌ ఆమోదం కూడా తప్పనిసరి. ఇందుకు అవసరమైన వివరాలను నెల రోజుల ముందే పార్లమెంట్‌కు సమర్పించాలి. బడ్జెట్‌ రెండో విడత పార్లమెంట్‌ సమావేశాలు వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎ్‌సబీల విలీనంపై పార్లమెంట్‌కు ఎలాంటి వివరాలు సమర్పించలేదు.


సాంకేతిక సమస్యలు..

కాగా విలీన బ్యాంకులు తమ బ్యాంకిం గ్‌ అవసరాల కోసం ఒక్కో టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. విలీనం తర్వాత వీటి అనుసంధానం పెద్ద సమస్యగా మారింది. విజయా బ్యాం క్‌, దేనా బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో పది నెలల క్రితం విలీనమయ్యాయి. ఈ మూడు బ్యాంకుల సాఫ్ట్‌వేర్‌ అనుసంధానం సమస్య ఇప్పటికీ తేలలేదు. కొత్తగా తలపెట్టిన 10 పీఎ్‌సబీల విలీనంలోనూ ఇదే సమస్య తలెత్తుతుందని భావిస్తున్నారు. 


ఉద్యోగుల వ్యతిరేకత..

పీఎ్‌సబీల ఉద్యోగులు మొదటి నుంచి విలీనాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ విలీనాలతో కొన్ని శాఖలను మూసివేయక తప్పదు. అప్పుడు చాలామంది ఉద్యోగులను ఏదో ఒక పేరుతో బయటికి పంపించే ప్రమాదం ఉందనేది వారి భయం. దీనికి తోడు ప్రస్తుతం విలీనం తలపెట్టిన ఏ పీఎ స్‌బీ బోర్డులోనూ ఆయా బ్యాంకుల ఆఫీసర్లకుగానీ, ఉద్యోగులకు గానీ స్థానం లేదు. పూర్తిస్థాయి బోర్డు ఆమోదం లేకుండా జరిపే విలీన ప్రక్రియ చెల్లదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 


ఆర్థిక మందగమనానికి, పీఎ్‌సబీల కష్టాల నివారణకు విలీనాలు పరిష్కారం కాదు. పీఎ్‌సబీలను మరింత విస్తరించడమే ఈ సమస్యలకు పరిష్కారం.

- సీహెచ్‌ వెంకటాచలం, ప్రధాన కార్యదర్శి, ఏఐబీఈఏ


విలీనం చేయాలని నిర్ణయించిన ఏ బ్యాంకు బోర్డులోనూ అధికారులకు గానీ, ఇతర సిబ్బందికి గానీ చోటు లేదు. వారికి స్థానం లేకుండా తీసుకున్న ఏ నిర్ణయమైనా చట్టవిరుద్ధం అవుతుంది.

- సౌమ్య దత్తా, ప్రధాన కార్యదర్శి, ఏఐబీఓసీ

Updated Date - 2020-02-24T10:23:32+05:30 IST