ప్రవక్త గగనయాత్ర.. మేరాజ్‌!

ABN , First Publish Date - 2021-03-12T05:49:04+05:30 IST

మహా ప్రవక్త మహమ్మద్‌ జీవితంలో సంభవించిన సంఘటనల్లో అద్భుతమైనది మేరాజ్‌. కరుణామయుడైన అల్లాహ్‌ తన ప్రవక్తను రజబ్‌ మాసంలోని ఇరవై ఏడవ రోజున... రాత్రిలోని కొంత భాగంలో గగనయాత్ర చేయించాడు. ‘దైవప్రవక్తలందరికీ నాయకుడు’ అనే

ప్రవక్త గగనయాత్ర.. మేరాజ్‌!

మహా ప్రవక్త మహమ్మద్‌ జీవితంలో సంభవించిన సంఘటనల్లో అద్భుతమైనది మేరాజ్‌. కరుణామయుడైన అల్లాహ్‌ తన ప్రవక్తను రజబ్‌ మాసంలోని ఇరవై ఏడవ రోజున... రాత్రిలోని కొంత భాగంలో గగనయాత్ర చేయించాడు. ‘దైవప్రవక్తలందరికీ నాయకుడు’ అనే అరుదైన బిరుదును ఆయనకు ప్రసాదించాడు. ప్రత్యేక ప్రవక్తలందరినీ మహమ్మద్‌కు పరిచయం చేశాడు. స్వర్గ, నరకాల దర్శన భాగ్యాన్ని కల్పించాడు. ప్రత్యేక దేవదూత అయిన జిబ్రీల్‌కు సైతం వెళ్ళడానికి అనుమతి లేని ప్రదేశానికి... అంటే తనకు అత్యంత సామీప్యానికి మహాప్రవక్తను అల్లాహ్‌ ఆహ్వానించాడు. ఆయనతో ప్రత్యేకంగా సంభాషించాడు. తన కారుణ్య వృష్టిని ఆయనపై కురిపించాడు. బహుమతులు అందజేశాడు. ఇంకా... మహాప్రవక్త అనుయాయులకోసం ప్రత్యేక బహుమానంగా నమాజ్‌ను ప్రసాదించాడు.


మహా ప్రవక్త మహమ్మద్‌ ఒక్క రాత్రిలో చేసిన ఈ ఆకాశయానం ఆయనను అనుసరించేవారిలో విశ్వాసాన్ని వికసింపజేస్తుంది. అవిశ్వాసులను యథావిధిగా సంశయంలో పడేస్తుంది.  


ప్రవక్త పదవిని మహమ్మద్‌ చేపట్టిన పన్నెండేళ్ళకు... అంటే ఆయన 25 ఏట (క్రీస్తుశకం 622లో)... రజబ్‌ మాసం ఇరవై ఏడో రోజున జరిగింది. మహా ప్రవక్త మహమ్మద్‌ ఒక్క రాత్రిలో చేసిన ఈ ఆకాశయానం ఆయనను అనుసరించేవారిలో విశ్వాసాన్ని వికసింపజేస్తుంది. అవిశ్వాసులను యథావిధిగా సంశయంలో పడేస్తుంది. ఒక్క రాత్రిలో మెరుపు గుర్రం (బురాఖ్‌)పై చేసిన ఈ సుదీర్ఘ యాత్రలో... ప్రముఖ మసీదులనూ, ప్రదేశాలనూ మహమ్మద్‌ సందర్శించారు. మొదట ఆకాశాన్ని చేరుకున్న ఆయనను దైవదూతలు ఘనంగా స్వాగతించారు. ప్రవక్తతో జిబ్రాయిల్‌ కొంత దూరం వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను కుడివైపు చూసినప్పుడు గలగలా నవ్వుతున్నాడు. ఎడమవైపు చూసినప్పుడు దుఃఖిస్తున్నాడు. 


ఇది గమనించిన దైవప్రవక్త ‘‘ఎవరీ వ్యక్తి? ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘ఈయన మానవజాతి మూలపురుషుడు ఆదమ్‌. కుడివైపు ఉన్న పుణ్యాత్ములైన సంతానాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఎడమవైపు ఉన్న పాపాత్ములైన సంతానాన్ని చూసి దుఃఖిస్తున్నారు’’ అన్నారు జిబ్రాయిల్‌. ఒక చోట కొందరు పొలంలో పైరు కోస్తున్నారు. ఆ పంట వెంటనే మొలుస్తోంది. దైవ ప్రవక్త ‘‘ఎవరీ మనుషులు?’’ అని అడిగారు. ‘‘వీరు దైవమార్గంలో పోరాడేవారు’’ అని జిబ్రాయిల్‌ చెప్పారు. కొందరి తలలను అక్కడ బండరాళ్ళతో చితగ్గొడుతున్నారు. ‘‘వీరు నిద్రమత్తులో నమాజ్‌ చేయడానికి లేచేవారు కాదు’’ అన్నారు జిబ్రాయిల్‌. అతుకుల వస్త్రాలతో, పశువుల్లా గడ్డి మేస్తున్న వారిని చూపుతూ, ‘‘వీరు జకాత్‌, ఇతర దానధర్మాలూ చేయని వారు’’ అని చెప్పారు. కొందరి నాలుకలనూ, పెదవులనూ దైవ దూతలు కత్తిరిస్తున్నారు. ‘‘వీరు విశృంఖలంగా ప్రసంగిస్తూ అల్లర్లు, అలజడులూ సృష్టించే బాధ్యతారహితులైన ప్రసంగీకులు’’ అని తెలియజేశారు జిబ్రాయిల్‌.


ఒక చోట కొందరు వ్యక్తులు తమ శరీరం నుంచి మాంసాన్ని కోసుకొని తామే తింటున్నారు. వీరు ఇతరులను ఎగతాళి, హేళన చేసేవారని జిబ్రాయిల్‌ చెప్పారు.కొందరు వ్యక్తులు వాడిగా ఉన్న రాగి గోళ్ళతో తమ ముఖాలనూ, రొమ్ములనూ రక్కుకుంటున్నారు. ‘‘వీరు ఇతరుల గురించి పరోక్షంగా నిందిస్తూ అవమానించేవారు’’ అన్నారు జిబ్రాయిల్‌. ఇలా ఆ మార్గంలో మహా ప్రవక్తకు అనేకమంది వ్యక్తులు తారసపడ్డారు. వారి స్థితి ఎందుకు అలా ఉన్నదనేది జిబ్రాయిల్‌ ఆయనకు వివరించి చెప్పారు.ఆ తరువాత రెండో ఆకాశంలో హజ్రత్‌ యహ్‌య హజ్రత్‌ ఈసా, మూడో ఆకాశంలో పున్నమి చంద్రుడిలా అసమాన సౌందర్యంతో ఉన్న యువకుడు యూసఫ్‌, నాలుగో ఆకాశంలో ఇద్రీస్‌, అయిదో ఆకాశంలో హారూన్‌, ఆరో ఆకాశంలో మూసాలను మహా ప్రవక్తకు జిబ్రాయిల్‌ పరిచయం చేశారు. ఏడో ఆకాశంలో ప్రవక్తను పోలిన వ్యక్తిని హజ్రత్‌ ఇబ్రహీంగా పరిచయం చేశారు. అక్కడి నుంచి సిద్రతుల్‌ మున్తహా వరకూ వచ్చి, జిబ్రాయిల్‌ ఆగిపోయారు.అక్కడ సృష్టికర్త అయిన అల్లా్‌హతో మహా ప్రవక్త సంభాషించారు.


ఈ సందర్భంగా అయిదు పూటలా చేసే నమాజ్‌ను యాభై సార్లు చేసే నమాజ్‌తో అల్లాహ్‌ సమానం చేశారు. అలాగే, సూరే బఖరలోని చివరి రెండు ఆయత్‌లనూ బోధించారు. అనంతరం మహా ప్రవక్త భూమి మీదకు తిరిగి వచ్చి, బైతుల్‌ మఖ్ద్‌సను చేరిన తరువాత, తన నేతృత్వంలో అందరు ప్రవక్తలతో నమాజ్‌ చేయించారు. ఈ విధంగా మేరాజ్‌ సంఘటన ఎన్నో విశేషాలను సంతరించుకుంది.            

 మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-03-12T05:49:04+05:30 IST