Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎన్టీఆర్‌ సినిమా కథతో వీరిద్దరి సినిమా!

హిందీలో విజయవంతమైన ‘దో ఆంఖే బారా హాత్‌’ సినిమాను ‘మా దైవం’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఎన్టీఆర్‌ అందులో హీరోగా నటించారు. తెలుగులో పెద్దగా ఆడలేదు ఆ సినిమా. రచయిత సత్యానంద్‌కు ‘దో ఆంఖే బారా హాత్‌’ సినిమా అంటే చాలా ఇష్టం. సందేశాత్మక చిత్రమే అయినా దానికి కొన్ని కమర్షియల్‌ అంశాలు జోడిస్తే మంచి సినిమా అవుతుందని ఆయన నమ్మకం. అందుకే ఆ సినిమా ‘మా దైవం’ పేరుతో తెలుగులో వచ్చినా ఒరిజనల్‌ హిందీ వెర్షన్‌లోని పాయింట్‌ నచ్చడంతో దాని ప్రేరణతో కొత్త కథ తయారు చేశారు సత్యానంద్‌.


విధివంచితులై దొంగలుగా ముద్ర వేయించుకొని శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు యువకుల్లో ఎక్కడో మానవతాకోణం ఉందని ఓ పోలీస్‌ ఆఫీసర్‌ గమనించి, ప్రత్యేక అనుమతి తీసుకొని వారిద్దరినీ తన ఇంటికి తీసుకువస్తాడు. చట్టం  నేరస్తులుగా నిర్ధారించి, శిక్ష వేసిన దొంగల్ని ఒక పోలీస్‌ అధికారి తన ఇంటికి తెచ్చుకొని వారిలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా అనుమతి లభిస్తుందా? అనే  ప్రశ్న స్టోరీ డిస్కషన్స్‌ సమయంలో తలెత్తింది. అప్పటికే సత్యానంద్‌ ‘ఖైదీ బాబాయ్‌’ చిత్రానికి రచన చేశారు. అందులో ఓ ఖైదీని గ్రామాన్ని బాగుచేయడానికి జడ్జి పంపిస్తాడు. ‘ఖైదీబాబాయ్‌’ సక్సెస్‌ కావడంతో అదే ఫార్ములాని ‘ఇద్దరు దొంగలు’ చిత్రంలోనూ ఉపయోగించారు సత్యానంద్‌. దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు, హీరోలు కృష్ణ, శోభన్‌బాబులకు ఈ కథ బాగా నచ్చింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మాతగా 1983 జూన్‌ 1న వాహినీ స్టూడియోలో ‘ఇద్దరు దొంగలు’ చిత్రం ప్రారంభమైంది.


‘ఇద్దరు దొంగలు’ ప్రారంభమైన మూడు నెలలకు అంటే సెప్టెంబర్‌ 2న కృష్ణ, కృష్ణంరాజు హీరోలుగా మరో మల్టీసార్టర్‌ ‘యుద్ధం’ మొదలైంది. దీనికి దాసరి నారాయణరావు దర్శకుడు. 

ముందు ప్లాన్‌ చేసిన ప్రకారం ‘ఇద్దరు దొంగలు’ విజయదశమి సందర్భంగా అక్టోబర్‌లో, ‘యుద్ధం’ సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కావాలి. అయితే రాఘవేంద్రరావు ఆరోగ్యం దెబ్బతిని , ఆపరేషన్‌ చేయాల్సి రావడంతో ‘ఇద్దరు దొంగలు’ నిర్మాణంలో జాప్యం జరిగింది. దాంతో అనివార్య పరిస్థితుల్లో ‘ఇద్దరు దొంగలు’, ‘యుద్ధం’ సినిమాలు ఒకేరోజున అంటే 1984 జనవరి 14న  పోటాపోటీగా విడుదలయ్యాయి. ఒక హీరో నటించిన రెండు మల్టీస్టారర్లు ఒకేరోజున విడుదల కావడమన్నది తెలుగు సినీ చరిత్రలో అదే ప్రథమం. ఈ పోటీలో ‘ఇద్దరు దొంగలు’ దే పై చేయి అయింది.

-వినాయకరావు


Advertisement
Advertisement